ఊహాజనిత ప్రపంచం నుంచి పుట్టిన కవిత్వం ఆనందాన్నిస్తుంది. అనుభవం నుంచి పుట్టిన కవిత్వం ఆలోచింప చేస్తుంది. మహాకవి గుర్రం జాషువా కవిత్వం ఆద్యంతం అనుభవం నుంచి పుట్టిన అద్భుత సాహిత్యం. ఆయన కవిత్వం సమాజ హితాన్ని కోరుకుంటుంది. సందేశాన్ని అందిస్తుంది, మార్పుని ఆశిస్తుంది. మరీ ముఖ్యంగా కళ్ళముందు కనిపిస్తున్న వివక్షను ప్రశ్నిస్తుంది. గుర్రం జాషువా కలం పట్టిన తొలినాళ్లలో భావ కవిత్వం రాసినప్పటికీ అనతికాలంలోనే జాతీయోద్యమ ప్రభావానికిలోనై, ఆయన కలం పదునెక్కే కొలదీ తెలుగు సాహిత్య ప్రక్రిలన్నిటినీ సృజించింది. ఈ కోవలోనే జాషువా కవిత్వంలో మనకు తాత్విక భావన కనిపిస్తుంది. ఆయనలో గొప్ప తత్వవేత్త కనిపిస్తాడు. స్మశానవాటిక ఖండకావ్యం జాషువా తాత్విక భావనకు ఓ గొప్ప నిదర్శనం. జీవితం చాలా చిన్నదనీ, ఈ వైషమ్యాలూ, వాదవివాదాలూ, కులమత భేదాలూ ఇవన్నీ మరుభూమి బయట ఉన్నంత వరకేననీ స్మశానవాటికలో ప్రతి మనిషీ సమానమేనన్న నగ్నసత్యాన్ని జాషువా వివరిస్తాడు. " ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు.." అన్న జాషువాలో ఎంతటి విశాల భావం, ఎంతటి తాత్విక భావన దాగివుందో అర్థమవుతుంది.
" ఇట నస్పృశ్యత సంచరించుటకు దావేలేదు;విశ్వంభరా
నటనంబున్ గబలించి గర్భమున విన్యస్తంబు గావించి, య
త్కటంపు బెబ్బులితోడ మేకఁ నొక్క పక్కజేర్చి జోకొట్టి యూ
ఱట గల్పించు నభేదభావమును, ధర్మం బిందుఁ గారాడెడిన్ "
అంటూ జాషువా రాసిన ఈ పద్యంలో పచ్చి రక్తాన్ని తాగే క్రూర జంతువూ, ఆకులూ అలమలూ తినే సాధు జంతువూ రెండూ స్మశానంలో ఒక్కటేనని తెలియపరుస్తుంది.ఈ సారాన్ని అర్థం చేసుకుంటే చాలు, మనిషిలో గూడుకట్టుకున్న వివక్షలన్ని పటాపంచలై పోతాయి.
జాషువా రచించిన ప్రతి కావ్యంలో ఆయన అనుభవ పాఠాలే మనకు కనిపిస్తాయి. తాను చూసినవి, అనుభవించినవి అన్నీ అక్షరాలతో కలిపి ప్రపంచ సాహిత్య చరిత్రలో మరపురాని పద్యాలు అల్లాడు. స్మశాన వాటిక ఖండకావ్యం రాయడానికి కూడా ఓ నేపథ్యం ఉంది. ఈ విషయాన్ని జాషువా కుమార్తె హేమలతా లవణం మా నాన్న గారు పుస్తకంలో రాశారు. వినుకొండలో జాషువా ఇల్లు ఊరికి దూరంగా ఉండేది. ఇంటి ఎదురుగానే స్మశానం ఉండేది. ప్రతిరోజూ, ప్రతి సాయంత్రం ఆ స్మశానాన్ని జాషువా గమనిస్తుండేవాడు. మామూలుగా చూసే వాళ్లకు స్మశానం ఒక భయంకరమైన, చూడకూడని, వెళ్ళకూడని మరు భూమి. కానీ, తరచి చూస్తే ప్రతి సమాధి వెనుక ఎన్నో కన్నీటిగాథలు, వీరగాథలు, ఆనంద సౌరభాలు, ఎన్నో మధుర జ్ఞాపకాలు వుంటాయి. తెలుసుకోవాలే కానీ ప్రతి జీవితం అర్ధవంతమైనదే. ప్రతిరోజూ, ప్రతిరాత్రి ఆ స్మశానాన్ని గమనిస్తున్న జాషువాకి ఓ ఆసక్తికరమైన సంఘటన ఎదురైంది. ప్రతిరోజూ ఆ స్మశానంలో ఓ యువతి వచ్చి ఓ సమాధి ముందు దీపం వెలిగించి వెళ్ళేది. ఎందుకు అలా ప్రతిరోజూ ఆ యువతి దీపం వెలిగిస్తుందా అని జాషువా విచారించాడు. దీని వెనుక ఓ విషాద ప్రేమ కథ ఉన్నట్లు తెలిసింది. గుంటూరు మండలానికి కొత్తగా ఒక ఇంగ్లీషు దొర కలెక్టర్ గా వచ్చాడు. ఆయనకు వేట అంటే చాలా ఇష్టం. వినుకొండ ప్రాంతంలో ఉన్న అడవికి వేటకై వచ్చి అక్కడ ఒక అందమైన యువతిని ప్రేమించాడు. ఆమె అత్యంత సౌందర్య రాశి. ఆ యువతి , ఇంగ్లీషు దొర ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. త్వరలోనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ, విధి వక్రించి ఆ ఇంగ్లీష్ దొర అకాల మరణం చెందారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ యువతి ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయింది. తెల్ల చీర ధరించి ప్రతిరోజూ దొర గారి సమాధి వద్ద దీపం వెలిగించి వెళుతుండేది. ఇది విన్న జాషువాలో విషాద కవిత్వం పుట్టింది...
"ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ,యీ శ్మశానస్ధలిన్
గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ,డక్కటా!
యెన్నాళ్ళీచలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో!
కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్ !"
అంటూ స్మశనవాటిక ఖండకావ్యం రచించాడు. స్మశానం గురించిన ఇంతటి కరుణరసాత్మకమైన పద్యాలు ఏ కవి రాసి ఉండలేదు అంటే అతిశయోక్తి కానే కాదు.
" ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే.."
" గొప్ప ధనవంతుని పాలరాతి గోరి వద్ద పారవేసిన శవం ఏ పేదవాడిదో కదా.."
" ఆలోచించిన గుండియల్గరుగు.."
అంటూ జాషువా రాసిన స్మశానవాటిక పద్యాలు విన్నప్పుడు ఎంతటి వారికైనా కన్నీళ్లు జలజలా రాలి హృదయంలో గూడుకట్టుకున్న వివక్ష అంతటినీ శుద్ధి చేస్తాయి. స్మశాన వాటిక పద్యాలు ఆ తరువాత సత్యహరిచంద్ర నాటకంలో కాటిసీనులో చేరిపోయాయి. మహామహుల గొంతులో కరుణ రసాత్మకంగా పలికిన ఈ పద్యాలు తెలుగు ప్రజల కంట కన్నీరు పుట్టించాయి. ఒక్కో పద్యం ఒక్కో పుస్తకం లాంటిది. ఎంతో గొప్ప తాత్విక భావన ఈ పద్యాల్లో ఇమిడి ఉంది. సమాజం నిరాకరించిన వాటినే మహాకవి గుర్రం జాషువా తన కావ్యాలకు వస్తువుగా స్వీకరించాడు. అందుకే ప్రపంచ సాహిత్య చరిత్రలో గబ్బిలం, స్మశాన వాటిక కావ్యాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.
- శిఖా సునీల్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి