జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
భావకవిత్వానికి భిన్నంగా అభ్యుదయ కవిత్వాన్ని పుట్టించిన నేల మన వినుకొండ. ఇక్కడి గాలుల్లోనే సాహితీ సౌరభాలు వెదజల్లుతాయి. వినుకొండ స్పర్శతో ఎందరో కవులు తెలుగు సాహిత్య చరిత్రలో చెరిగిపోని స్థానాన్ని పొందారు.
"పాత కాలం పద్యమైతే, వర్తమానం వచన గేయం" అని ఎలుగెత్తి చాటిన వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు వినుకొండ విద్యార్థి. తెలుగు సాహితీ చరిత్రలో కుందుర్తి సుపరిచితుడు. అప్పటి వరకూ విస్తరించిన కవితోద్యమాలకు భిన్నంగా "వచన కవిత్వాన్ని" ఒక ఉద్యమంగా ప్రచారం చేసిన సాహిత్యకారుడు కుందుర్తి ఆంజనేయులు. అంతకు ముందు తెలుగు సాహిత్యంలో వచన కవిత్వం లేదని కాదు. మహామహులైన తెలుగు సాహిత్య కారులు చాలా మందే వచన కవిత్వం రాశారు. కానీ, వచన కవిత్వాన్ని ఉద్యమంగా తెలుగుదేశంలో ప్రచారం చేయడంలో కుందుర్తి ఆంజనేయులు సఫలీకృతుడయ్యాడు. అందుకే కుందుర్తికి "వచన కవితా పితామహుడు" ఆన్న బిరుదు సార్థకమైంది. కుందుర్తికి లభించిన వచన కవితా పితామహుడు బిరుదు కూడా అలనాడు అల్లసాని పెద్దనకు లభించిన "ఆంధ్ర కవితా పితామహుడు" బిరుదు లాంటిదేనని సాహితీ విమర్శకులు చెబుతారు. తెలుగు సాహిత్య చరిత్రలో ఇంతటి పేరు ప్రఖ్యాతులు పొందిన కుందుర్తి ఆంజనేయులుకు వినుకొండతో విడదీయరాని అనుబంధం ఉంది.
గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా కోటవారి పాలెంలో కుందుర్తి ఆంజనేయులు 1922లో జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. బాల్యంలోనే తండ్రిని కోల్పోయాడు. వీరి తాతగారు వినుకొండలో ఉండేవారు. దీంతో కుందుర్తి ఆంజనేయులు వినుకొండలో తాతగారి వద్ద పెరిగారు. వినుకొండ ప్రాంతం అప్పటికే ఎందరో అభ్యుదయ సాహిత్యకారులను అందించిన నేల. ఎంతైనా కవిసార్వభౌముడు శ్రీనాథుడు నడయాడిన భూమి కదా ! అప్పటికే (1941 కి ముందు) మహాకవి గుర్రం జాషువా విశ్వనరుడిగా ఎదిగే క్రమంలో ఉన్నారు. కానీ, బతుకు దెరువు కోసం ఉద్యోగం కావాలి. అందుకే ఉభయ భాషాప్రవీణుడిగా శిక్షణ పొందిన గుర్రం జాషువా అప్పటి గుంటూరు బోర్డు ప్రెసిడెంట్ గా ఉన్న జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సహకారంతో వినుకొండలోని మిడిల్ స్కూల్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందాడు. వినుకొండలో ఉన్న ఈ మిడిల్ స్కూల్ నే తరువాత ఒకటో వార్డు పాఠశాలగా, ఇప్పుడు జిల్లా పరిషత్ బాలికల పాఠశాలగా పిలిచేవారు. ఈ పాఠశాలలోనే కుందుర్తి ఆంజనేయులు 8వ తరగతి వరకు గుర్రం జాషువా వద్ద సాహిత్య పాఠాలు శ్రద్ధగా విన్నారు.
ఎనిమిదో తరగతి వరకు వినుకొండలోనే కుందుర్తి ఆంజనేయులు చదువుకున్నారు. ఆ తర్వాత కళాశాల విద్య కోసం విజయవాడ వెళ్ళారు. అక్కడ కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు మాస్టారుగా ఉన్న కళాశాలలో పాఠాలు విన్నారు. అందుకే కుందుర్తి ఆంజనేయులుపై గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణల ప్రభావం అధికంగానే ఉండేది. చదువు పూర్తయిన తర్వాత ఆంగ్ల ఉపన్యాసకుడిగా, సమాచార పౌర సంబంధాల శాఖలో ఉద్యోగం చేసినప్పటికీ సాహిత్య సేవకే పూర్తి సమయాన్ని వెచ్చించారు. నరసరావుపేటలో నవ్య కళాపరిషత్తు స్థాపించాడు. ఇందులోనే బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం,అనిశెట్టి సభ్యులుగా ఉన్నారు. వచన కవిత్వాన్ని ఉద్యమంగా ప్రారంభించిన తర్వాత హైదరాబాదులో "ఫ్రివర్స్ ఫ్రంట్" స్థాపించారు. వచన కవితా ప్రక్రియను ప్రోత్సహించడం ఈ సంస్థ ప్రధాన ఆశయం.
" వచన కవితా విచారణలో
ఉరిశిక్ష పడ్డ మొదటి ముద్దాయిని నేను
అలనాటి కవితా లతాంగిని హత్య చేశాను
అలంకార ఆభరణాలు అపహరించాను
అన్ని ఒప్పేసుకున్నాను
ఆనాడు బోనులో ఎక్కి
క్రింది కోర్టు వేసిన శిక్షను
మానవ కారుణ్య దృక్పథంతో సడలించి
జన్మ ఖైదు వేశారు, హైకోర్టు న్యాయమూర్తులు
ఒక తరం పాటు బ్రతకాలన్నారు బందీగా
పాఠకుల గుండెల చెరసాలలో.."
అని తన గురించి కవితాత్మకంగా చెప్పుకున్న కుందుర్తి ఆంజనేయులు జన్మించి ఈ ఏడాదితో వందేళ్లు....
బాగుంది సునీల్. మంచి ఆర్టికల్స్ రాస్తున్నావు. ప్రొసీడ్...
రిప్లయితొలగించండిథాంక్యూ సార్..
తొలగించండిValuable work brother congrats
రిప్లయితొలగించండి