జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

నాన్నా.. ( సింగిల్ పేజీ కథ)

ఆ గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికే అర్థమైంది.. సంతోషంగా తిరిగి ఇంటికెళ్లడం కష్టమని. అక్కడ స్మశాన నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఆ గదిలో అటూ ఇటూ కలిపి ఇరవై బెడ్లు ఉంటాయి. ప్రతి బెడ్డుపై ఓ వ్యక్తి పడుకొని ఉన్నాడు. అతనికి ఎదురుగా, వారి తాలూకు వ్యక్తి నిలుచుని ఉన్నాడు. బెడ్డుపై పడుకున్న ప్రతి ఒక్కరికీ ఆక్సీజన్ పెట్టి ఉంది. కొందరికి గుండెలపై ఏవో తీగలు తగిలించి ఉన్నాయి. వారి వెనక ఉన్న పరికరాల నుంచి కుయ్, కుయ్ మంటూ చిన్న చిన్న శబ్దాలు వస్తున్నాయి. అప్పుడప్పుడూ ఆ గదిలోకి ఓ డాక్టర్ వచ్చి ఆ చివరి నుంచి ఈ చివరకు పరిశీలించి వెళ్తాడు. అప్పుడప్పుడూ కొన్ని బెడ్ల వద్ద ఆగి బెడ్డుకి తగిలించి ఉన్న రికార్డు పరిశీలిస్తాడు. ఆ గదిలో ఉన్న ఎవ్వరి ముఖాల్లోనూ సంతోషం ఛాయలే లేవు. అలా అని కంగారూ కనిపించడం లేదు.

ఇంతలో మొదటి లైనులో చివరి బెడ్ వద్ద నిలుచున్న ఒకతను కంగారుగా బయటికి పరిగెత్తుకు వెళ్లాడు. తిరిగి పరుగులాంటి నడకతో డాక్టర్తో బెడ్ వద్దకు వచ్చారు. డాక్టర్ సైత్ తీసి పడుకున్న 'వ్యక్తి' గుండెలపై పెట్టి చూశాడు. నాడి పట్టుకున్నాడు. ఆ గదిలో నిల్చున్న వ్యక్తులందరి చూపూ అటువైపే ఉంది. ఇంతలో, ఏమైందో ఏమో... అక్కడ నిల్చున్న వ్యక్తి కుప్పకూలినట్టు పడుకున్న వ్యక్తిపై పడ్డాడు. అక్కడి నుంచి రోదన అందరికి వినిపిస్తోంది. డాక్టర్ తిరిగి తన గదిలోకి వెళ్లాడు. రోదిస్తున్న వ్యక్తి లేచి గది బయటకి వెళ్లాడు. బంధువులతో తిరిగి వచ్చి, అక్కడ అన్నీ సర్దుకుని పడుకున్న వ్యక్తిని దించి, స్త్రెచెర్ పై బయటకు తీసుకెళ్లారు. అదిప్పుడు నిర్జీవ దేహం.

వారం క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు నాన్న పరిస్థితి పర్వాలేదు అన్నారు. రకరకాల పరీక్షలు చేసి, కోలుకునే అవకాశముందని చెప్పారు. క్రమేణా నాన్న నిద్రలోకి జారిపోయారు. కదలికలు తగ్గిపోయాయి. డాక్టర్ నన్ను తన గదిలోకి పిలిచి, నాన్నను ప్రత్యేక గదిలోకి మారుద్దామని చెప్పాడు. అన్నీ సర్దుకుని ఆ గదిలోకి వచ్చిన కొద్దిసేపటికే అర్థమైంది.. గంటల వ్యవధి మిగిలిందని. కొన్ని సంవత్సరాల జీవిత ప్రయాణంలో మిగిలింది కొన్ని గంటలు మాత్రమే.

నా మదిలో ఎన్నో ఆలోచనలు... నాన్న వేలు పట్టుకుని నడిచిన రోజులు గుర్తొస్తున్నాయి. నన్ను ఒడిలో కూర్చో పెట్టుకుని చెప్పిన కధలు గుర్తొస్తున్నాయి. ఇసుక తిన్నెలపై ఆటలాడించిన రోజులు.. జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. కొత్త కొత్త విషయాలన్నీ విడమర్చి చెప్పిన క్షణాలు కరిగి పోతున్నాయి. అమ్మ, ఆప్యాయత, ప్రేమ, బంధువులు.. అన్నీ అనుభవించి, ఇక ఓపిక లేదంటూ ఆ బెడ్డుపై పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నట్లున్నాడు. నన్ను ఎప్పుడు.." నాన్నా..! " అని పిలిచే నాన్న. చలం, శ్రీశ్రీ కవితలు, పుస్తకాలు, అక్షరాలు.. అన్నిటికీ విశ్రాంతి లభిస్తున్నట్లుంది. ఆయన ప్రయాణం చివరి గడియకు చేరుకుందా..? తరువాత ఏం జరుగుతుంది..? "నాన్నా..!" చిన్నగా పిలిచాను. నా చేయి గట్టిగా పట్టుకున్నాడు. మళ్లీ పిలిచాను. కొద్దిగా చలనం, రెండు నొసలు దగ్గరకు వచ్చినట్లు అనిపించింది. ఇన్నేళ్ల అనుబంధం.. బాధను మిగులుస్తున్న అనుబంధం. ఎందుకు ఇలా జరుగుతోంది..? రక్తాన్ని పంచిన వ్యక్తి కొన్ని గంటలు మాత్రమే భౌతికంగా ఉంటాడేమో అనే విషయం, ఆలోచించడానికే కష్టంగా ఉంది. ఈ స్పర్శ ఇక ఉండదేమో.

అలానే చూస్తున్నాను  నాన్న ముఖంలోంచి నాన్నలోకి. ప్రశాంతంగా నిద్రలో ఉన్నాడు. చిన్నగా శ్వాస తీసుకుంటున్నాడు. నా చేతిని అలాగే పట్టుకుని ఉన్నాడు. నాన్నతో మాట్లాడాలని ఉంది. ప్రశాంతమైన, చలనం లేని నిద్ర. క్షణాలు.. నిమిషాలు కరిగిపోతున్నాయి. నాన్న కంటి వద్ద చిన్న కదలిక కనిపించింది. కంటి చివర నుంచి తడి మెరిసింది. కన్నీటి చుక్క కాబోలు. ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తున్నాడేమో. తనలో తనే మాట్లాడుకుంటున్నాడేమో. ఇదంతా తెలుస్తుందా ? 'నాన్నా..!' మళ్లీ పిలిచాను. ఏం ఉపయోగం లేదు.

దీనిని ఎవరు అపగలరు..? ఇది జరగవలసిందేనా..? ఎంత సేపయిందో అర్థం కావడం లేదు. ఆ గదిలో సమయం తెలిసే అవకాశమే లేదు. పగలూ, రాత్రి ఒకేలా ఉన్నాయి. నాన్న తల కొద్దిగా కదలడానికి ప్రయత్నించినట్లు అనిపించింది. ఏదైనా చెబుతాడా..? బలంగా ఓసారి శ్వాస తీసుకున్నాడు. కొద్దిగా కుడిచేయి కదిలింది. గట్టిగా పట్టుకున్నాను. కాలి బొటనవేలు కదులుతోంది. బలంగా నోటితో శ్వాస తీసుకుంటున్నట్లు అనిపించింది. నాకు కంగారు ఎక్కువైంది. పరిగెత్తుకుంటూ వెళ్లి డాక్టర్ని తీసుకొచ్చాను.  నాన్న గుండెలపై చేతులు పెట్టి డాక్టర్ బలంగా ఒత్తుతున్నాడు. "నాన్నా.. నాన్నా.. నాన్నా.. నాన్నా..." నా మనసు పిలుస్తూనే ఉంది. నాన్న గట్టిగా శ్వాస తీసుకున్నాడు. ఇక ఓపిక లేదంటూ అలాగే ఆగిపోయాడు. డాక్టర్ వెనుదిరిగాడు. ముప్పైమూడేళ్ల అనుబంధం తెగిపోయింది. చిన్నప్పుడు నేను కాళ్లతో తన్నిన నాన్న గుండెలపై నా కంటి నుంచి జారి ఓ వెచ్చటి కన్నీటి బొట్టు పడింది. జీవితం క్షణకాల జ్ఞాపకం. మరణం జీవితకాల విషాదం. ఇక ఆలోచించే ఓపిక లేదు, నిమిషాల్లో అన్నీ సర్దుకుని, నాన్నను తీసుకుని బయటికి వెళ్తున్నాను. ఎదురుగా మరో వ్యక్తిని గదిలోకి తీసుకొస్తున్నారు.

- శిఖా సునీల్ 

--------------------------------------------

నేను రాసిన ఈ సింగిల్ పేజీ కథ 2010 లో సాక్షి, ఫన్ డే (ఆదివారం పుస్తకం)లో ప్రచురితమైంది..




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్