జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

"సత్య హరిశ్చంద్రీయము" @ వందేళ్లు

 

ఆంధ్రదేశంలో పుట్టిన హరిశ్చంద్ర చక్రవర్తికి వందేళ్లు దాటిపోయాయి. ఆధునిక తెలుగు సాహిత్య దశ ప్రారంభమైన తరువాత 1889లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు మొట్టమొదటి సారిగా హరిశ్చంద్ర నాటకాన్ని రచించి తెలుగు ప్రజలకు అందించారు. వీరేశలింగం పంతులు గారి తరువాత, సుప్రసిద్ధ తెలుగు కవుల చేతిలో సుమారు 28 సార్లు వారి వారి కవితాశైలిలో హరిశ్చంద్ర నాటకం రూపుదిద్దుకుంది.ఎన్నిసార్లు, ఎందరి కవుల కలాల నుంచి హరిశ్చంద్ర చక్రవర్తి తెలుగు పద్యనాటక రూపంలో పుట్టినప్పటికీ, బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి రచించిన "సత్య హరిశ్చంద్ర" పద్యనాటకం మాత్రం తెలుగు ప్రజల హృదయాలు గెలిచి శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది. 1912లో "సత్య హరిశ్చంద్రీయము" అనే పేరుతో బలిజేపల్లి లక్ష్మికాంతం కవి పౌరాణిక పద్య నాటకాన్ని తనదైన శైలిలో రచించాడు.ఈ నాటకం ప్రజల్లోకి వెల్లిన తరువాత అంతకు ముందు, ఆ తరువాత రచింపబడిన హరిశ్చంద్ర నాటకాలన్నీ కనుమరుగై పోయాయి. బలిజేపల్లి లక్ష్మీకాంతం రచించిన "సత్య హరిశ్చంద్ర" నాటకానికి తెలుగునాట అత్యంత ప్రజాదరణ లభించింది. దశాబ్దాలుగా ఆంధ్రదేశంలో వాడవాడలా ప్రదర్శించబడి ప్రజల నీరాజనాలు అందుకుంటూనే ఉంది. ఒకానొక దశలో హరిశ్చంద్ర నాటక  ప్రభావంతో తెలుగునాట ఊరికొక హరిశ్చంద్ర నాటక కళాకారుడు ఉద్భవించాడనటంలో ఏ మాత్రం సందేహం లేదు. స్వతహాగా తెలుగు పండితుడైన బలిజేపల్లి లక్ష్మీకాంతం తెలుగు భాషపై మంచి పట్టున్న గొప్ప కవి, రచయిత, కళాకారుడు. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా ఇటికంపాడు అనే గ్రామంలో 1881డిసెంబర్ 23న జన్మించారు. గుంటూరు హిందూ కళాశాల హైస్కూల్లో కొంతకాలం తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఆ తరువాత సినీరంగ ప్రవేశం చేసి ఎన్నో గొప్ప చిత్రాలకు మాటల రచయితగా పని చేశారు.బలిజేపల్లి విరచిత హరిశ్చంద్ర నాటకం ప్రజల ముందుకు వెళ్లిన తరువాత ఊరూ వాడా అన్న తేడా లేకుండా ఆంధ్ర దేశమంతటా మారు మోగి పోయి నీరాజనాలు అందుకుని ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. తెలుగునేలపై పేరు ప్రఖ్యాతులు గడించిన సుప్రసిద్ధ నాటకాలైన గయోపాఖ్యానం, పాండవోద్యోగ విజయాలు, రామాంజనేయ యుద్ధం, చింతామణి, బాలనాగమ్మ, బొబ్బిలి యుద్ధం వంటి పౌరాణిక నాటకాల సరసన సత్య హరిశ్చంద్ర నాటకం మణిపూసగా ముందు వరుసలో నిలిచింది. తొలిరోజుల్లో బలిజేపల్లి స్వయంగా హరిశ్చంద్ర పాత్రధారిగా, నక్షత్రకుడిగా నటించి ప్రజల మన్ననలు పొందాడు. ఆ తరువాత ఇప్పటి వరకు తెలుగులో వున్న పద్య నాటకాల కన్నా హరిశ్చంద్ర ఎనలేని గుర్తింపు, అత్యంత ప్రజాదరణ పొంది ఆబాల గోపాలాన్ని అలరించి తెలుగు పద్య రంగస్థలంలో తిరుగు లేని ఖ్యాతి గడించింది.హరిశ్చంద్రుడు ఇక్ష్వాకుల వంశానికి చెందిన చక్రవర్తి."సముద్రములింకిననూ, పర్వతములు కూలిననూ, మూడు భువనములు ధ్వంసమైననూ హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పడు". అని ప్రచారం. ఇంద్రసభలో జరిగిన చర్చలో ఇది నిజమా? కాదా? అన్న సందేహం కలిగి హరిశ్చంద్రుని సత్యనిష్ఠను పరీక్షించడంమే నాటక ఇతివృత్తం.సత్యం కోసం, ఆడిన మాట కోసం ఎంత గొప్ప త్యాగానికైనా వెనుకాడని ధీరోదాత్త నాయకుని కథే హరిచంద్ర నాటక సారాంశం.

తెలుగు ప్రజలకు మాత్రమే సొంతమైన సాహిత్య ప్రక్రియ పద్యం. ఛందోబద్ధ రాగయుక్తమైన పద్యం ఆంధ్రుల అదృష్టం. ఇలాంటి పద్య సాహిత్యం పండితులకే కాదు పామరులకు కూడా అన్న రీతి సత్య హరిశ్చంద్ర నాటకం తరువాత పూర్తిగా నిరూపితమైంది. పట్టణాలు, గ్రామాలు, ఊర్లు దాటించి పల్లెలకు కూడా పద్య నాటకాన్ని తీసుకెళ్లిన ఘనత హరిశ్చంద్ర నాటకం ద్వారా సాధ్యమైంది. సులభంగా అర్థమయ్యే భావంతో బలిజేపల్లి కలం నుంచి జారిపడ్డ కరుణ రసాత్మక పద్యాలు దీనికి కారణం అయ్యాయి. హరిశ్చంద్రలోని పద్యాలు ఒక్కసారి వింటే పద్య సాహిత్యం పట్ల ఎవరైనా ఆకర్షితులవుతారు. "ఈ లోకంలో అబద్దం చెప్పని వ్యక్తి ఉన్నాడా..?" అన్న ప్రశ్నతో నాటకం ప్రారంభమవుతుంది. ఆరు అంకాల ఈ నాటకంలో అడవిసీను,వారణాసి ఒక ఎత్తైతే  కాటిసీను గుండె లాంటిది.కరుణ రసాత్మకమైన ఈ మూడు ఘట్టాల కోసం రసజ్ఞులైన ప్రేక్షకులు ఎదురుచుసే వారు. ఈ నాటకం తెల్లవార్లూ ప్రదర్శించబడేది. చిన్నాపెద్ద ఆడామగా అన్న తేడా లేకుండా హార్మోనియం రాగాలతో రాగయుక్త ఆలాపనతో జనం మైమరచి ఓలలాడే వాళ్లు.నాటకం ఆద్యంతం ఒక్కసారైనా కన్నీరు పెట్టని ప్రేక్షకులు ఉండేవారు కాదని చెబుతుండేవారు.  హరిశ్చంద్రుడు సర్వస్వాన్ని కోల్పోయినప్పుడు పాడే..."తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సాగిరావేరికేసరికేపాటు విధించెనో విధి.." అన్న పద్యం ఓ ఆణిముత్యం. ఇలాంటి ఆణిముత్యాలు నాటక ఆసాంతం ఎన్నో కనిపిస్తాయి,అలరిస్తాయి. ఎంతో ప్రజాదరణ పొందిన పద్యాలలో గొప్ప భావం,సందేశం ఉంటుంది. హరిశ్చంద్రున్ని కష్టాల పాలు చేసిన నక్షత్రకుడు చివరికి పశ్చాత్తాపంతో పాడే "కలత వహింపకయ్య కలకాలము కష్టములుండబోవు..." అన్న పద్యంలో నాటికీ నేటికీ గొప్ప సందేశ భావం కనిపిస్తుంది. కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు కాలే చితిని చుసి స్మశాన వైరాగ్యానికి లోనైన సందర్భంలో పాడే పద్యం..."మాయా మేయ జగంబె నిత్యమని సంభావించి మోహమ్మునన్.." ఆన్న పద్యంలో గొప్ప తాత్విక భావన ఉంటుంది. కాటిసీనులో స్మశాన వర్ణన కోసం బలిజేపల్లి కొన్ని పద్యాలను మాత్రమే రాశాడు. కాల క్రమంలో గుర్రం జాషువా రచించిన 'స్మశాన వాటిక' ఖండకావ్యంలోని పద్యాలు కాటిసీనులో చేర్చారు. అప్పటి నుంచి సాన పెట్టిన వజ్రంలా హరిశ్చంద్ర నాటక ధగధగలు నల్దిక్కులా వ్యాపించాయి."ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ,యీ శ్మశానస్ధలిన్..."."ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మనికలము, నిప్పులలోనఁగఱగిఁపోయె !..." ."ముదురు తమస్సులో మునిఁగిపోయిన క్రొత్త సమాధి..."వంటి కాటిసీను పద్యాలు వినని తెలుగు వారు లేరు అనేది నిత్య సత్యం.

తెలుగునాట తిరుగులేని పౌరాణిక నాటకంగా హరిశ్చంద్రున్ని ముందు నిలబెట్టడంలో ఆనాటి రంగస్థల కళాకారుల కృషి ఎంతో ఉంది. తొలినాళ్లలో బలిజేపల్లి లక్ష్మీకాంతం హరిశ్చంద్రునిగా, నక్షత్రకుడిగా నటించాడు.తొలిరోజుల్లో డివి సుబ్బారావు(బందరు), బందా కనక లింగేశ్వరరావు, కె నాగేశ్వరరావు,నల్లంచి అప్పారావు,మల్లాది సూర్యనారాయణ... వంటి కళాకారులు ఈ నాటకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆ తరువాత బండారు రామారావు రాకతో హరిశ్చంద్ర నాటకం తిరుగులేని కరుణ రసాన్ని పండించింది. బండారు రామారావు కాటికాపరిగా రంగప్రవేశం చేసే సన్నివేశమే అద్భుతంగా ఉండేదని నాటి ప్రేక్షకులు చెబుతుండేవారు. రేబాల రమణ, అద్దంకి మాణిక్యాలరావు, పొన్నాల రామసుబ్బారెడ్డి, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, సిఆర్ దాస్, కే. వెంకట్రావుగుప్తా, డివి సుబ్బారావు, చీమకుర్తి నాగేశ్వరరావు, విజయరాజు, గూడూరు సావిత్రి, యై గోపాల రావు... ఇలా ఎందరో రంగస్థల కళాకారులు హరిశ్చంద్రున్ని అగ్రస్థానంలో నిలబెట్టారు. నాటి రంగస్థల కళాకారుల స్థానంలో నేటి యువ కళాకారులు పద్య నాటకం పట్ల ఆకర్షితులవుతున్నారు. తెలుగు  భాషా పరిమళాలు ఉన్నంతకాలం హరిశ్చంద్రుడు చిరంజీవిగా, పద్యనాటకం చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.

- శిఖా సునీల్ 
  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్