జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
నేను రాసిన మొదటి సక్సెస్ స్టోరీ ఇది. 2008 నవంబర్ 20 న సాక్షి 'భవిత' లో ప్రచురితమైంది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది పాఠకులు ఈ ఆర్టికల్ చదివారు.
ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివి, విద్యా వాలంటీర్ గా పనిచేసిన ఓ యువకుడు ప్రతిష్టాత్మకమైన "ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్" లో పరిశోధన చేసే స్థాయికి ఎలా ఎదిగాడు అనేదే ఈ సక్సెస్ స్టోరీ..
పూర్తి కథనం...
లక్ష్యం స్పష్టంగా ఉన్నచోట విజయం ఉంటుంది. దీనికి ఉదాహరణ కొండపల్లి వెంకట లక్ష్మీవీరనారాయణాచారి. అతని పేరు లాగే అతని లక్ష్యాలు కూడా చాలా పెద్దవి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామానికి చెందిన నారాయణ విద్యా వాలంటీర్ గా పనిచేసినా, డీఎస్సీ లో టీచర్ గా ఎంపికైనా, బార్క్ లో సైంటిస్ట్ గా ఉద్యోగం వచ్చినా, ఇవేమీ అతనికి తృప్తిని ఇవ్వలేదు. అందరిలో ఒకడిలా కాకుండా అందరికీ ఉపయోగపడాలని సంకల్పించాడు. తన మీద తనకు ఉన్న నమ్మకంతో అనుకున్నది సాధించడానికి నడక మొదలు పెట్టాడు. ఓ మారుమూల గ్రామం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఐఐఎస్సీలో పి.హెచ్.డి చేసే స్థాయి వరకు ఎదిగాడు. నడిచే దారిలో మైలురాళ్ళు అతనికి నవ్వే పువ్వుల్లా స్వాగతం పలికాయి.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (భారతీయ విజ్ఞాన సంస్థ). బెంగుళూరులో ఉన్న ఈ విద్యా సంస్థ దేశానికి ఎంతో మంది శాస్త్రవేత్తలను అందించింది. దేశానికి ఉపయోగపడే ఎన్నో పరిశోధనలు ఇక్కడే జరుగుతాయి. మన దేశానికి గర్వకారణమైన సర్ సి.వి.రామన్ వంటి మేధావులు పరిశోధనలు చేసిన విద్యా సంస్థ ఇది. దేశ వ్యాప్తంగా నిర్వహించే "జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్( జెస్ట్)" ద్వారా ఇందులో ప్రవేశ అర్హత లభిస్తుంది. ఆ పరీక్షలో నారాయణ ఆలిండియా స్థాయిలో 54వ ర్యాంకు సాధించి మెటీరియాలజిలో పీహెచ్డీ ప్రవేశం పొందారు. సెమీ కండక్టర్ మెమరీలో పరిశోధన చేస్తూ దేశానికి ఉపయోగపడే ఏవైనా కొత్తవి కనుగొనాలని నిరంతరం శ్రమిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాల నుంచి..
నారాయణ ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు చదివింది ప్రభుత్వ పాఠశాలల్లోనే,తెలుగు మీడియంలోనే. కొంత కాలం సొంత గ్రామంలో తాను చదివిన పాఠశాలలో విద్యావాలంటీర్ గా పని చేశారు. బీఈడీలో 148వ ర్యాంకు సాధించాడు. అనంతరం 2002 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. కానీ ఏదో సాధించాలనే తపన అతనిలో అసంతృప్తిని రగిలించింది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోగలనన్న ఆత్మవిశ్వాసం అతన్ని ముందుకు నడిపించింది. ఆ స్ఫూర్తితోనే హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తి చేశారు. అనంతరం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)లో సైంటిస్ట్ గా ఉద్యోగ అవకాశం వచ్చినా పరిశోధన మీద ఉన్న మక్కువతో దాన్ని వదిలేశారు.
ఎర్రగొండపాలెం గవర్నమెంట్ కళాశాలలో ఇంటర్ చదివేటప్పుడే అక్కడ ఫిజిక్స్ లెక్చరర్ రామ్మోహన్ రెడ్డి వల్ల తనకు ఫిజిక్స్ పై ఆసక్తి కలిగిందని నారాయణ తెలిపారు. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో ఆయన ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు.ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదువుతున్నప్పుడే భారత దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థల్లో ఫిజిక్స్ లో పరిశోధన చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు.
పనే దైవం..
నారాయణ పనిని దైవంగా భావిస్తారు. తండ్రి కోటయ్య ద్వారా అబ్బిన చెక్కపనిని ఆయన ఇప్పటికీ ప్రేమిస్తారు. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు ఆ పని చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. నాగార్జున సాగర్ లో బీఈడీ చదువుతుండగా శని, ఆదివారాల్లో ఓ కార్పెంటర్ షాప్ లో పని చేసి ఆ సంపాదనతో తనకు కావాల్సిన పుస్తకాలు కొనే వారు. పేదరికంలో ఉన్న తన కుటుంబ పరిస్థితులు చదువుకు ఆటంకం కాకూడదని ఎమ్మెస్సీ చేస్తూ ట్యూషన్లు చెప్పేవారు. డిసెంబర్ 2007లో నెట్ ఫెల్లోషిప్, ఇటీవల సీఎస్ఐఆర్ ఫెల్లోషిప్ సంపాదించేంత వరకు ఈ వృత్తి తనకు ఆర్థికంగా ఎంతో సహాయపడిందని నారాయణ అన్నారు.
కళాకారుడు కూడా..
పరిశోధనలో మంచి స్థాయిలో ముందుకు సాగుతున్న నారాయణలో ఓ కళాకారుడు కూడా దాగి ఉన్నారు. చెక్కతో అద్భుతంగా బొమ్మలను తీర్చిదిద్దుతారు. అది తన హాబీ అని ఆయన చెబుతారు.
- శిఖా సునిల్
చాలా స్ఫూర్తిదాయకమైన విజయగాధ ఇది. ఇలాంటివి మాకు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండి