పద్య నాటకాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్న రోజులవి. గయోపాఖ్యానం, పాండవోద్యోగ విజయాలు, బాలనాగమ్మ, పల్నాటి యుద్ధం వంటి పౌరాణిక నాటకాల సరసన బలిజేపల్లి లక్ష్మికాంతం రచించిన "సత్య హరిశ్చంద్ర" చేరి జనాల చేత జేజేలు కొట్టించుకుంటున్న తొలినాళ్ళవి.రంగస్థల చరిత్ర సువర్ణ అక్షరాలతో రాయదగ్గ ఆ కాలంలో పద్య నాటక కళాకారుడిగా జనాలను మెప్పించడం అంత సామాన్యమైన విషయం కానే కాదు. మధురమైన గాత్రంతో పాటు నవరసాలు పండించగల అభినయం కావాలి. ఇక స్త్రీ పాత్రలు ధరించడం కత్తి మీద సామే. వయ్యారాలు వలకబోయాలి,మధురమైన కంఠంతో పద్యాలాపన చేయగలగాలి, అంతలోనే కరుణ రసాన్ని పండించి ప్రేక్షకుల కంట కన్నీరు పుట్టించాలి. ఇలాంటి అభినయంతో,పురుషుడై ఉండి, స్త్రీ పాత్రలో ఇమిడిపోయి, స్త్రీ పాత్రకే జీవం పోసిన గొప్ప కళాకారుడు రేబాల రమణ. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన రంగస్థలంలో విరబూసిన లతాంగి. కరుణ రసాత్మక పాత్రోచిత నటనతో ప్రేక్షకుల కంట కన్నీరు తెప్పించిన నట భాగ్యరేఖ.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో రేబాల రమణ 1939లో జన్మించాడు. తల్లిదండ్రులు పెంచలయ్య, అంకమ్మ. నటన పట్ల మక్కువతో పాఠశాల స్థాయిలోనే నాటకాల్లో నటించడమే కాకుండా స్త్రీ పాత్రలు కూడా ధరించాడు. రమణలోని ప్రతిభను గుర్తించిన ప్రముఖ విద్వాంసుడు ఆర్ నారాయణ రెడ్డి సంగీతం, నటన, నృత్యంలో శిక్షణ ఇచ్చాడు. రేబాల రమణ తొలుత కొన్ని పౌరాణిక నాటకాల్లో స్త్రీ పాత్రలు ధరించి గుర్తింపు పొందాడు. అప్పటికే బలిజేపల్లి రచించిన సత్య హరిశ్చంద్ర నాటకం రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతోంది. బండారు రామారావు అభినవ హరిశ్చంద్రుడుగా ప్రేక్షకుల చేత జేజేలు కొట్టించుకుంటున్నాడు. బండారు రామారావు ప్రోత్సాహంతో రేబాల రమణ సత్య హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర ధరించాడు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూడనే లేదు. అనతి కాలంలోనే చంద్రమతి పాత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బండారు రామారావు, రేబాల రమణ కాంబినేషన్ అంటేనే జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. చంద్రమతి పాత్రకు జీవం పోసి రసజ్ఞులను మెప్పించడమే కాకుండా రంగస్థలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సత్య హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర కరుణ రసాత్మకమైన పాత్ర. ఆదర్శ సతీమణిగా,ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకునే హరిశ్చంద్రుని అర్ధాంగిగా దాదాపు నాటకంలో సింహభాగం కరుణ రసాన్ని ఒలికించాలి. ఇలాంటి గొప్ప పాత్రలోకి అద్భుత అభినయంతో పరకాయ ప్రవేశం చేసిన రేబాల రమణ చంద్రముఖి పాత్రకు తెలుగునాట జీవం పోసాడు. ఆయన గాత్రంలో ప్రేక్షకులను కట్టిపడేసే మాధుర్యం ఉంటుంది. స్పష్టమైన ఉచ్చారణ, పాత్రోచిత సంభాషణ, అధ్భుత అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసేవాడు. రెండున్నర దశాబ్దాల పాటు తెలుగు పద్య నాటకరంగంలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న రేబాల రమణ 1996 డిసెంబర్ 31న అమరులైనారు. ఎన్నో అవార్డులు, సన్మానాలు పొందిన ఆయన్ను ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమీ "కళా ప్రవీణ"తో , కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది. "నాటకం ఎన్నటికీ కనుమరుగై పోదు. ప్రజా జీవనం ఉన్నంతకాలం పద్యనాటకం మాసిపోదు.." అని ఆయన తరచూ అంటుండేవాడు. నిజమే, నేటి యువతరం ఇప్పుడు పద్య నాటకాల పట్ల ఆకర్షితులవుతున్నారు. రంగస్థలం మళ్లీ దేదీప్యమానంగా వెలిగిపోయియే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
- శిఖా సునీల్
( డిసెంబర్ 31 రేబాల రమణ వర్థంతి)
Excellent writer sunel
రిప్లయితొలగించండి