
చాలా కాలం తర్వాత, కాస్తంత రిలాక్స్ కోసం ఏదైనా సినిమా చూడాలనిపించింది. టీవీ రిమోట్ తీసుకొని, నదీ ప్రవాహంలో ఓ మంచి చేప కోసం వెతుకుతున్నంత ఓపిగ్గా OTT ని వడపోస్తుండగా, నా చూపు ఓ మలయాళ చిత్రంపై పడి ఆగింది. ఆ సినిమా పేరు #HOME (హోమ్). 2021 ఆగస్టు 19న మలయాళంలో విడుదలైంది. IMDb రేటింగ్ చూసేసరికి నా కళ్లు నక్షత్రాల్లా వెలిగిపోయాయి. మొదటి నుంచి నాకు తమిళ, మలయాళ చిత్రాలంటే చెవి కోసుకునేంత ఇష్టం. మన సీరియల్ల ప్రభావమో, ఏమో కానీ తెలుగు సినిమాలు నా దృష్టిని అంతగా ఆకర్షించవు. నేను చూడాలకున్న హోమ్ సినిమా తెలుగు అనువాదంలో కూడా ఉండడంతో, నా చేతిలోని రిమోట్ ఆటోమేటిక్ గా ప్లే అయింది. ఇంటిల్లిపాదీ నిశబ్దంగా హాల్లోకి వచ్చి కూర్చున్నారు. 2 గంటలా 38 నిమిషాల సినిమా. ఇంత పెద్ద సినిమాని సింగిల్ సిట్టింగ్ లో చూడలేం కాబట్టి, రెండు భాగాలుగా రెండు రోజులు చూద్దాంలే అనుకున్నాం. హాల్లో లైట్లు ఆరిపోయాయి. సినిమా ప్రారంభమైంది. ప్రశాంతమైన వాతావణం. చల్లటి గాలి. చెవులకింపైన సినిమా సంగీతం. కొద్ది నిమిషాల్లోనే ఆ మలయాళ సినిమాలో అందరం లినమైపోయాం. రెండున్నర గంటల సినిమా రెండు నిమిషాల్లా కరిగిపోయింది. సినిమా మధ్యలో పాప్ కార్న్, టీ లు గుర్తురాలేదు. సినిమా తప్ప మరేదీ మాకు కనబడలేదు. సినీమా పూర్తయ్యేంత వరకూ ఆ రోజు, విచిత్రంగా ఎవరి ఫోన్లూ మోగలేదు.రోజిన్ థామస్, 30 ఏళ్ళు కూడా పూర్తవని ఈ యువ మలయాళ దర్శకుడు ఇంత గొప్పగా హోమ్ సినిమాని ఎలా తీయగలిగాడా అనిపించింది. ఈ సినిమాకు రోజిన్ థామస్ దర్శకుడే కాదు, కథా రచయిత కూడా. మనసుకు మాత్రమే తెలిసిన అతి సున్నితమైన భావాలను కూడా కళ్ళకు కట్టినట్టు చూపించిన అతడి ప్రతిభ అత్యద్భుతం. హోమ్ సినిమా మనసుకు హాయి కలిగించే సినిమా. ఫీల్ గుడ్ మూవీ. ఇంకాస్త వుంటే బాగుండు అనిపించే కథనం. అన్నీ కలిపి చిన్న పిల్లలతో సహా చూడదగ్గ మంచి సినిమా.

హోమ్ సినిమాలో చెప్పుకోడానికి ప్రత్యేకంగా కథంటూ ఏమీ లేదు. ప్రతిరోజూ, ప్రతి కుటుంబంలో జరిగే సంఘటనలే ఈ సినిమాకి ఇతివృత్తం. మన మధ్య జరిగే సంఘటనలు తెరమీద చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేం. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పేరు ఒలీవర్ ట్విస్ట్. అతని వయస్సు 60 ఏళ్ళు. తన చిన్న వీడియో షాప్ కి రిటైర్మెంట్ ప్రకటించి ఇంటిపట్టునే ఉంటుంటాడు. ఇంటిపనులు చూసుకోవడం, అందమైన గార్డెన్ ని పెంచడం, బాల్య స్నేహితునితో సాయంత్రాలు వాకింగ్ కి వెళ్ళడం.. ఇవీ ఒలివర్ ట్విస్ట్ పనులు. ఇతనికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సినీ రచయిత, చిన్నవాడు స్టూడెంట్. పిల్లలిద్దరూ వారి పనుల్లో, స్మార్ట్ ఫోన్లలో బిజీ బిజీగా ఉంటారు. ఇది చూసిన ఒలివర్ ట్విస్ట్, తానుకూడా ఓ స్మార్ట్ ఫోన్ కొని టెక్నాలజీలో పిల్లలతో పోటీ పడాలనుకుంటాడు. ఇలా, సరదాగా కుటుంబసభ్యుల మధ్య జరిగే చిన్న చిన్న సంఘటనలు మనసుకు హత్తుకునేలా తెరమీద కనిపిస్తాయి. సున్నితమైన హాస్యం, ప్రేమ, స్నేహం, ఎమోషన్స్ ఇలా సాగిపోయే హోమ్ సినిమా వెన్నెల్లో ఊయల ఊగుతున్నంత హాయిగా ఉంటుంది.సినిమా మొత్తం మీద ముఖ్యమైన పాత్రలు నాలుగైదు మాత్రమే కనిపిస్తాయి. అతి తక్కువ బడ్జెట్ తో, ఓ ఇంటిలోనే సినిమా మొత్తం షూట్ చేశారు. కానీ ఎక్కడ రిపీటెడ్ ఫ్రేములు కనిపించవు. స్క్రీన్ ప్లే అత్యద్భుతంగా ఉంటుంది. రెండున్నర గంటలైనా ఎక్కడా బోర్ ఫీలింగ్ రాదు. క్లైమాక్స్ లో ఉన్న చిన్న ట్విస్ట్ బాగా ఆకట్టుకుంటుంది. సంగీతం గురించి, ఫోటోగ్రఫీ గురించి హాట్సాఫ్ అనాల్సిందే. ఒలివర్ ట్విస్ట్ పాత్రలో మలయాళ సీనియర్ నటుడు ఇంద్రన్స్ జీవించాడు. ప్రతి అభినయాన్ని అధ్భుతంగా చూపించాడు. రచయిత, దర్శకుడు రోజిన్ థామస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సినీమా అయిపోయిన వెంటనే రోజిన్ థామస్, ఇంతకు ముందు ఇంకా ఎలాంటి సినిమాలు తీసాడా అని గూగుల్ చేయకుండా ఉండలేం.
- శిఖా సునీల్
కుటుంబ విలువలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఫీల్ గుడ్ ఉన్న సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ సినిమాను చక్కగా పరిచయం చేశారు. మీరు చెప్పిన దాన్ని బట్టి వెంటనే నాకు హోమ్ సినిమా చూడాలనిపిస్తుంది. మీరు రాసే ఆర్టికల్స్ అన్ని చాలా బాగుంటాయి. ప్రతి ఆర్టికల్ లో ఏదో ఒక సందేశం ఉంటుంది. నేనైతే మీ ఆర్టికల్స్ చాలా ఇష్టంగా చదువుతాను. ఎందుకంటే మీరు చెప్పదలుచుకున్న విషయం ఎంతో చక్కగా నేర్పుగా పాఠకులకు ఆసక్తి కలిగించే విధంగా చక్కగా చెప్తారు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు సార్....
థాంక్యూ
తొలగించండి