అణువణువూ స్పూర్తిని నింపే మన కాలపు మేధావి 'జంగం చిన్నయ్య'. చదువు మాత్రమే తరాన్ని మార్చగలదు అని నమ్మి, నిరూపించిన గొప్ప వ్యక్తి డాక్టర్ జంగం చిన్నయ్య. అణగారిన వర్గాల నుంచి పుట్టే ప్రపంచ మేధావులు అరుదుగానే ఉంటారు. వారి జీవిత ప్రయాణం నేర్చుకోదగ్గ పాఠ్యాంశం. డాక్టర్ జంగం చిన్నయ్య గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అత్యంత నిరుపేద కుటుంబం నుంచి ప్రయాణం మొదలెట్టి, ప్రభుత్వ హాస్టల్లో చదువుకొని యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి పీహెచ్డీ, న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పీడీఎఫ్ చేసిన మేధావి అంటే కచ్చితంగా తెలుసుకుంటాం..

డాక్టర్ జంగం చిన్నయ్యది నిజామాబాద్ జిల్లా కొమ్మన్ పల్లి గ్రామంలో అత్యంత నిరుపేద, అణగారిన వర్గానికి చెందిన కుటుంబ నేపథ్యం. పాఠశాల వయసులోనే ఎంతో కష్టపడి పెంచిన తల్లిని పోగొట్టుకున్నాడు. తండ్రి లేడు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ పదో తరగతి, ఉట్నూరు ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. నాగార్జున సాగర్ లోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో 1990-93 లో డిగ్రీ పూర్తి చేశాడు. ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల అంటే నిరుపేద, అణగారిన వర్గాల విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దే కర్మాగారం. ఇక్కడ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో జంగం చిన్నయ్య హిస్టరీ లో గోల్డ్ మెడల్ సాధించాడు. యూజీసీ జే.ఆర్.ఎఫ్ సాధించటంతో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ ఆహ్వానం పలికింది. అక్కడే మహాకవి గుర్రం జాషువా రచించిన "గబ్బిలం" కావ్యం పై ఎమ్. ఫీల్ పూర్తిచేశాడు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కోటి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేశాడు. ఈ సమయంలోనే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫెలిక్స్ ఫెలోషిప్ కి ఎంపిక కావడంతో యూనివర్శిటీ ఆఫ్ లండన్ లో పరిశోధన చేసి పీహెచ్డి పూర్తిచేశాడు. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ అందుకున్నాడు. ఇంతటి గొప్ప మేధావికి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు స్వాగతం పలకడం సహజమే. ప్రస్తుతం డాక్టర్ జంగం చిన్నయ్య కెనడాలోని కాల్టన్ యూనివర్సిటీలో చరిత్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉన్నాడు. పాఠశాల వయసులోనే తల్లిని కోల్పోయిన, తండ్రి లేకున్నా, సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదివిన విద్యార్థి ఇంతటి మేధావిగా ఎదిగాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇవన్నీ ఐదు పదుల వయసులోనే సాధించాడంటే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. డాక్టర్ జంగం చిన్నయ్య రచించిన " Dalits and The Making of Modren India " ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 2017లో ముద్రించింది.- శిఖా సునీల్
-------------------------
డాక్టర్ జంగం చిన్నయ్య పరిచయాన్ని MIC TV లో క్రింద లింక్ ద్వారా చూడండి...
https://youtu.be/fmuROIJbnIU
డాక్టర్ జంగం చిన్నయ్య జీవితం స్ఫూర్తిదాయకం. నిజంగానే అణగారిన వర్గాల జీవితాలు కష్టాల కొలిమి లోంచి నిప్పురవ్వలై ఎగిసినవాళ్లే.
రిప్లయితొలగించండి