జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

మరుగున పడిన వినుకొండ మధుర కవులు

 ‘‘ఎంత కోయిల పాట వృథయయ్యెనో కదా

చిక్కు చీకటి వనసీమలందు

ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా

కటిక కొండల మీద మిటకరించి

ఎన్ని కస్తూరి జింకలీడేరెనో కదా

మురికి తిన్నెల మీద పరిమళించి

ఎంత రత్నకాంతి, యెంత శాంతి

ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో

పుటరాని చోట పుట్టుకతన’’

 - అన్న మహాకవి గుర్రం జాషువా పద్యం గుర్తుకు తెచ్చే కాలం అది. కవిత్వానికి కులం ఓ కొలమానంగా ఉన్న రోజులవి. వర్ణ వ్యవస్థను ధిక్కరిస్తూ హిందూ గ్రంథాలు చదవడం అప్పట్లో సాహసంతో కూడుకున్న పని. అలాంటి రోజుల్లో అస్పృశ్యతపై నిరసన గళం విప్పి కలం పట్టిన కవులు ఆధునిక సాహిత్య చరిత్ర ప్రథమార్థంలో కొద్దిమందే ఉన్నారు. దళిత ఉద్యమాన్ని రెండు భాగాలుగా విభజించి మొదటి భాగాన్ని అస్పృశ్యతా నిరసన ఉద్యమం అన్నారు సాహిత్య కారులు. 1909లో ‘ఆంధ్రభారతి’ పత్రికలో ప్రచురితమైన ‘మాలవాండ్ర పాట’ అన్న గేయంలో ‘అస్పృశ్యతా నిరసన’ కనిపిస్తుంది. గాంధీ రాకతో అది ‘ఉద్యమం’గా మారింది. 1930 నుంచి హరిజనులు సాహిత్య రంగ ప్రవేశం చేశారు. కావ్యాల రూపంలో తమ సమస్యలను రాయటం మొదలుపెట్టారు. సాహిత్య క్షేత్రంలో కలం పట్టి కులం కంపును ఏరివేసే ప్రయత్నం చేశారు. అలాంటి ఉద్యమంలో వినుకొండ (గుంటూరు జిల్లా)కు చెందిన ఇద్దరు కవులు పాలుపంచు కున్నారు. తమ పద్యాలతో వర్ణ వ్యవస్థ మూలాలను కడిగేసిన తొలితరం కవులు వారు. ‘నవ సంధ్య’ కావ్యం రచించిన బీర్నీడి మోషే, ‘కన్నీటి కబురు’ రచించిన గద్దల జోసఫ్‌లు దళిత ఉద్యమ ప్రథమార్థంలో పాలుపంచుకున్నారు.

మహాకవి గుర్రం జాషువా కన్నా మూడేళ్ళ ముందు 1892లో వినుకొండ తాలూకా బ్రాహ్మణ పల్లెలో బీర్నీడి మోషే జన్మించాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. పద్య కవిత్వం పట్ల ఆయనకు అమితాసక్తి. 15వ ఏటనే కలం పట్టి పద్య రచనకు శ్రీకారం చుట్టాడు. ‘వసంతకోకిల’, ‘నవ సంధ్య’, ‘హరిజనాభ్యుదయం’, ‘పూలగంపచరిత్ర’, ‘ఇస్సాకు కథ’, ‘గురుభక్తి’, ‘ఉత్తర గోగ్రహణం’... ఆయన రచనల్లో ముఖ్యమైనవి. ‘నవ సంధ్య’ అనే కావ్యానికే ‘చీకటి కేక’ అనే మరో పేరు ఉంది. వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చిన పదునైన కావ్యం ఇది. ‘‘ఈ కావ్యం సంఘంలో పతితులుగా, బానిసలుగా చూడబడే అనాథల కోసం రాయబడ్డ కావ్యం’’ అని మోషే నాంది వాక్యంలో చెప్పాడు.

 ‘‘సహృదయుడైన కవి కళ్ల యెదుట, శతాబ్దాల తరబడి పీడించబడే జాతి, బాధపడే బానిస జనాంగమూ ఉంది’’ అంటూ ఓ మాదిగవాడిని కథానాయకుడిగా చేసి రాసిన కావ్యం ఇది. బహుశా మాదిగ కులస్తుడు (కులం పేరును ప్రస్తావిస్తూ) కథానాయకుడిగా వచ్చిన తొలి కావ్యం ఇదేనేమో.

 ‘‘...గుంటూరు నగరి/ కోరగానున్న యొక్క పల్లెటూరి లోన/ వానమొనరించు మాదిగ వాడొకండు!’’ అంటూ కావ్యం ప్రారంభమౌతుంది. సంక్షిప్తంగా కావ్యంలోని కథ ఇది. ‘‘ఒక పీడిత జాతికి చెందినవాడు స్వప్నంలో సత్యలోకం దాకా ప్రయాణిస్తాడు. సృష్టికర్తను ‘నాకు విముక్తి ప్రసాదించు’ అని ప్రార్థిస్తాడు. అక్కడ అతనికి నిరాశ మిగులుతుంది. భారత మాతృశ్రీ అతన్ని ఆప్యాయంగా ఆదరించి ఓదారు స్తుంది. కళ్లు తెరుస్తాడు. స్వాప్నికమైన ఆవేశముద్ర అతనికి హృదయం నుంచి చెరిగిపోదు. ఉద్రేకంతో, ఉత్సాహంతో శివాలయంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ పీఠాధిపతులు అతన్ని హింసిస్తారు. గాంధీ ఆగమనంతో పరిస్థితులు చక్కబడతాయి. ఆ మాదిగవాడి దేవాలయ ప్రవేశంతో కథ ముగుస్తుంది.’’ ఈ కావ్యానికి కథ ప్రధానం కాదు. పంచములని పిలువబడే వారికీ ఒక మహోన్నతమైన చరిత్ర ఉందని, అది గుర్తించి కుల విషయక తారతమ్యాలు వలదని కవి సందేశమిస్తాడు. పదునైన మోషే పద్యాలు వర్ణ వ్యవస్థలోని అసమానతలను ప్రశ్నిస్తాయి.

" కులవంతుల్‌ బలవంతులైయతని హ/క్కుల్‌ దోచుకు న్నారు నిం/దలపై నిందలు మోపి కాదు వలద/న్న కర్మ సిద్ధాంతమున్‌/ తలపై రుద్ది- నధముండనుచు ని/ర్ధారించు దిగ్ధేశముల్‌/ బలియయ్యెన్‌ తన మానవత్వము కరా/ళ ద్వేష దావాగ్నికిన్‌!’’ (‘నవ సంధ్య’ 8వ పద్యం).

 వర్ణ దురహంకారానికి వ్యతిరేకంగా గళం విప్పిన వారికి మోషే పద్యాలు స్ఫూర్తి నింపాయి. మోషే శైలి గుర్రం జాషువా శైలికి దగ్గరగా ఉంటుంది.

‘‘నీ శరీర రక్త నిర్మిత కులముల/గాక వేఱు కాన్పుగాను నేను!/ మాకు సోదరుండవా? కావు పొమ్మను/ జ్యేష్ఠులకు జవాబుఁ జెప్పవేమి?’’ (21వ పద్యం)- అంటూ మనువా దులకు ప్రశ్నల బాణాలు సంధించాడు మోషే. పంచములు ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలని ఈ కావ్యంలో సందేశమిచ్చాడు.

 అప్పట్లో కావ్యం ముద్రించాలంటే ఎంతో వ్యయ ప్రయాసల కోర్చాలి. ‘‘అద్దెకు, ముద్దకు’’ సరిపోని జీతాలు. ఇక అక్షరాలను అచ్చులోకి తీసుకురావాలంటే దుస్సాహసమే. అందుకే ఆనాటి వెనుకబడిన వర్గానికి చెందిన కవులు తమ కావ్యాలను ఎంతో కాలానికి అచ్చు వేయించారు. 1925-30 ప్రాంతంలో మోషే ‘నవసంధ్య’ రచించినా 1940-50 మధ్యనే ఈ కావ్యం అచ్చులో వెలుగు చూసింది. 1958లో మోషే వినుకొండలో మరణిం చారు.

 వినుకొండ ప్రాంతానికి చెందిన మరొక కవి గద్దల జోసఫ్‌. 1908లో వినుకొండ తాలూకా గోకనగొండలో జోసఫ్‌ జన్మించాడు. ఉపాధ్యాయుడిగా పని చేస్తూ కావ్య రచనకు పూనుకున్నాడు. ‘‘తెలుగులో సుప్రసిద్ధ కవులలో నొకరు’’ అని ప్రముఖ సాహిత్య విమర్శకుడు సర్‌ కట్టమంచి రామలింగా రెడ్డిగారు, జోసఫ్‌ను ఉద్దేశించి అన్నారు. అంతేకాకుండా ‘‘నిమ్న జాతులలోని యొకడు ఇంత పాండిత్యము, ఇంత భాషాశక్తి సంపాదించిరనుట ఆ జాతులలోని దివ్యమైన సత్వరమునకు తార్కాణము’’ అని కట్టమంచి అన్నారు. ఆనాటి అస్పృశ్యుల స్థితిగతులను ‘కన్నీటి కబురు’ కావ్యంలో గద్దల జోసఫ్‌ కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ కావ్యం మూడు ఆశ్వాసాల పద్య కావ్యం. ‘‘ ‘కన్నీటి కబురు’ కావ్యం హిందూ సంఘమున నస్పృశ్యులు ఏ స్థితిలో నుండిరో ఆ దుఃఖకరము, విషాదకరమైన జీవితము గొప్ప ప్రతిభతో నిరూపించ బడినది’’ అని కట్టమంచి గారు కావ్యం ముందుమాటలో అన్నారు. ఈ కావ్యం 1960-64 ప్రాంతంలో బీఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంచారు.

 గాంధీ ప్రభావంతో అస్పృశ్యతా నిరసన కవిత్వాన్ని భుజాని కెత్తుకుని ముందుకుసాగిన తొలితరం కవులు బీర్నీడి మోషే, గద్దల జోసఫ్‌లు. అద్భుత సాహిత్యాన్ని అందించిన ఈ కవుల గురించి నేటి తరం వారికి తెలియక పోవడం విచారకరం. వీరి సాహిత్యంపై పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. శిథిలావస్థకు చేరుకుంటున్న వీరి రచనలను కాపాడాల్సిన ఆవశ్యకత ఉంది.

- శిఖా సునీల్‌

-------------------------------------------------------- 

నేను రాసిన ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీలో 2017 మార్చి 20న ప్రచురితం



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్