జీవిత పాఠం చెప్పే నవల
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం.
ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారిన పడిన వారికి యాంటీ రెట్రో వైరల్ మందులు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో హెచ్ఐవి మరణాలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించగలిగింది. కానీ, 1995 - 2007 మధ్య సమాజంలో హెచ్ఐవీ కరాళనృత్యం చేసింది. వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడం, బాధితుల పట్ల తీవ్ర వివక్ష, ప్రజల్లో భయాందోళన వెరసి ఎయిడ్స్ వ్యాధిని అతిపెద్ద భూతంలా చూశారు. ఎయిడ్స్ బారిన పడిన వారిని సమాజం నుంచి వెలివేసే పరిస్థితులు నెలకొన్నాయి. సరిగ్గా ఇటువంటి సందర్భంలోనే 2006లో సలీం రచించిన " కాలుతున్న పూలతోట " పాఠకుల ముందుకు వచ్చింది. తెలుగు నవలా సాహిత్యంలో బహుశా ఇది విప్లవాత్మకమైన ఆలోచన. ఒక వివక్షతో కూడిన ప్రాణాంతక వ్యాధిని కథా వస్తువుగా తీసుకొని గతంలో రచనలు జరగలేదనే చెప్పాలి. ప్రాణాంతక వ్యాధి పట్ల రచన చేయాలంటే రచయితకు శాస్త్రీయ పరిజ్ఞానం అవసరం. కథావస్తువును ఆసక్తిగా చెప్పాలంటే బాధితుల అంతరంగాల్లోకి పరకాయ ప్రవేశం చేయగలిగే చొరవ కావాలి. అప్పటికే తెలుగు కథా, నవలా సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన సలీం ఈ రెంటినీ సాధించారు. అందుకే, కాలుతున్న పూలతోట తిరుగులేని విజయాన్ని అందుకుంది. నాటి సమాజంలో హెచ్ఐవి పట్ల అవగాహన పెంచడంతో పాటు బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది.
నవల ఇతివృత్తాన్ని క్లుప్తంగా తెలుసుకుంటేనే ఈ నవలలో కథానాయకిగా భావించాల్సిన నాగమణి వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. ఈ నవల రెండు కుటుంబాల జీవిత కథ. ఈ రెండు కుటుంబాల కథలూ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా సమాంతరంగా ఆసక్తిగా సాగిపోతూ ఉంటాయి. మొదట కుమార్ కథ గురించి తెలుసుకుందాం. కుమార్ చదువుకున్న వ్యక్తి. ప్రభుత్వ ఉద్యోగి. అతనిది పొందికైన కుటుంబం. సంతోషంగా సాగిపోయే అతని జీవితాన్ని ఓ అనైతిక ఆలోచన ఛిన్నాభిన్నం చేస్తుంది. అతని పూర్వ ప్రేయసీతో ఓ రాత్రి వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటాడు. అతను తప్పు చేసింది ఆ ఒక్కసారే కానీ, అదే అతన్ని నిలువునా దహించి వేస్తుంది. తన ప్రేయసికి హెచ్ఐవి ఉందని తెలిసినప్పటి నుంచి అతని కాళ్ళ కింద భూమి కనిపించిపోతుంది. నిలువునా ఒణికి పోతాడు. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక, అతనిలో అణచుకోలేక నిత్యం హెచ్ఐవి మరణాల గురించి తెలుసుకుంటూ భయంతో బ్రతికున్నా చచ్చిపోతాడు. చివరికి అతనికి హెచ్ఐవి లేదని తెలియడంతో కుమార్ కథ సుఖాంతం అవుతుంది. ఇక, నాగమణి కథ అతిముఖ్యమైనది. నాగమణి భర్త రోజు వారి కూలి. కష్టపడిన రోజే వారి కడుపు నిండుతుంది. అయినా వారి గుడిసె నిండా సంతోషం నాట్యమాడుతూ ఉంటుంది. ఇలా సంతోషంగా సాగిపోయే వారి జీవితంపై హెచ్ఐవి పిడుగు పడుతుంది. అనారోగ్యంతో ఉన్న భర్తకు ఎయిడ్స్ వ్యాధి చివరి దశలో ఉందని తెలుస్తుంది. చేయని తప్పుకు నాగమణి వారి కుమారుడు హెచ్ఐవి బారిన పడతారు. ఆ కాలనీ వాళ్లు నాగమణి కుటుంబాన్ని వెలివేస్తారు. భర్త చనిపోతే అటువైపు కన్నెత్తి కూడా చూడరు. కొన్ని రోజులకు కుమారుడు కూడా చనిపోతాడు. నాగమణి రోడ్డున పడుతుంది. ఆదుకునే దిక్కు ఉండరు. ఏడ్చి ఏడ్చి ఆమె శరీరం తడారిపోతుంది. మరోవైపు హెచ్ఐవి ఆమె ఆరోగ్యాన్ని తినేస్తుంది. ఆమె నడుస్తున్న శవంలా మారిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓ స్వచ్ఛంద సంస్థ నాగమణికి మళ్లీ జీవం పోస్తుంది. హెచ్ఐవి పట్ల అవగాహన పెంచుకొన్న నాగమణి తిరిగి ఆరోగ్యవంతురాలిగా మారుతుంది. ఈ రెండు కథలూ నాటి సమాజంలో హెచ్ఐవి బాధితుల అంతరంగాలు.
ఈ నవల పాఠకుల ముందుకు వచ్చి 18 ఏళ్లు గడిచిపోయాయి. ఇన్నేళ్లు గడిచినప్పటికీ నాగమణి పాత్రను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే, సమాజానికి నాగమణి లాంటి ధైర్యవంతురాలు ఎప్పటికీ అవసరం కాబట్టి. ఎన్ని కష్టాలు ఎదురైనా నాగమణి ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. దుర్భరమైన పరిస్థితులను ఎదిరించి ముందడుగు వేస్తుంది. ఎందుకు బ్రతకాలో తెలిసిన వాళ్లే ఎలాగైనా బతకగలరని తత్వవేత్త నీషే చెప్తారు. నాగమణి కూడా బ్రతకాలనుకుంటుంది. చావు తన గుమ్మం ముందుకు వచ్చిందాకా బ్రతకాలనుకుంటుంది. బ్రతికి తనలాంటి హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల్లో మనోధైర్యాన్ని నింపాలనుకుంటుంది. ఈ బలమైన నిర్ణయమే నాగమణిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. పార్లమెంటు లో సమస్త హెచ్ఐవి బాధితుల తరపున నాగమణి తన బాధాలను వినిపిస్తుంది. కేవలం ప్రాణాంతక వ్యాధి బారినపడిన వ్యక్తిగానే నాగమణిని అర్థం చేసుకోకూడదు. సమస్యలను ఎదురించిన ధీరవనితగా చూడాలి. చిన్న చిన్న సమస్యలకే కృంగిపోయే మనస్తత్వాలు ఈ సమాజంలో ఎన్నో. అటువంటి వారికి నాగమణి పాత్ర స్ఫూర్తి. మనకు కలిగే దుఃఖాలు, ఆందోళనలూ దాదాపుగా ఊహించుకునేవే అని మనస్తత్వవేత్తలు చెబుతారు. ఊహల్ని వదిలేస్తే వాస్తవ జీవితం ఆనందమయంగా ఉంటుంది. పోనీ, ఊహలు కాదు కొందరి జీవితాల్లో వారి బాధలు వాస్తవాలే అనుకుందాం. కానీ, నాగమణి లాంటి వ్యక్తుల బాధల ముందు ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదే కదా. నాగమణి జీవితం కథ కదా అనిపించవచ్చు. తరచి చూస్తే కథ లాంటి నిజజీవితాలెన్నో సమాజంలో ఉన్నాయనడం వాస్తవం. చిన్నచిన్న సమస్యలు ఎదురైనప్పుడు, నాగమణి లాంటి వారిని తలచుకున్నప్పుడు, మన సమస్యలు నీటి బొట్టులా కనుమరుగైపోతాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి