జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

ఆలోచింప చేసే తేజోవతి కథలు

ఆధునిక కల్పనా సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ 'కథానిక' ప్రముఖ స్థానాన్ని అలంకరించింది. సామాజిక జీవితాన్ని కళాత్మకంగా చిత్రిస్తూ, పాఠకుడి హృదయాన్ని తాకే వర్తమాన సాహితీ ప్రక్రియ తెలుగు కథానిక. 1910లో మహాకవి గురజాడ అప్పారావుతో ప్రారంభమైన ఆధునిక కథా సాహిత్య ప్రక్రియ జీవనదిలా ప్రవహిస్తూనే ఉంది. కథానికను కొత్త పుంతలు తొక్కించిన చలం, విశ్వనాథ సత్యనారాయణ, మునిమాణిక్యం నరసింహారావు, కాళోజీ, వట్టికోట ఆళ్వారుస్వామి, త్రిపురనేని గోపిచంద్, పాలగుమ్మి పద్మరాజు, భానుమతి, మాలతీ చందూర్ వంటి ప్రసిద్ధ కథకుల నుంచి నేటి తరం యువ రచయితల వరకు కథలలో కొత్త కోణాలను సృజిస్తునే ఉన్నారు. అందుకే తెలుగు సాహిత్యంలో అనంత వైవిధ్యాలతో ఎన్నో కథానికలు పుట్టుకొచ్చాయి. " కథకి గొప్పతనం పట్టాలంటే కథ చిత్రించే జీవితం భూమి నుంచి పైకి  లేవాలి " అంటాడు చలం. అందుకే నిత్యం మనం చూసే సంఘటనలు, మానవ సంబంధాలతో కూడిన కథలు మనలను ఆలోచింపచేస్తాయి. మనసుకు హత్తుకుంటాయి. ఈ కోవకు చెందిన ప్రముఖ కథా రచయిత్రే డాక్టర్ అధరాపురపు తేజోవతి. మానవ సంబంధాలలో, స్త్రీ సమస్యలలో కొత్త కోణాలన సృజించిన కథా రచయిత్రి డాక్టర్ అధరాపురపు తేజోవతి. తనకు ఎదురైన సంఘటనలు, కలిగిన స్పందనలను అవి వ్యక్తులు కానీ, సంఘటనలు కానీ, జాతి, కుల, మత, వర్గ, విభేదాలతో సంబంధంలేకుండా అక్షర బద్ధం చేసిన అరుదైన రచయిత్రి అధరాపురపు తేజోవతి. ఆమె కథల్లో సున్నితమైన సమస్యలను ప్రస్తావించటమే కాకుండా సమస్యలకు పరిష్కారాన్ని కూడా సూచించడం ఆమె ప్రత్యేకత.


రచయిత్రి పరిచయం:

డాక్టర్ అధరాపురపు తేజోవతి  జూలై రెండవ తారీకు 1936లో గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు డాక్టర్ కె.వి. సుబ్రమణ్య శాస్త్రి, రామలక్ష్మమ్మ గారు. అధరాపురపు విఠల్ రావుతో వివాహం అనంతరం గుంటూరులో స్థిరపడ్డారు. యం.ఎ., ఎం.ఎడ్, పి.హెచ్.డి. పూర్తి చేసిన తేజోవతిగారు వృత్తి రీత్యా ఆంగ్లోపన్యాసకులు. సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో సుధీర్ఘ కాలం పాటు ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ పొందారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో పరిసరాలు, పుస్తక పఠనంతో చిన్నప్పటి నుంచే ఆసక్తి, సాహిత్యం పట్ల అభిలాష ఏర్పడింది. తేజోవతి గారు 8వ తరగతిలో ఉన్నప్పుడే కలం పట్టి కథలు రాయడం మొదలు పెట్టారు.' ఊహలే వాహనాలైతే' కథను రాసి పెద్దల ప్రసంశలు అందుకున్నారు. నాటి నుండి ఇప్పటి వరకు తన హృదయాన్ని తట్టిన ప్రతి అంశాన్ని కథలుగా మలచి పాఠకులకు అందించారు.

తేజోవతి రచనలు:

తేజోవతి గారు సుమారు 120 పై చిలుకు కథలను రచించారు. వీటిలో వివిధ తెలుగు, వార పత్రికలలో 50కి పైగా ప్రచురించారు. విజయవాడ రేడియో కేంద్రం నుంచి సుమారు 80కి పైగా కథలు రేడియోలో ప్రసారమైయ్యాయి. వీటితో పాటు 'పూర్వ సంధ్య ప్రవర్తత', 'మృత్యోర్మా అమృతంగమయ' వంటి నవలలు రచించారు. ఆత్రేయ రచించిన ఎన్.జి.వో. నాటిక, త్రిపురనేని గోపిచంద్ ప్రఖ్యాత నవల అసమర్ధుని జీవిత యాత్ర నవలలను ఆంగ్లంలోకి అనువదించారు.' సాక్ష్యం చెప్పని కృష్ణమ్మ' అనే కథల సంపుటిని పాఠకుల ముందుకు తెచ్చారు. తేజోవతి గారి రేడియో కథలు నిరక్షరాస్యులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 2011లో ప్రఖ్యాత ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కళాపీఠం అవార్డు అందుకున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ప్రతిభ పురస్కారం, గంగప్ప సాహితి పురస్కారం, బొమ్మిడాల సాహితి పురస్కారం ( సంఘ సేవలో) అందుకున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ తరపున పలు సన్మానాలు పొందారు.

తేజోవతి కథలు- పరిచయం:

తేజోవతి గారు రచించిన కథల్లో ప్రతి కథలోను ఏదో ఒక సందేశం నిక్షిప్తమై ఉంటుంది. ఆమె కథలు ఆలోచింప చేసేవిగా, సున్నితమైన సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఉంటాయి.

సాక్ష్యం చెప్పని కృష్ణమ్మ..

ఆర్థికంగా చితికిపోయిన కుటుంబ వాతావరణం చిన్న పిల్లల మనస్సులను ఎలా గాయ పరుస్తుందో, దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పే కథ సాక్ష్యం చెప్పని కృష్ణమ్మ. చిన్న పిల్లల మనస్థత్వం చాలా సున్నితమైనది. ఆ మనస్సులను గాయపరచినా, ఆలోచింపచేసినా విషాదమే మిగులుతుందనే సారాంశం ఈ కథలో ఉంది. శ్రీనివాస్, రాధా దంపతులు ఆర్ధికంగా చితికిపోయి బతుకుదెరువు కోసం గుంటూరు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఏడవ తరగతి చదివే కుమారుడు శ్రీకాంత్ ఉన్నాడు. ప్రతి రోజు ఇంట్లో ఉండే ఆర్ధిక ఇబ్బందులను శ్రీకాంత్ గమనిస్తు ఉంటాడు. ఇతరులు సుఖంగా, జల్సాగా ఉండటాన్నీ చూస్తాడు. ఇంట్లో సమస్యల గురించి తల్లిదండ్రులతో మాట్లాడితే వారు కోపంగా "పూట గడవటానికి ఎంతో కష్టపడుతున్నాము. చేతనైతే నాలుగు డబ్బులు సంపాదించు అప్పుడు అర్ధమౌతుంది" అంటారు." డబ్బు సంపాదించడం ఎంత కష్టమో తెలుస్తుంది" అంటారు.

ఈ మాటలు శ్రీకాంతను తీవ్రంగా ఆలోచింపచేస్తాయి.ఎలాగైనా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. రకరకాల ఆలోచనలు చేస్తాడు. వీలుపడదు. ఒకరోజు కృష్ణా నదిలో యాత్రికులు, భక్తులు విసిరే డబ్బులను ఏరుకునే పిల్లలను చూస్తాడు. వారితో మాట్లాడితే రోజుకు ఇలా చేస్తే రు. 60-70లు దొరుకుతాయని శ్రీకాంతకు చెపుతారు. ఇదేదో బాగుందని, ఇలాగైనా డబ్బులు సంపాదించి ఇంట్లో ఇవ్వవచ్చని అనుకుంటాడు. ఒక రోజు ఇంట్లో చెప్పకుండా కృష్ణా నదికి వెళ్తాడు. శ్రీకాంత్ కృష్ణా నదిలో మునిగి భక్తులు విసిరిన డబ్బులు ఏరుకుంటుంటే అక్కడి ఇతర పిల్లలు వాళ్ళకు ఎక్కడ డబ్బులు తగ్గుతాయోనన్న ఈర్ష్యతో శ్రీకాంత్ ను నీళ్ళలో ముంచి చంపేస్తారు. ఇలా కథ విషాదాంతంతో ముగుస్తుంది. తెలిసి తెలియని వయస్సులో ఆలోచనలు, వాటి ఆచరణ ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో ఈ కథ ద్వారా రచయిత్రి తేజోవతి చెప్పారు.

లక్ష్మణ రేఖ:

ఎదిగిన పిల్లలకు స్వేచ్ఛా ఇవ్వాల్సిందే. కానీ, ఆ స్వేచ్ఛకు హద్దులు కూడా ఉంటాయని, అవి దాటితే వచ్చే అనర్ధాలను పిల్లలకు వివరంగా చెప్పాలని  ' లక్ష్మణరేఖ ' కథలో రచయిత్రి వివరించారు. దీపిక వయసులో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. దీనిని చూసిన స్నేహితురాలు హైమా దీపికగా ఉండాలని వాళ్ళ ఇంట్లో గొడవ పడుతుంది. అప్పుడు హైమా వాళ్ళ అమ్మ స్త్రీ స్వేచ్ఛకు పరిమితులుంటాయని, ప్రకృతి నియమాలను అర్ధమైయ్యేలా వివరిస్తుంది. ఒక రోజు అర్ధ రాత్రి వరకు దీపిక ఇంటికి రాకపోయేసరికి వారి తల్లిదండ్రులు కంగారు పడిపోతారు. తెలిసిన వారందరికి ఫోన్ చేస్తారు. చివరికి పోలీసులకు చెబుతారు. దీపిక ఆ రాత్రి తన బాయ్ ఫ్రెండ్తో పార్టీకి వెళ్తుంది. నమ్మించిన ఆమె స్నేహితుడు దీపికను వ్యభిచార ముఠాకు అమ్మాలని ప్రయత్నిస్తాడు. చివరకు పోలీసులు వచ్చి దీపికను రక్షిస్తారు. స్వేచ్ఛ వాటి పరిధులను అతిక్రమిస్తే వచ్చే నష్టాలు ఎలా ఉంటాయో ఈ కథలో రచయిత్రి తేజోవతి సున్నితంగా వివరించారు.

కాళికలై కదలిరండి:

ప్రేమగా పెంచుకున్న పిల్లలు ర్యాగింగ్ భూతానికి బలైతే తల్లిదండ్రులు పడే బాధ, ఆవేదన ఈ కథలో ఉంది. కళాశాలలో విద్యార్థినుల సమస్యలపై పోరాడటానికి, పరిష్కరించుకోవటానికి విద్యార్ధినులే నడుంబిగించాలని రచయిత్రి సూచించారు. శారద ఒక్కగానొక్క కుమార్తె స్వాతి. కష్టపడి చదివి ఇంజనీరింగ్ సీటు సంపాదించింది. ఎన్నో ఆశలతో కళాశాలలో అడుగు పెడుతుంది. కానీ కళాశాలలో ఎదురైన పరిస్థితులు, సీనియర్ల ర్యాగింగుకు బలవుతుంది. సున్నిత మనస్తత్వం ఉన్న స్వాతి ఆత్మహత్యాయత్నం చేసుకుంటుంది. ఈ సంఘటన కళాశాలలో ఇతర విద్యార్థులను కదిలించి ఉద్యమానికి దారితీస్తుంది. విద్యార్థులు అధైర్య పడకుండా సమస్యను పరిష్కరించుకోవాలని రచయిత్రి చెబుతారు.

ముగింపు:

సుమారు 120 కి పైగా కథలు, 15 నవలలు రచించిన తేజోవతి గారు వివిధ కోణాలను సృజించారు. తేజోవతి కథల సారంశం సామాజిక దృక్పధంతో కూడి ఉంటుంది. నిరక్షరాస్యులకు అర్థమైయ్యే రీతిలో రేడియోలో కథలు ప్రసారమైయ్యాయి. స్త్రీ స్వేచ్ఛ, వాటి పరిధులు, మధ్యానికి బానిసైన భర్తలతో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు, వరకట్న సమస్యలు, మానవ సంబంధాలు, విలువలు లోపిస్తే వచ్చే అనర్ధాలు, స్త్రీ విద్య, కుటుంబ నియంత్రణ మొదలైన అనేక అంశాలను తేజోవతిగారు కథల రూపంలో వివరించారు. ప్రతి కథ ఏదో ఒక సందేశంతో  ముగుస్తుంది.

- వి.పద్మ

యూజీసీ నెట్, ఏపి సెట్ ఇన్ తెలుగు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్