జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
ఈ వేసవికి ఎక్కడికైనా హిల్ స్టేషన్ కి వెళ్లాలనే ఆలోచన వచ్చిన మరుక్షణమే మా కళ్ళ ముందు హార్సిలీ హిల్స్ కనబడింది. చర్చలూ, వాదోపవాదాలు లేకుండా అక్కడికే వెళ్లాలని ఏకాభిప్రాయానికి వచ్చాం. సముద్ర మట్టానికి 4312 మీటర్ల ఎత్తున ఉన్న " ఆంధ్రా ఊటీ " హార్సిలీ హిల్స్ గురించి అంతకుముందు వినడం, చదవటమే కానీ వెళ్లడం అనేది అదే మొదటిసారి. అది మే మాసం. మండు వేసవి నడి మధ్యకు చేరింది.ఎండ తాపం పెరిగింది. ఇక ఓపిక నశించింది. హార్సిలీ హిల్స్ ప్రయాణం తప్పలేదు. గుంటూరు నుంచి తిరుపతి రైలు ప్రయాణం నిద్రలోనే గడిచిపోయింది. తెలతెల వారుతుండగా తిరుపతి రైల్వే స్టేషనులో దిగాం. ఫ్రెష్ అయ్యి ఉదయం ఆరు గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ లో బాగా పొంగిన పూరీలు లాగించి మదనపల్లె వెళ్లే బస్సు ఎక్కి కూర్చున్నాం. చిత్తూరు జిల్లాలో బస్ జర్ని చేయడం అదే మొదటిసారి.
కిటికీ పక్కన కూర్చొని ప్రకృతిని చూస్తూ బస్సు ప్రయాణం చేయడమంటే నాకెందుకో చాలా చాలా ఇష్టం. అలా వేగంగా కదిలే బస్సుతో పాటూ నా ఆలోచనలూ అతి వేగంగా దూసుకుపోతూ ఉంటాయి. కిటికీ పక్కన కూర్చుని క్షణ కాలంలో కనుమరుగైపోయే ప్రకృతి అందాలను ఎక్కడా మిస్ కాకుండా క్షణంలో వేయోవంతులో నా కళ్ళు వాటిని బంధిస్తూ ఉంటాయి. కొత్త ప్రదేశాలు చూడటం నా మనసుకు ఎప్పుడూ ఆసక్తి కలిగిస్తూ ఉంటుంది. నేనున్నది ఆంధ్రాలోనే, వెళ్తున్నదీ ఆంధ్రాలోనే అయినప్పటికీ, ముందెన్నడూ చూడని ప్రదేశాలు చూస్తుంటే వింతగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ ప్రయాణమూ ఆసక్తిగానే ఉంది. విశాలమైన మామిడి తోటలు, విసిరేసినట్లు దూరదూరంగా ఉన్న ఊళ్ళు, మధ్య మధ్యలో ఏపుగా పెరిగిన చింత చెట్లు చూస్తుంటే బలేగా ఉన్నాయి. తిరుపతి నుంచి హార్సిలీ హిల్స్‌కు సుమారు వంద కిలోమీటర్ల ప్రయాణం. అటూ ఇటుగా రెండున్నర గంటల జర్నీ. మదనపల్లె చేరే సరికి పదిన్నర అయింది.
ఆలోచనలతో పాటూ రిషీ వ్యాలీ దాటి మా ఎఱ్ఱ బస్సు రయ్యిన దూసుకుపోతూ ఉంది. ఒంపులు తిరిగే దారుల వెంట ప్రయాణం గమ్మత్తుగా ఉంది. మధ్యలో ఓ చోట ఉన్న చిన్న ఊరిలో ప్రయాణికులు అందరూ దిగి పోయారు. ఇక బస్సులో మిగిలిన వాళ్ళంతా హార్సిలీ హిల్స్ పర్యాటకులు. వాళ్లూ కొద్ది మందే, అక్కడక్కడా ఉన్నారు. ఆ ఎత్తైన కొండమీద బస్సు నెమ్మదిగా, భారంగా పోతోంది. అడవి గుండా, లోతైన లోయల గుండా, కొండలు దాటి, కోనలు దాటి, చెట్లూ, పుట్టలు, గుట్టలూ, వాగులూ, వంకలూ దాటి మమ్మల్నందరిని ఈ భూమి మీద నుంచి ఎక్కడికో ఆకాశం మధ్యకు తీసుకు వెళుతున్నట్టు బస్సు నెమ్మదిగా వెళుతోంది. అలా వెళ్ళీ, వెళ్ళీ చివరికి ఆంధ్రప్రదేశ్ లోనే ఎత్తైన, సముద్ర మట్టానికి 4312 మీటర్ల ఎత్తున, 170 ఏళ్ళ క్రితం అప్పటి కడప జిల్లా సబ్ కలెక్టర్ డబ్ల్యు.డి.హార్సిలీ మొదటి సారిగా అడుగు పెట్టిన ఆ గుట్టపై మమ్మల్ని దింపింది. భగభగ మండే ఆకలితో హార్సిలీ హిల్స్‌లో అడుగు పెట్టాం....(ఇంకా ఉంది )
- శిఖా సునిల్
చాలా బాగా చెప్పారు
రిప్లయితొలగించండిధన్యవాదాలు
తొలగించండిమీ అభిరుచి బాగుంది.చిత్తూర్ జిల్లా యాస కూడా ముచ్చటగా ఉంటుంది.ఇళ్లలో అందరూ తమిళ్ మాట్లాడతారు.ఇద్దరు చిత్తూర్ వాళ్ళు కలిస్తే తమిళ్లోనే మాట్లాడుకొంటారు.మరోభాగం కోసం ఎదురు చూస్తూ..
రిప్లయితొలగించండిధన్యవాదాలు
తొలగించండిNice narration
రిప్లయితొలగించండి