జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
చారిత్రక, సాంస్కృతిక, సాహిత్యాల నిలయం మన వినుకొండ. శైవ, జైన, బౌద్ధ, మహమ్మదీయ, క్రైస్తవ సంస్కృతికి ప్రతీకగా భిన్నత్వంలో ఏకత్వంలా మన వినుకొండ ప్రాంతం విరాజిల్లింది. విష్ణుకుండినుల వంటి గొప్ప రాజ వంశీయుల పరిపాలనలో వర్ధిల్లిన మన వినుకొండ ప్రాంతం అంతే గొప్ప సాహిత్యకారులను అందించి తెలుగు సాహిత్య చరిత్రకు వన్నె తెచ్చింది. మన వినుకొండ నేలను ముద్దాడిన ఎందరో కవులు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవచేసారు. తెలుగు సాహిత్య చరిత్రలో ఎన్నటికీ నిలిచిపోయే గొప్ప కావ్యాలను రచించి ప్రపంచ పటంలో మన వినుకొండ ఖ్యాతిని రెపరెపలాడించారు. తెలుగు సాహిత్య పరిమళాలు చేరిన ఏ ప్రాంతానికి వెళ్లినా మన వినుకొండ గురించి తెలియని వారుండరు.
"వినుకొండ ప్రాంత" ప్రస్తావన త్రేతాయుగంలోనే కనిపిస్తుందని పురాణకారుల నమ్మకం. చారిత్రక, శాసన ఆధారాలను పరిశీలిస్తే విష్ణుకుండినుల కాలంలో " వినుకొండ ప్రాంత " ఆధారాలు పూర్తిగా లభిస్తాయి. ఆంధ్ర దేశాన్ని ఏలిన గొప్ప రాజవంశాలలో విష్ణుకుండినులు పేరెన్నికగన్న వారు. విష్ణుకుండినులు క్రీ.శ. 5, 6 శతాబ్దంలోనే తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ తరువాత వీరి సామ్రాజ్యాన్ని విస్తరించి ఆంధ్ర ప్రాంతాన్ని కూడా వారి ఎలుబడిలోకి తెచ్చుకున్నారు. గొప్ప రాజ వంశీయులుగా చరిత్రలో నిలిచిన విష్ణుకుండినులు వినుకొండ ప్రాంత వాస్తవ్యులుగా కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఈ వాదనలో భిన్నాభిప్రయాలు ఉన్నప్పటికీ విష్ణుకుండినుల పరిపాలనలో వినుకొండ ప్రాంతం వర్ధిల్లినట్లు ఎన్నో చారిత్రక, సాహిత్య, శాసనాధారాలు ఉన్నాయి. వినుకొండ స్థల పురాణం ప్రకారం.. రామాయణ కాలంలో సీతాదేవి జాడ "విన్నకొండ" గా తదనంతర కాలంలో విన్నకొండ "వినుకొండ"గా పేరు పడిందని పురాణకారులు చెబుతారు. అందుకే కొన్ని కావ్యాలలో ఈ ప్రాంతాన్ని "శృతగిరి పురంబు " అని వర్ణించారు. చారిత్రక ఆధారాలు, చరిత్రకారుల అభిప్రాయాలు పరిశీలిస్తే.. విష్ణుకుండినులు ఏలిన ఈ ప్రాంతానికి "విష్ణుకుండినపురం" అనే పేరు ఉంది. ఆ తర్వాత ఇది వినుకొండగా మారింది. "విష్ణుకుండిన్" అనేది వినుకొండకు సంస్కృతీకరణ అన్నది సాహిత్య కారుల అభిప్రాయం.
వినుకొండ చరిత్ర..
విష్ణుకుండినుల రాజవంశంలో గొప్ప పేరుగడించిన రెండవ మాధవవర్మ కాలంలో వినుకొండ ప్రాంతం ఆయన ఏలుబడిలో ఉన్నట్లు చరిత్రకారులు చెబుతారు. రెండవ మాధవవర్మ అమరావతిని రాజధానిగా చేసుకొని తన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయనకు " త్రికూట మలయాధిపతి "అనే బిరుదు కూడా ఉంది. త్రికూట పర్వతం అంటే నేటి కోటప్పకొండ. విష్ణుకుండినులు శైవ భక్తులు. అయినప్పటికీ వారి కాలంలో జైన, బౌధ మతాలు ప్రజాదరణ పొందాయి. విష్ణుకుండినులు రామలింగేశ్వర దేవాలయాల పేరిట శివాలయాలు నిర్మించే వాళ్ళు. ఆ విధంగానే వారి పరిపాలన కాలంలో వినుకొండ కొండ పై రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించినట్లు చరిత్రకారుల అభిప్రాయం. విష్ణుకుండినుల పరిపాలన అనంతరం కాలక్రమంలో వినుకొండ ప్రాంతం మహమ్మదీయులు పరిపాలన, బ్రిటిష్ పరిపాలనలోకి వెళ్ళింది. ఈ ప్రాంతంలో సాంస్కృతిక వైవిధ్యం కనిపిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం గోచరిస్తుంది. అందుకే వినుకొండ ప్రాంత ప్రజలందరూ సోదరులుగా కలిసిమెలిసి జీవిస్తారు. వినుకొండ కొండ పై ఉన్న ప్రసన్న రామలింగేశ్వర స్వామి ఆలయం, మహమ్మదీయుల కాలంలో నిర్మించిన జామియా (పెద్ద) మసీదు, బ్రిటిష్ కాలం నాటి చర్చిలు వినుకొండ ప్రాంత చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి.
ప్రాచీన కవులు..
చరిత్ర పరంగా వినుకొండ ప్రాంతం ఎంత గుర్తింపు పొందిందో, సాహిత్య పరంగాను ఈ ప్రాంతానికి అంతే గుర్తింపు లభించింది. ప్రాచీన సాహిత్యకారుల కరస్పర్శతో ఈ నేల సాహిత్య సుగంధాలు విరజిమ్మింది. క్రీ.శ.15 వ శతాబ్దం ప్రథమార్థంలో జీవించిన వినుకొండ వల్లభరాయుడు వినుకొండ ప్రాంతానికి చెందిన సాహిత్యకారుడిగా చరిత్రకారుల అభిప్రాయం. వినుకొండ వల్లభరాయుడి పూర్వీకులు వినుకొండ ప్రాంత వాస్తవ్యులు. వినుకొండ వల్లభరాయుడి తండ్రి వినుకొండ మహా ప్రధానిగా పనిచేశారని చరిత్రకారుల చెబుతారు. " క్రీడాభిరామం " అనే సుప్రసిద్ధ వీధి నాటకాన్ని వినుకొండ వల్లభరాయుడు రచించాడు. క్రీడాభిరామం రచన విషయంలో సాహిత్యకారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కవి సార్వభౌముడు శ్రీనాథుడు "క్రీడాభిరామం" రచించాడని కొందరి సాహిత్యకారులు అభిప్రాయపడతారు. ఏది ఏమైనప్పటికీ వినుకొండ వల్లభరాయుడు, కవి సార్వభౌమ శ్రీనాథుడు వంటి ప్రాచీన కవులు వినుకొండ ప్రాంతాన్ని ముద్దాడిన వారే. కొండవీడు విద్యాధికారిగా పనిచేసిన శ్రీనాథుడు ఎన్నోమార్లు వినుకొండకు విచ్చేసి బస చేశాడు. రాజ వంశాల పతనం తరువాత కాల క్రమంలో వినుకొండ ప్రాంతం బ్రిటిష్ పరిపాలనలోకి వెళ్ళింది. క్రైస్తవ మిషనరీల ప్రభావంతో వినుకొండ ప్రాంతంలో ఆంగ్ల విద్యా వ్యాప్తి జరిగింది. తదనంతరం ఎందరో వినుకొండ ప్రాంతవాసులు ప్రాచీన కవుల బాటలో నడిచి సాహిత్య సేవ చేశారు.
ఆధునిక కవులు..
ఆధునిక సాహిత్య దశ ప్రారంభమైన తరువాత వినుకొండకు చెందిన ఎందరో కవులు తెలుగు సాహిత్య ప్రస్థానాన్ని ఆధునిక సాహిత్యం వైపు పరుగులు పెట్టించారు. వీరిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ పేరు మహాకవి గుర్రం జాషువా. వినుకొండలో పుట్టిన గుర్రం జాషువా విశ్వనరుడిగా ఎదిగాడు. ఆయన రచించిన కావ్యాలు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. " గబ్బిలం " కావ్యానికి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. తెలుగు సాహిత్యంలోని అన్ని కోణాలను సృజించిన గుర్రం జాషువా తెలుగు సాహిత్య చరిత్రలో మహాకవిగా నిలిచిపోయాడు. జాషువా సమకాలికుడు బిర్నీడి మోషే కవి, క్రైస్తవ కీర్తనలతో పాటు గొప్ప పద్య సాహిత్యం అందించాడు.
" పలనాడు వెలలేని మాగాణిరా.." అంటూ ఎలుగెత్తి చాటిన అభ్యుదయ కవి పులుపుల వెంకట శివయ్య. వినుకొండకు ఎనలేని ఖ్యాతి తెచ్చిన నిరాడంబర రాజకీయ, సాహిత్యకారుడు. అభ్యుదయ సాహిత్యాన్ని అందించి తదనంతర కవులకు మార్గదర్శిగా నిలిచాడు. వినుకొండకు చెందిన మరో అభ్యుదయ సాహిత్య నవలా రచయిత గంగినేని వెంకటేశ్వరరావు. కమ్యూనిస్టు యోధుడిగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే సాహిత్య సేవ చేశాడు. ఆయన రాసిన ఎన్నో నవలలు, గేయాలు ప్రాచుర్యం పొందాయి. కట్టమంచి రామలింగారెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ వంటి ప్రముఖుల చేత ప్రశంసలు పొందిన వినుకొండకు చెందిన మరో కవి గద్దల జోసఫ్. ఆయన రాసిన కావ్యాలు అప్పట్లో డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా కొనసాగాయి. వినుకొండలో చదువుకున్న కుందుర్తి ఆంజనేయుల వచన కవితా పితామహుడిగా పేరు గడించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
ముద్ర సంస్థాపకుడిగా, కాలమిస్టుగా, రచయితగా, ఇంగ్లీషు, తెలుగులో పలు వ్యాసాలు పుస్తకాలు రచించిన ఏ.జి కృష్ణమూర్తి వినుకొండలో జన్మించారు. గుర్రం జాషువా కుమార్తె హేమలతా లవణం, బీర్నిడి ప్రసన్న, దీపాల పిచ్చయ్య శాస్త్రి, గద్దల శామ్యూల్ (ఖగరాజు), కంచర్ల పాండురంగ శర్మ , షేక్ ఫరీద్, షేక్ దారియా హుస్సేన్, వజ్రగిరి జోసెఫ్, రాయబారం శామ్యూల్, తాడిపర్తి శామ్యూల్, విజయ దత్తు.. కవులు, రచయితలు తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే రచనలు అందించారు. 1990 అనంతరం వినుకొండ ప్రాంతానికి చెందిన కవులు, రచయితలు సాహిత్య బాటలో పయనిస్తున్నారు. ఆధునిక సాహిత్యంలో ముస్లింవాదం వినిపిస్తున్న కవి కరిముల్లా, పద్య సాహిత్యం రాస్తున్న దుబ్బల దాసు, నానీలు అనే నూతన సాహిత్య ప్రక్రియలో కవిత్వాన్ని రచిస్తున్న కే.జే. రమేష్ వినుకొండ ప్రాంత రచయితలుగా గుర్తింపు పొందారు. వీరితో పాటు వినుకొండ యువ రచయితలు కథలు, కవితలు, గేయాలు, వివిధ సాహిత్య ప్రక్రియలను సృజిస్తూ నాటి తరం సాహిత్యకారుల బాటలో ప్రయాణిస్తున్నారు.
- శిఖా సునీల్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి