వీధి బడి నుంచి విశ్వవిద్యాలయ సాహిత్య పీఠాధిపతిగా ఎదిగిన ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జీవిత ప్రయాణం చాలా గొప్పది. " తెలుగు చదివితే ఏమొస్తుంది.." అనుకునే రోజుల్లో తెలుగు మాత్రమే చదివి సాహిత్య చరిత్రలో చెరిగిపోని స్థానాన్ని సంపాదించిన మేధావి ఆచార్య ఎండ్లూరి సుధాకర్. తెలుగు సాహిత్యంలో మార్గదర్శి, ఆదర్శ గురువు, అంతకు మించిన అభ్యుదయవాది ఆచార్య ఎండ్లూరి సుధాకర్.
యాదృచ్ఛికమే కానీ, మహాకవి గుర్రం జాషువా వందేళ్ల క్రితం బడిపంతులు ఉద్యోగాన్ని వదిలి బతుకుదెరువు కోసం రాజమండ్రి వెళ్ళాడు. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ కూడా హైదరాబాదులో బడిపంతులు ఉద్యోగం వదిలి 1990లో రాజమండ్రిలో తెలుగు అధ్యాపకుడిగా సరి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. మహాకవి గుర్రం జాషువా సాహిత్యాన్ని ఆసాంతం చదివిన ఆచార్య ఎండ్లూరి సుధాకర్, మహాకవి చూపిన మార్గాన్నే ఎంచుకున్నాడు. గుర్రం జాషువా రచించిన " గబ్బిలం " కావ్య స్ఫూర్తితో ఆచార్య ఎండ్లూరి "కొత్త గబ్బిలం" అనే దీర్ఘ కావ్యం రచించి ఆధునిక కవిత్వంలో కొత్త ఒరవడి సృష్టించారు.
1962 ప్రాంతంలో హైదరాబాద్ లోని కృపానందం వీధి బడిలో ఆచార్య ఎండ్లూరి సుధాకర్ తెలుగు అక్షరాలు దిద్దాడు. అక్కడే, ఆయన చదివిన " బాలశిక్ష " తెలుగు సాహిత్యం వైపు అడుగులు వేయడానికి కారణమైంది. బాలశిక్షలోని అందమైన అక్షరాలు, గుండ్రటి గుణింతాలు, ప్రాసలు, లయాత్మక వాక్యాలు, సామెతలు, నుడికారాలు తెలుగుభాషపై ఇష్టం ఏర్పడడానికి కారణమయ్యాయని ఆయన చెబుతాడు. అదే ఇష్టంతో నల్లకుంటలోని ఆంధ్ర ప్రాచ్య కళాశాలలో ఓరియంటల్ డిగ్రీ పూర్తి చేసి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో ఎంఏ, ఎం.ఫిల్, పీహెచ్.డి పట్టాలు పొందాడు. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ పీహెచ్.డి సిద్ధాంత గ్రంథం "జాషువా సాహిత్యం, దృక్పథం, పరిణామం" ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. చదువు పూర్తయిన తరువాత 85 నుంచి 90 వరకు కొంత కాలం హైదరాబాద్ లో తెలుగు పండిట్ గా ఉద్యోగం చేసి 1990లో తెలుగు విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా రాజమండ్రి ప్రాంగణంలో అడుగు పెట్టాడు.
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ముప్ఫై రెండేళ్ల పాటు విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా, సాహిత్య పీఠాధిపతిగా ఎందరో తెలుగు సాహిత్య విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దాడు. ఆయన పర్యవేక్షణలో పరిశోధన చేయాలనీ, ఆయన ఉపన్యాసాలు, పాఠాలు వినాలనీ ఒక్కసారైనా ముఖాముఖి మాట్లాడాలని అనుకోని తెలుగు సాహిత్య విద్యార్థులు ఉండకపోవచ్చు. ఆయన పర్యవేక్షణలో పీహెచ్.డి పొందిన వారిలో సుమారు పదిహేను మంది బంగారు పతకాలు అందుకున్నారు. అధ్యాపకుడిగా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో అభ్యుదయవాదిగా అంతే గొప్ప రచనలు చేశాడు.
" ఆగ్రహం రాని అక్షరం జ్యలించదనీ
ఆర్ద్రత లేని వాక్యం ఫలించదనీ
నా అనుభవం నేర్పిన కవిత్వ పాఠం
నాలుగు మెతుకులే నా అక్షరాలు
నలుగురు మనుషులే నేను చదివిన ప్రబంధాలు
నా బాల్య దృశ్యాలే నేను చూసిన అలంకార శాస్త్రాలు
ఆకలి రసం నాలోని రచనా రహస్యం
అవమాన విషం నా కంఠంలోని నీలామృత విశేషం
మా బీద బస్తిలే నన్ను కవిని చేశాయి
నాలోని భావుకత్వానికీ బాధల తత్వానికీ బాటలు వేశాయి
మా వీధి కుక్కలు జీవితాన్నీ, జీవించడాన్ని నేర్పాయి "
..... అంటూ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ దీర్ఘ కవిత్వ రచనలు చేశాడు. కొత్త గబ్బిలం, వర్గీకరణీయం, గోసంగి రచనలు కలిపి "కావ్యత్రయం" వెలువరించాడు.
- శిఖా సునిల్
( నేడు కన్నుమూసిన ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారికి నివాళి )
డాక్టర్. ఎండ్లూరి సుధాకర్ గారి కవిత్వం అజరామరం. అభినవ జాషువా. నివాళులు ఇరువురికీ.
రిప్లయితొలగించండిజాషువా గారు పుట్టిన వినుకొండలో ఉండటం మా అదృష్టం.
తొలగించండి