జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
మహాకవి గుర్రం జాషువా కవిత్వం విశ్వవ్యాప్తం కానంత వరకు "వినుకొండ" గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. వినుకొండలో పుట్టిన గుర్రం జాషువా విశ్వనరుడిగా ఎదిగాడు. పల్నాడులో వెనుకబడిన ప్రాంతంగా పేరు పడిన వినుకొండ ఖ్యాతిని ప్రపంచం ముందు నిలిపాడు. సాహిత్యాభిమానులకే కాకుండా ప్రతి ఒక్కరికీ గుర్రం జాషువా అంటే వినుకొండ గుర్తొచ్చేలా చేశాడు. పుట్టిన గడ్డ వినుకొండ అంటే జాషువాకు ఎంతో మమకారం.
"ననుగాంచి పెంచి నాలో
గొనంబు గవనంబు పాదు కొల్పిన తల్లి !
నను మరిచిన నిను మరువను
వినుకొండా! నీకు నా పవిత్ర ప్రణతుల్"
అంటూ వినుకొండకు ప్రణమిల్లాడు జాషువా.
వినుకొండలోని మిస్సమ్మ తోటలో 1895 సెప్టెంబర్ 28న గుర్రం జాషువా జన్మించాడు. తల్లిదండ్రులు వీరయ్య, లింగమాంబలది వర్ణాంతర వివాహం. చిన్నప్పటి నుంచి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, కులమత విద్వేషాలు ఎదుర్కొన్న జాషువా వినుకొండలోని మిషనరీ పాఠశాలలో చదువుకున్నాడు. అందుకే జాషువా చాలా సందర్భాల్లో ఇలా చెప్తాడు. ." నా గురువులు ఇద్దరు..పేదరికం, అంటరానితనం. ఒకటి నాకు సహనాన్ని నేర్పితే..రెండోది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే కానీ బానిసగా మాత్రం మార్చలేదు.." అంటాడు. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న జాషువా వినుకొండకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చాట్రగడ్డపాడులో బడిపంతులు ఉద్యోగం చేశాడు. వినుకొండ శివారులో ఉన్న రాజుల కాలం నాటి మసీదు అంటే గుర్రం జాషువాకు ఎంతో ఇష్టం. చిన్నప్పుడే కొందరి మిత్రుల సహకారంతో ఈ మసీదులోనే పురాణ ఇతిహాసాలు చదువుకున్నాడు. చిన్ననాటి నుంచి అడుగడుగునా అనుభవించిన అంటరానితనం వస్తువుగా అద్భుతమైన కావ్యాల రచనకు అక్కడే నాంది పలికాడు. అవి అనుభవంలోంచి పుట్టిన కావ్యాలు కాబట్టే గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర, కాందిశీకుడు వంటి ఎన్నో కావ్యాలు చిరస్థాయిగా నిలిచి పోయాయి.
గుర్రం జాషువా ఇల్లు అప్పట్లో వినుకొండలో ఊరికి దూరంగా ఉండేది. ఇంటి ఎదుట స్మశానం. మేడపై నుంచి ప్రతి రాత్రి సమాధులను, వాటిపై ఉంచిన దీపాలను చూసేవాడు.ఆ స్మశాన వైరాగ్యం నుంచి పుట్టినవే సత్య హరిచంద్ర నాటకంలోని కాటిసీను పద్యాలు.
"ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలసిపోయే.." అంటూ ఆయన రాసిన పద్యాలు ఆంధ్రదేశం అంతటా మారు మోగిపోయాయి. ఎంతో వేదాంతం ధోరని ఉన్న కాటిసీను పద్యాలలో కూడా అస్పృశ్యతను సృజించిన ఘనత ఆయనది. "ఇచ్చట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు.." అంటూ తన పదునైన కలంతో కుల దురహంకారాన్ని కాటిపై దహనం చేశాడు. వినుకొండతో సుమారు 35 ఏళ్ల అనుబంధం గుర్రం జాషువాది. బతుకుదెరువు కోసం రాజమండ్రి వెళ్లిందాకా వినుకొండలోనే ఉన్నాడు.
గుర్రం జాషువా నివసించిన ఇంటి ఆనవాళ్లు ఇప్పుడు వినుకొండలో లేవు. ఆయన చదివిన బోర్డింగ్ పాఠశాల ప్రభుత్వ సాయం లేక మూతపడింది. ఆయన కవిత్వానికి ప్రేరణనిచ్చిన ఊరి చివర మసీదు కనుమరుగైపోయింది. ఆయన పేరుమీద నిర్మించిన జాషువా కళాప్రాంగణం కళా ప్రదర్శనలకు దూరంగా ఉంది. మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన వినుకొండలో కనీసం జాషువా కాంస్య విగ్రహం కూడా లేదు. పుట్టిన గడ్డంటే జాషువాకు అమిత ప్రేమ. జాషువా విశ్వ నరుడిగా ఎదిగి వినుకొండ ఖ్యాతిని పెంచారు. నేటి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కూతవేటు దూరంలోని వినుకొండ ఉంది. జాషువా సాహిత్య పీఠం వంటి పరిశోధనా కేంద్రం వినుకొండలో ఏర్పాటు చేస్తే ఆయనకు ఘన నివాళి. ఆయన స్మారకాలను భద్రపరిచి "వినుకొండ"ఆయన రుణాన్ని తీర్చుకుంటే బాగుండు.
- శిఖా సునీల్
-----------------------------------------------
నేను రాసిన ఈ వ్యాసం 2016 సెప్టెంబరు 28న ఆంధ్రజ్యోతిలో ప్రచురితం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి