జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

తంజావూరు వెళ్దాం రండి..!

తమిళ ప్రాంతం వెళ్ళడం నాకు కొత్తేం కాదు. కానీ, వెళ్లిన ప్రతిసారీ కొత్తగానే కనిపిస్తుంది. తమిళ చిత్రాలు విపరీతంగా చూడటం, తమిళ సంగీతం ఇష్టంగా వినడంతో మొదటి నుంచీ నాకు తమిళ ప్రాంతంపై ప్రేమ. సంస్కృతిని నెత్తిన పెట్టుకుని పూజించే తమిళ ప్రజలంటే అభిమానం. ద్రావిడ భాషా కుటుంబంలో తమిళ ప్రజలు అన్ని విషయాల్లో ఒకడుగు ముందుంటారనీ, విశాలమైన ఆలోచనా దృక్పథం కలిగి ఉంటారని నా నమ్మకం. అందుకే, తమిళ సంస్కృతిని దగ్గరగా చూడాలనే ఆలోచనతో ఏడాదిలో ఒకసారైనా  తమిళనాడులో ఏదో ఒక చారిత్రక ప్రాంతానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగా ఈ ఏడాది నా జాబితాలో తంజావూరులోని "బృహదీశ్వరాలయం" చేరిపోయింది. తెలుగు సాహిత్యం చదివే రోజుల్లోనే శైవ కవితోద్యమాన్ని బాగా చదివేవాడిని. సమాజంలో అంతరాలను తుడిపేసి సమానత్వాన్ని కోరుకున్న మతాల్లో శైవం ప్రధానంగా చెప్పుకోదగింది. అందుకే, శైవ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు చూడడం, వాటి చారిత్రక విశేషాలు తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. చారిత్రక కట్టడాలను సందర్శించాలని అనుకున్నప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఆ కట్టడాల చరిత్రను చదివి బాగా అర్థం చేసుకోవడం. చరిత్రను తెలుసుకుని చారిత్రక దేవాలయాలను, కట్టడాలను సందర్శిస్తే కలిగే అనుభూతే వేరు. బృహదీశ్వరాలయాన్ని చూడాలని నిర్ణయించుకున్న తర్వాత చోళ రాజుల చరిత్ర, తంజావూరు, బృహదీశ్వరాలయ కట్టడ ప్రత్యేకతలు ముందుగానే తెలుసుకున్నాను.


నవంబర్ మాసంలో ప్రయాణాలు చాలా బాగుంటాయి. అటు ఎండా, ఇటు చలీ లేకుండా ఆకాశం నిమ్మలంగా అందమైన మేఘాలతో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విజయవాడ నుంచి తంజావూరు 790 కిలోమీటర్ల దూరం. ఈ మొత్తం ప్రయాణాన్ని కొంతదూరం రైలులో కొంత బస్సులో కొంత ఆటోలో చేస్తే బాగుంటుంది అనిపించింది. విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వరకు ఒక రైలు, చెన్నై ఎగ్మోర్ నుంచి నాగపట్నం వరకు మరో రైలులో నెల రోజుల ముందే రిజర్వేషన్ తీసుకున్నాం. అక్కడ నుంచి ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉన్న వెలంగిని చేరుకొని అక్కడ రీ ఫ్రెష్ అయ్యి బస్సులో తమిళనాడులోని పల్లెటూర్లను చూస్తూ వెలాంకిని నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూరు ప్రయాణం చేయాలనేది నా ఆలోచన. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లాలని రిజర్వేషన్ చేయిస్తే చాలు రోజులు వేగంగా తిరిగి పోతాయి. రిజర్వేషన్ తీసుకున్న తరువాత నెల రోజులు నాలుగు నిమిషాల్లా గిర్రున తిరిగి మేం వెళ్లాల్సిన ఆ రోజు రానే వచ్చింది. రైలు కిటికీ పక్కన చల్లటి గాలిని ఆస్వాదిస్తూ విజయవాడ నుంచి చెన్నై ప్రయాణం ప్రారంభమైంది. ఉదయం పది గంటలకు విజయవాడలో సూపర్ ఫాస్ట్ రైలు ఎక్కితే రివ్వుమంటూ సాయంత్రం నలుగున్నర కల్లా చెన్నైలో దింపేసింది. మేము నాగపట్నం వరకు కరైకాల్ ఎక్స్ప్రెస్ లో వెళ్ళాలి. అది రాత్రి పదకొండు గంటలకు చెన్నై ఎగ్మోర్ లో బయలుదేరుతుంది. ఈ మధ్యలో  చాలా సమయం ఉంది. రెండు రైళ్ల మధ్య ఈ సమయం కావాలనే ఉండేలా చూసుకున్నాం. కొద్దిసేపు చెన్నై వీధుల్లో బలాదూర్ గా తిరుగుతూ రోడ్డు పక్కన ఉండే స్ట్రీట్ ఫుడ్ రుచులు చూడాలనేది మా ఆలోచన. చెన్నై సెంట్రల్ నుంచి నేరుగా మెరీనా బీచ్ కి వెళ్తే ఇంకా బాగుంటుంది. శ్రీశ్రీ.. చలం..ఆత్రేయ..ఆరుద్ర.. వంటి మన తెలుగు సాహిత్య కారులు నడిచిన మెరీనా బీచ్ ఇసుక తిన్నెల మీద కాసేపు నడవడం నాకూ ఎంతో ఇష్టం. పండు వెన్నెల్లో మెరీనా అందాలను చూడటం బలే ఉంటుంది. మెరీనా అందాలను ఆస్వాదించి, తమిళనాడు సాంబారు కడుపారా ఆరగించి పదిన్నర ప్రాంతంలో చెన్నై ఎగ్మోర్ రెండో నెంబరు ఫ్లాట్ ఫామ్ పై మా రైలు కోసం వేచి ఉన్నాం. 'మేము ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు' అంటారు కానీ, కరైక్కల్ ఎక్స్ప్రెస్ మాత్రం అలాకాదు. ఒక్క నిముషం కూడా అటూ ఇటూ ఉండదు. ఎలాంటి హడావుడి లేకుండా, వెనుకా ముందూ చూడకుండా నిశబ్దంగా తనపని తాను చేసుకు పోతున్నట్లు కచ్చితంగా టైంకి కదిలి పోతుంది. ఏమాత్రం లేటయినా ట్రైన్ మిస్సయ్యే ప్రమాదం ఉంది. అందుకే అర్ధ గంట ముందుగానే ఫ్లాట్ ఫామ్ పై ఉండటం ఉత్తమ మైన మార్గం. ట్రైన్ కదిలిన వెంటనే మన బెర్త్ పై నడుం వాలిస్తే ఉదయం ఆరు గంటలకల్లా నాగపట్నం కనిపిస్తుంది. అక్కడ నుంచి ఆటో ఎక్కితే అర్ధగంటలో వెలంకిని చేరుకుంటాం. వెలంకిని అనేది దక్షణ భారతంలో సుప్రసిద్ధ క్రైస్తవ ఆధ్యాత్మిక ప్రాంతం. ఇక్కడ ఉన్న చర్చి చాలా ప్రాముఖ్యత కలిగింది. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడే మేము ఓ మంచి రూం తీసుకుని రిఫ్రెష్ అయ్యి పది గంటలకల్లా మేము వెళ్లాల్సిన తంజావూరు బస్సెక్కి కూర్చున్నాము. మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అసలు ప్రయాణం ఇక్కడ నుంచే ప్రారంభమైంది....

- శిఖా సునిల్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్