జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

పద్య నాటక స్వర సవ్యసాచి పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు

ఆయన పద్యరాగంలోని మాధుర్యం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మళ్ళీమళ్ళీ వినాలనిపించే ఆయన గాత్రంలోని గమకాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. తెలుగు నాట నక్షత్రకుడిని హీరో చేసిన గొప్ప రంగస్థల కళాకారుడు పద్మశ్రీ యడ్ల గోపాలరావు. ఐదువేల పద్య నాటక ప్రదర్శనలు, యాభై సంవత్సరాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గురించి జి.వి.ఎం.సి డిప్యూటీ కమిషనర్ పల్లి నల్లనయ్య అందిస్తున్న వ్యాసం..

"మా చిన్నాన్నలు పల్లి లక్ష్మీనారాయణ, పల్లి నర్సింహులు, పల్లి రామామూర్తి అందరూ పౌరాణిక నటులే. వారు మా ఊరిలో శ్రీ రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, బాలనాగమ్మ, మున్నగు నాటకాలు వేయడం అలా నాకు పద్యనాటకం పై చిన్ననాటి నుంచే ముక్కువ ఏర్పడటం జరిగింది. నా పదవ ఏట మా చిన్నాన్న రామమూర్తి తదితరులతో కలిసి మా ఊరి సమీపంలో గల సైరిగాం గ్రామంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుని పాత్రలో మొట్టమొదటిసారిగా ఎడ్ల గోపాలరావుని చూడడం జరిగింది. అప్పటికి వారు మంచి యుక్త వయసులో ఉండటం, హార్మోనిస్టు కూడా కావడం వల్ల ఏ రాగాన్నైనా పై స్థాయిలో అమోఘంగా పలికి ప్రేక్షకుల విజయ హారతులు అందుకునేవారు. తన నట,గాన మాధుర్యంలో ప్రేక్షకులను ఆనంద డోలికల్లో విహరింప చేసి వారి హృదయాల్ని దోచుకునేవారు.

మన తెలుగునేలపై పౌరాణిక పద్య నాటక వైభవాన్ని పెంచిన మహానుభావులలో పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు ఒకరిని సగర్వంగా చెప్పుకోవచ్చు.నాకున్న పరిజ్ఞానం మేరకు, నాకు తెలిసినంత వరకు, తొలుత కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో పద్యాల్ని ఆలపించిన దైతా గోపాలం, కపిలవాయి రామనాథ శాస్త్రి, ఫలానా పద్యాన్ని ఫలానా రాగంలోనే పాడాలని పద్యాలకు రాగ నిర్దేశం చేసిన అబ్బూరి వరప్రసాదరావు, తర్వాత ఆ ప్రక్రియను కొనసాగించిన బేతా వెంకట్రావు, హిందుస్తానీ సంగీతంలో పద్యాల్ని ఆలపించిన ఈలపాటి రఘురామయ్య, కర్ణాటక, హిందుస్థానీ సంగీతాలను మేళవించి అత్యద్భుతంగా పద్యాల్ని పాడిన రంగస్థల రారాజు షణ్ముఖి ఆంజనేయరాజు, పద్య గద్యాల్ని భావ రాగ యుక్తంగా ఆలపించిన పీసపాటి నరసింహమూర్తి, అమరపు సత్యనారాయణ, గళాన్ని, నాసికాన్ని సంయుక్త పరిచి వీనుల విందుగా పద్యాన్ని పాడి ప్రేక్షకులను మెప్పించిన ఏవీ సుబ్బారావు, తన మధుర స్వరంతో గద్య పద్యాలను సుస్పష్టంగా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా మహోన్నత రీతిలో గానం చేసి పద్యనాటక అభిమానుల్ని తనవైపు తిప్పుకున్న ఎం.వై నాయుడు, పద్యాలు శ్రావ్యంగా ఆలపించి తనదైన బాణీనీ ఏర్పరచుకొని ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న డీవీ సుబ్బారావు, చీమకుర్తి నాగేశ్వరరావు, ఎటువంటి సంగీత పరిజ్ఞానం లేకున్ననూ హిందుస్తానీ, కర్ణాటక సంగీత బాణీలలో అన్ని స్థాయిలలో పాడగల పి.లక్ష్మణరావులే కాకుండా, కర్ణాటక సంగీతంలో ఆరోహణ, అవరోహణ క్రమాలను క్రమబద్ధీకరిస్తూ, పద్య భావాన్ని పరిరక్షిస్తూ, వచన స్వభావాన్ని సంరక్షిస్తూ,జంట స్వరాలతో మనోరంజకంగా పద్యాన్ని ఆలపిస్తున్న ఎడ్ల గోపాలరావు కూడా తెలుగు పౌరాణిక పద్య నాటక రంగాన్ని సంపన్నం చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. అనేక బిరుదులు, పలు సత్కారాలు ఘన సన్మానాలు అందుకున్న పద్య నాటక ఘనాపాటి, కళామతల్లి ముద్దుబిడ్డ పద్మశ్రీ గోపాల రావు. గద్య, పద్య పఠనంలోను, నటనలోనూ వారు కనబరుస్తున్న ప్రతిభ అనన్య సామాన్యం. స్వయంకృషితో, అకుంఠిత దీక్షతో, ఎనలేని ఆత్మవిశ్వాసంతో, పౌరాణిక పద్య నాటకంలోని మెళకువలను ఆకళింపు చేసుకుని ఆంధ్రరాష్ట్రంలో అగ్రశ్రేణి కళాకారునిగా ఎదిగిన తీరు అందరికీ అనుసరణీయం.

రంగస్థలంపై శ్రీ గోపాలరావు తప్ప, వేరే నక్షత్రకున్ని మనం చూడలేము. నక్షత్రకుడంటే ఎవరికైనా ముందు గోపాలరావు గారే గుర్తొస్తారు. సత్య హరిశ్చంద్ర నాటకంలో అప్పటి వరకు ఒక సహాయక పాత్రగా, ఒక హాస్య పాత్రగా ఉండే నక్షత్రక పాత్రకు ఓ నాయక హోదా (హీరో ఇమేజ్)ని, ఓ గుర్తింపు (ఐడెంటిటీ)ని తెచ్చి పెట్టిన ఘనత  గోపాలరావుకే దక్కుతుందనడం అతిశయోక్తి కాజాలదు. ఇప్పటికీ ఎంతో మంది నటులు నక్షక పాత్రలో అతనినే అనుకరించడం, వారి బాణిలో కాకుండా వేరే బాణీలో పాడితే ప్రేక్షకులు దానిని ఏ మాత్రం అంగీకరించక పోవడం మనం చూస్తున్నాం. మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన మేటి నటుల సరసన సత్యహరిశ్చంద్ర నాటకంలో ఒక నక్షత్రకునిగా చాలా మంది నటించి, దానిని ఆడియో, సీ.డి రూపంలోకి తెచ్చినా, అది జనామోదం పొందనందున, నక్షత్రకునిగా ఆయా నటుడు పాడిన పాటను తొలగించి, నక్షత్రకుని పాత్రలో  గోపాలరావు పాడిన పాటను సీ.డి.లో ఎక్కించి, కొత్తగా మరో ఆడియో సీడీ నీ రూపొందించి, మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భాలే అందుకు నిదర్శనం. ఎటువంటి భేషజాలకు పోకుండా,  ఎడ్ల గోపాలరావు, ఔత్సాహిక, వర్ధమాన నటుల సరసన సైతం నటించి వారిని ప్రోత్సహించడం; తాను ఉన్నతశ్రేణి నటుడైనప్పటికీ, మంచి ప్రతిభా పాటవాలు కనబరుస్తున్న యువ నటీనటులను 'బాగా పాడతారని' అందరి ముందు ప్రశంసించడం, దాదాపు పౌరాణిక పద్యనాటక కళాకారులందరితో కూడా మంచి సంబంధ బాంధవ్యాల కలిగి ఉండటం, వారిలో నాకు నచ్చిన మేటి సుగుణాలు. నటుడిగా ఎంత ఎదిగినా ఒదిగి వుంటూ, గర్వాన్ని ఏ మాత్రం దరిజేరనీయక అందరి మన్ననలందుకుంటున్న వ్యక్తి  గోపాలరావు, నేటి తరం నటులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారనడంలో ఎటువంటి సందేహం లేదు.

డి.వి. సుబ్బారావు హరిశ్చంద్రునిగా, గూడూరు సావిత్రి చంద్రమతిగా,  గోపాలరావు నక్షత్రకునిగా నటించిన సన్నివేశాలను మద్రాసు హెచ్.ఎం.వీ కంపెనీ వారు గ్రామఫోను రూపంలో రికార్డు చేయగా, అది ఆంధ్రరాష్ట్రంలో ప్రతీ పల్లెలోను చాలా సంవత్సరాల పాటు రాజ్యమేలింది. ఇప్పటికి కూడా అది సి.డి. రూపంలో అందరినీ ఉర్రూతలూగిస్తూనే ఉంది.  గోపాలరావు  శ్రీరామాంజనేయ యుద్ధంలో రామునిగా, గయోపాఖ్యానంలో శ్రీకృష్ణునిగా, శ్రీకృష్ణతులాభారంలో నారదునిగా నటించిన ముఖ్య సన్నివేశాల్ని విశాఖపట్నంలోని శ్రీ మాతా రికార్డింగ్ కంపెనీ వారు సీ.డీ. రూపంలో రికార్డు చేయడం వల్ల, వాటిని పద్య నాటకాభిమానులందరికీ రోజు విని ఆనందించే భాగ్యం దక్కింది. అలవోకగా ఐదు లేదా ఐదున్నర శ్రుతిలో ఎత్తుకొని తన సహజ జంట స్వరాలతో పద్యాన్ని గానం చేసి, సంభాషణలను అందరికీ అర్ధమయ్యేలా స్పష్టంగా పలికి, ప్రేక్షకుల్ని సమ్మోహనపరచిన నేటి మేటి నట స్వర సవ్యసాని శ్రీ గోపాలరావు.

తెలుగు పద్య నాటక రంగ చరిత్రలో, రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలలో ఇప్పటివరకు మొత్తం వేల ప్రదర్శనలిచ్చి. 50 సంవత్సరాల నట జీవితం పూర్తి చేసుకున్న ఏకైక నటుడు పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గారేనని అనుకొంటాను. అలాంటి అద్భుత నట గాయకుడు మా శ్రీకాకుళం జిల్లాలో పుట్టడం మాకెంతో గర్వకారణం. "

- పల్లి నల్లనయ్య

డిప్యూటీ కమిషనర్(రెవెన్యూ),

మహా విశాఖ నగరపాలక సంస్థ

కామెంట్‌లు

  1. రంగస్థలమే కనుమరుగవుతున్న నేటి రోజుల్లో పద్యనాటకంలో కర్ణాటక సంగీతాన్ని జోడించి అద్భుతంగా పద్యాలు ఆలపించిన పద్మశ్రీ ఎడ్ల. గోపాల రావు గారి గురించి మీరు వర్ణించిన తీరు చాలా బాగుంది.. ఈ తరం(నా లాంటి) రంగస్థల అభిమానులకు మీ వ్యాసం మంచి టానిక్ లా ఉపయోగ పడుతుంది ధన్యవాదములు........

    రిప్లయితొలగించండి
  2. చాలా మంచి వ్యాసం.పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గారి పద్యాలు అద్భుతంగా ఉంటాయి. ఆయన పాడిన " కలత వహింపకయ్యా.." ఆన్న పద్యం చాలా బాగుంటుంది. పదే, పదే వినాలనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  3. Very nicely written with great content which is missing in the netcom life.

    రిప్లయితొలగించండి
  4. పద్మశ్రీ గోపాలరావు గారిలో అనే ప్రత్యేకతలు ఉన్నాయి. నక్షత్రక పాత్ర కు సరిపడే శారీరక సౌష్టవం(70 సంవత్సరాల వయస్సు లోను)చక్కగా ఉంది. చక్కటి ఉఛ్చారణ ,భాషాపటిమ, ఏ మాత్రం వెలితి లేని స్వరవిన్యాసం ,కఛ్ఛితమైన లయ, ఏ గొప్ప నటునితోనైనా సహజంగా ఇమిడి పోయే వాచిక స్వరసమ్మేళనం...వీటిని గురించి సుదీర్ఘ విశ్లేషణ చేయించగలిగే..అద్భుతమైన ప్రతిభామూర్తులు శ్రీ గోపాలరావు గారు. మన తరంలో మన పద్యనాటకానికి ఒక పద్మశ్రీ అనే కీర్తి కిరీటం తెచ్చి ఇచ్చిన ఆమహామహునికి...తెలుగు జాతి ఆచంద్రతారార్కం ఋణపడి ఉంటుంది అనడంలో సందేహం లేదు.💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐ఎ.అప్పలనాయుడు మాస్టర్

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్