జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
ఈ పాట మొత్తానికి చివరి పదాలే ప్రాణం పోస్తాయి.పాటంతా విన్నాక చివాలున బాకుతో కుమ్మినట్టు గుండె మెలిపెడుతుంది.పాట మొత్తం ప్రేమను పంచే ఎరుకలి నాగన్నకు చివరిగా మనిషంటే ఎందుకంత భయమో మనకూ అర్థం కాదు. గోరటి వెంకన్న రాసిన "ఎరుకలీ నాగన్న ఉంటుండే.." పాట ఒక్క సారైనా వినాల్సిన పాట.గోరటి వెంకన్న మన గిరిజన సంస్కృతిని మొత్తం ఈ ఒక్క పాటలో ఆవిష్కరించాడు.గిరిజన సంస్కృతి ఎంత గొప్పదో,ఎంత ప్రేమ కలిగిందో,ఎంత అమాయకమైందో,ఎంత ధైర్యం ఉంటుందో ఈ ఒక్క పాట వింటే చాలు,మనకు పూర్తిగా అర్థమైపోతుంది.కేశవరెడ్డి నవల్లో 'సుక్కపంది' అంత గొప్పగా, ముసలివాడంత ప్రేమగా ఈ పాట ఉంటుంది.
"బూడిద పిర్రల బుడ్డ గోసి
బిర్రుగా నడుముకి ఎగవోసి
సెడుగుడు సెడుగుడు అడుగు
ఎలుగులెంకటి పిట్ట పరుగు
ఎడమ చేతిల ఎదురు బరుగు
అడవి దుప్పాలెల్ల తిరుగు.."
ఈ ఒక్క చరణం వింటే చాలు ఎరుకలి నాగన్న మన కళ్ళముందు ఠక్కున ప్రత్యక్షం అవుతాడు.ఇలాంటి నాగన్నే ఒకడుండే వాడు కదూ అంటూ కేశవ రెడ్డి అడవిని జయించాడు గుర్తొస్తుంది.ఊరికి దూరంగా, అడవికి దగ్గరగా ఉండే గిరిజన గూడెల్లో ఇలాంటి అమాయక జనాలు ఉంటారు. ఈ పాటలోని ఎరుకలి నాగన్న గుడిసెకి కనీసం తలుపు కూడా ఉండదు.అతను ఎంతో ప్రేమ కలిగినవాడు. అడివికి వేటకు పోతే ఐదు కముజులు మాత్రమే పట్టుకొస్తాడు. అంతకన్నా ఎక్కువ పడితే వాటిని అడవిలోనే వదిలేస్తాడు. వాటిల్లో ఊరు సాయిబుకు ఒకటి, గౌడకి మరొకటి, ఆకలితో ఉన్న వాడికి అడక్కుండానే ఒకటి ఇచ్చే దయామూర్తి ఎరుకలి నాగన్న.అతడి ఆస్తి మొత్తం పంది పిల్లలే, పంది పిల్లలంటే అతనికి ప్రాణం. పంది పిల్లలే అతని బంధువులు....
" సుక్కపంది పిల్ల పుడితే,
సుఖము జరిగెని మొక్కేటోడు.
బట్టపందికి కల్లు దాపి,
భాగవతమిని పించేటోడు.
రాగిగున్నకు తోడు జూపి,
యోగమును తిలకించెటోడు.
పందులే తన బంధువులుగా
బాధల్లో సుఖములో..."
అంత ప్రేమ కలిగిన ఎరుకలి నాగన్న, ఆరడుగుల నాగుపామును కూడా అవలీలగా పట్టే నాగన్న, బతికుండగానే విషాన్ని పిండి దాన్ని జాగర్తగా అడవిలో వదిలే నాగన్నకు ఎవర్ని చూస్తే భయమో తెలుసా..
"బుసలు కొట్టే విషనాగులకే,
గుబులునీ పుట్టించేటోడు.
ఊరి దొరల చూసి ఎందుకో,
నాగన్న ఎనుకట,
ఉరుకులు పరుగులు పెట్టేది.."
పాటంతా సంతోషంగా వింటూ ఆ చివరి పదాలు విన్నాక,మన బుర్ర చుట్టూ వందల ప్రశ్నలు గిర్రున తిరుగుతూ మనకూ గుబులు పుట్టిస్తాయి.పాటంతా విన్నాక ఇప్పటి జై భీమ్ సినిమా గుర్తొస్తాది.పాటంతా విన్నాక ఎరుకలి నాగన్న కూడా మన చుట్టూతా తిరుగుతున్నట్టే ఉంటుంది.
- శిఖా సునీల్
(ఈ పాటను వినడానికి క్రింద లింక్ క్లిక్ చేయండి..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి