జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
రెండున్నర దశాబ్దాలపాటు తెలుగు పద్య ప్రేమికులను రంజింపజేసిన బండారు రామారావు స్వస్థలం ప్రకాశం జిల్లా అద్దంకి గ్రామం.1932లో బండారు సుబ్బమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించాడు. బండారు రామారావు తండ్రి బండారు సుబ్బయ్య యక్షగానంలో ఆరితేరిన కళాకారుడు. ఆ కారణంగానే బండారు రామారావు చిన్నతనం నుంచే కళారంగం పట్ల ఆకర్షితుడయ్యాడు. చిన్ననాటే హరిశ్చంద్రుడి యక్షగానంలో లోహితాస్యునిగా నటించి మెప్పించాడు. సంస్కృతం ప్రధాన సబ్జెక్టుగా ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివి, కొద్దిరోజుల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అంతకు ముందే పదహారేళ్ళ వయసులోనే నాటకరంగంలో అడుగు పెట్టి అనతికాలంలోనే మంచి రంగస్థల కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బలిజేపల్లి విరచిత సత్యహరిశ్చంద్ర నాటకం గొప్ప పేరు గడించడానికి అప్పటి మహానటులు బందరు సుబ్బారావు, బందా కనకలింగేశ్వరరావు, కె.నాగేశ్వరరావు, నల్లంచి అప్పారావు, మల్లాది సూర్యనారాయణ వంటి గొప్ప కళాకారులే ప్రధాన కారణం. హరిశ్చంద్రునిగా వేషం ధరించి మెప్పించారు. ఆ తరువాత రంగప్రవేశం చేసిన బండారు రామారావు హరిశ్చంద్ర నాటకాన్ని మరో దశకు తీసుకెళ్ళాడు. హరిశ్చంద్రుడ్ని పల్లె బాట పట్టించిన ఘనత బండారు రామారావుకే దక్కుతుంది. అప్పట్లో మహాకవి గుర్రం జాషువా ఖండకావ్యం పేరుతో "స్మశానవాటిక" పద్యాలు రచించాడు. ఈ పద్యాలు కాటిసీనులో చేర్చిన బండారు రామారావు హరిశ్చంద్రున్ని కొత్త పుంతలు తొక్కించాడు. కాటిసీనులో స్మశాన వర్ణనలో కొన్ని పద్యాలు మాత్రమే ఉండేవి. కానీ బండారు రామారావు గాత్రంలో గుర్రం జాషువా పద్యాలు ఆలపించటం మొదలైన తర్వాత సత్య హరిచంద్ర నాటకం ఆంధ్రదేశంలో దేదీప్యమానంగా వెలిగిపోయింది.
బండారు రామారావు అభినయం, గాత్రం, వాక్చాతుర్యం, అత్యద్భుతంగా ఉండేది. ఒక రాగాన్ని అందుకుని ఆ రాగంలోనుంచి మరో రాగంలోకి అవలీలగా తీసుకెళ్ళడం ఆయన ప్రత్యేకత. దానికి తోడు హావభావాలు అత్యద్భుతం. బండారు గాత్రం ఎంతో మధురంగా, శ్రావ్యంగా ఉంటుంది. అందుకే తెలుగుదేశ ప్రజలకు బండారు పద్యం అంటే చెప్పలేనంత ఇష్టం. కాటిసీను, వారణాసి ఆయనకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది.1964లో వినుకొండలో మహాకవి గుర్రం జాషువా చేతుల మీదుగా గండపెండేర సత్కారాన్ని పొంది, "నటచూడామణి" బిరుదాంకితుడయ్యాడు. ఆంధ్రదేశంలో ఎన్నో సత్కారాలు సన్మానాలు పొందాడు.1974లో చివరిసారిగా గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన హరిశ్చంద్ర పాత్రపోషణ చేశాడు. ఆ తరువాత చిన్న వయసులోనే 1976లో చనిపోయాడు. చనిపోయేంతవరకూ కళామతల్లి సేవలోనే తరించాడు." సుకవి జీవించు ప్రజల నాల్కల యందు.." అన్నట్లు సుకవే కాదు కళాకారుడూ చిరంజీవే. అందుకే, బండారు రామారావు మరణించి 45 సంవత్సరాలు దాటినా ఆయన ఆలపించిన రాగమాలిక ఇప్పటికీ ప్రజల నాలుకల మీద ఆడుతూనే ఉంటుంది.
- శిఖా సునీల్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి