జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
"జాతి పరంగాను, సంస్కృతి పరంగాను, భాషా పరంగాను, ప్రపంచమంతా ఒకే లక్ష్యాన్ని, ఏకతను సాధించడానికి కృషి జరుపుతున్నది. ప్రపంచం ఏకత వైపు ప్రయాణిస్తున్నది. ఈ ప్రపంచానికి అనేక కోణాలున్నాయి. అనేక అవరోధాలు, కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. పురాతన సంస్కృతులు అంతరించి పోతున్నాయి.” ప్రముఖ పరిశోధకుడు నదీం హస్ నైన్ అన్న మాటలు అక్షర సత్యాలు. విభిన్న సంస్కృతులకు, జాతులకు, జీవన విధానాలకు నిలయమై ఉన్న భారతీయ సంస్కృతి భిన్నమైనది. ఇక్కడ నివశించే ప్రతి జాతికి విభిన్నమైన జీవన విధానం, అమోఘమైన చరిత్ర ఉంది. చరిత్ర కొనసాగింపుగానే సాంస్కృతిక మార్పుల్లో భాగంగా జాతుల జీవన విధానం పరివర్తనకు లోనవుతూ వుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం భిన్నమైన జీవన విధానాలను మనం చూస్తున్నాము. జీవన విధానంలో సాంస్కృతిక పరివర్తన ఏ కొద్ది కాలంలోనో సంభవించే మార్పు కాదు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. జాతుల జీవన విధానాలకు, అభివృద్ధికి, మార్పుకు సాహిత్యం కూడా దోహదం చేస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. గడిచిన 150 ఏళ్ళ కాలంలో దళితుల జీవన విధానం క్రమేనా మార్పుకు లోనైంది. దీనికి సాహిత్యం కూడా ఒక ప్రధాన కారణం.
1850 కి పూర్వం దళితుల జీవన విధానం:
1860-80 ప్రాంతంలో ఎమ్మా రోషాంబు క్లౌ అనే బ్రిటీషు దొరసాని ఒంగోలు కేంద్రంగా క్రైస్తవ మిషనరీని స్థాపించారు. ఆమె ఉన్నత విద్యావంతురాలు, రాయల్ ఏషియాటిక్ సోసైటీలో సభ్యురాలు. మిషనరీ పనులలో భాగంగా దళితులు అనబడే మాదిగల జీవన విధానాన్ని ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. మాదిగలతో కలిసి జీవించారు. ఆమె సేకరించిన గాధలు, మాదిగ జీవన విధానం పుస్తక రూపంలో ప్రచురించారు. ఆమె పరిశీలన ప్రకారం దళితులలోని ఒకరైన మాదిగలకు మహోన్నతమైన పురాణ చరిత్ర ఉంది.
ఆది జాంబవంతుడిని తమ మూలపురుషుడుగా మాదిగలు చెప్పుకుంటారు. ఆయన వారి పితామహుడు. రామాయణ మహాకావ్యంలో ఆదిజాంబవంతుడు ఘట్టాన్ని వివరించారు. అప్పటికే జాంబవ తెగకు ప్రత్యేక జీవన విధానం, సంస్కృతి ఉందని దళితుల నమ్మకం. అందుకే శ్రీరామ చంద్రుడు యుద్ధంలో జాంబవుడి సలహా తీసుకున్నాడని అంటుంటారు. ఇప్పటికీ జాంబవంతుని నాటకాన్ని మాదిగవాడలలో ఆడుతుంటారు. దీనిని జాంబవ పురాణం అని కూడా అంటారు. అలాంటిదే అరుంధతి శాపం కథ. ఒకానొకప్పుడు అనేక పాపాలు చేసిన బ్రహ్మణుడు ఉండేవాడు. ఇసుకను.. అన్నంగా మార్చగల భక్తి గల స్త్రీ దొరికితే తనకు పాప విమోచన కలుగుతుందని తెలుసుకుంటాడు. అలాంటి అద్భుత శక్తి గల స్త్రీ ఎన్నికులాల్లో వెతికినా కనపడదు. చివరకు అతను మాదిగల వద్దకు వచ్చాడు. కన్నెగా వున్న అరుంధతిని కలుసు కుంటాడు. తన మనసులో ఉన్న మాటను ఆమెకు చెపుతాడు. దానికి అరుంధతి "నేను చేయగలను కానీ, నాది నీచ జన్మ. మేము వెలివేయబడ్డవాళ్లం" అంటుంది. ఆ బ్రహ్మణుడు సంతోషించి తక్కువ కులం అయినా తన కోరిక తీర్చమని వేడుకుంటాడు. ఆమె దానికి అంగీకరించి ఇసుకతో అన్నం వండుతుంది. దీనికి ఆశ్చర్య పోయిన బ్రహ్మణుడు అరుంధతిని పెళ్లాడితే తనకు పాప విమోచన కలుగుతుందని భావించి తనను పెళ్లాడమని అభ్యర్ధిస్తాడు. ఇంతలో అరుంధతి సోదరుడు వచ్చి జరిగింది తెలుసుకుని కోపంతో బ్రహ్మాణున్ని, చెల్లెలను చంపుతానని బెదిరిస్తాడు. మాదిగలలో ఏ ఒక్కరూ వారిని దరిచేరనివ్వరు. అందరిది ఒకటే మాట. ఆ తరువాత అరుంధతి అకాశంలోకి వెళ్లిపోతుంది. వెళ్లిపోతూ ఇలా శపిస్తుంది. "మీరు అందరికి బానిసలు అవుదురు గాక, ఎంత శ్రమపడినా మీరు ఈ స్థితి నుండి పైకి రాకుందురు గాక" అని శపించిందని మాదిగలు నమ్ముతారు. అందుకే తరతరాల నుంచి దుర్భరమైన జీవన విధానం అనుభవిస్తున్నామని వారి విశ్వాసం.
గతంలో అస్పృశ్యులు అనే సంభోధనతో పిలువబడే దళితులు (మాల, మాదిగలు) సాంస్కృతిక, సామాజిక మార్పునకు లోనుకాక ముందు అంటరానివారిగా పిలవబడేవారు. వారు ఊరికి దూరంగా జీవనాన్ని గడిపేవారు. తెగనాయకుడి ఆధీనంలో ఉండేవాళ్ళు. వీరు శ్రమజీవులు. దొరికిన పనిని చేసి కడుపు నింపుకోవడమే వీరి ప్రధాన లక్ష్యం. చనిపోయిన పశువులను తోలు వలచడం, వాటి కళేబారాలను ఊరికి దూరంగా పడవేసి శుభ్రం చేయడం, వీరి ప్రధాన వృత్తి. పశువుల తోలును ఎండబెట్టి శుభ్రం చేసి వాటితో చెప్పులు కుట్టడం, డప్పు వంటి వాయిద్యాలు చేయడంలో వారు నేర్పరులు. బ్రిటీషు క్రైస్తవ మిషనరీలు ఆంధ్ర రాష్ట్రంలో వారి కార్యాకలాపాలు ప్రారంభించటానికి పూర్వం దళితులు హిందూ తెగగానే వున్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదలో మాలదాసరికథ వృత్తాంతం ఉంది. హిందూ గ్రామ దేవతలను, మహాలక్ష్మీ అమ్మవారు (మాలచ్చుమ్మ) దేవతలను పూజించేవారు.
1850 ప్రాంతంలో ఆంధ్రరాష్ట్రంలో సంభవించిక దుర్భరమైన కరువు కటాకాల నేపథ్యంలో తినడానికి తిండిలేక ఎంతో మంది దళితులు మృత్యువాత పడ్డారు. ఈ కాలంలోనే ఆంధ్రరాష్ట్రంలో ఉన్న మీషనరీలకు దళితులు దగ్గరైయ్యారు. ఎంతో మంది మాల,మాదిగలు క్రైస్తవ్యం స్వీకరించారు. క్రైస్తవ్యం స్వీకరించిన తరువాత దళితుల జీవనవి ధానంలో మార్పులను స్పష్టంగా గమనించవచ్చు.
దళితుల జీవన విధానం మిషనరీల ప్రభావం :
1850 తరువాత దళితులు క్రైస్తవ్యం స్వీకరించడంతో వారి జీవన విధానం భిన్నమైన మార్పులనకు లోనైయ్యాయి. అప్పటి వరకు నిరక్ష్యరాస్యులుగా వున్న దళితులు విద్యకు దగ్గరయ్యారు. మత మార్పిడిలో భాగంగా వారు ఇంగ్లీషు చదువులు చదువుకున్నారు. ఇతర గ్రంథాలు, కావ్యాలు, చదువుకున్నారు. దీంతో వారి జీవన విధానంలో గననీయమైన మార్పు కన్పిస్తుంది. భారత దేశంలో వచ్చిన సంఘ సంస్కరణ ఉద్యమం దళితుల సాంఘిక పరివర్తనపై అత్యంత ప్రభావం చూపింది. మహాత్మగాంధీ రాకతో దళితోద్ధరణ ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఇందులో ఎంతో మంది మేధావులు, ఇతర వర్గాల వారు పాలుపంచుకున్నారు.
దళితుల జీవన విధానంపై సాహిత్య ప్రభావం :
1910 తరువాత దళితుల స్థితిగతులు మార్పులు కన్పిస్తాయి. ఈ మార్పునకు తెలుగు సాహిత్యం ఎంతో దోహదం చేసింది. 1909లోనే ఆంధ్రభారతి పుస్తకంలో మాలవాండ్రం పాట అన్న గేయంలో అస్పశ్యత నిరసన కనిపిస్తుంది. 1910లో గురజాడ అప్పారావు రాసిన లవణరాజు కలలో అస్పశ్యత మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 1915లో నిరుద్ధ భారతం అనే పద్య కావ్యాన్ని ముంగిపూడి వెంకటశర్మగారు రాశారు. అస్పశ్యత నిరసనను పూర్తిగా కావ్యరూపంలో అందించిన తొలి కావ్యం ఇది. 1922లో ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన మాలపల్లి నవల అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. ఆ తరువాత 1930 నుంచి విద్యావంతులైన దళితులే తమ ఇతిబాధలను సాహిత్య రూపంలో ముందుకు తీసుకువస్తున్నారు. 1980 తరువాత తెలుగు సాహిత్యంలో దళిత ఉద్యమ కవిత్వం ప్రత్యేక శాఖగా రూపాంతరం చెందింది. సాహిత్యం దళితుల జీవనంలో ఎంతో మార్పు తీసుకువచ్చింది. ప్రస్తుతం నయా దళిత వాదం పేరుతో సాహిత్య ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
ముగింపు
తెలుగు సాహిత్య ప్రక్రియ దళితుల జీవన విధానంలో ఎంతో పరివర్తన తీసుకువచ్చింది. అసమానతలను ప్రశ్నించే తత్వాన్ని దళితులకు నేర్పింది సాహిత్యమే. వారి గడచిన జీవన విధానంలోని వివక్షతను విద్యాధికులు ప్రశ్నించి మార్పును ఆకాంక్షించారు. దీని ప్రభావంతో దళిత జాతి నాగరికత వైపు అడుగులు వేశారు. ఉన్నత చదువులు, భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, ఆధునిక సమాజంలో అందివస్తున్న అవకాశాలు, నాగరికతలో మార్పులు గమనిస్తూ దళితులు తమ జీవన విధానంలో ఎంతో పరివర్తన సాధించారు. దీనికి తెలుగు సాహిత్యం ఎంతో తోడ్పాటును ఇచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు. చరిత్ర కారుడు, ప్రముఖ పరిశోధకుడు నదీం హస్ నైన్ అన్నట్లు ప్రపంచం ఏకత వైపు ప్రయాణిస్తుంది. ఏదో ఒక రోజు జాతులు అంతరించి ఒకే జాతిగా భారత జాతిగా మార్పు చెందటం ఖాయం.
( జాతీయ సదస్సులో సమర్పించిన పరిశోధన పత్రం)
పరిశీలించిన పుస్తకాలు :
1. చెప్పులు కుడుతూ... కుడుతూ ఆంగ్లమూలం: ఎమ్మా రొషాంబు
తెలుగు: వివిన మూర్తి
2 మాదిగ తత్వం - ప్రొ॥ కంచ ఐలయ్య
3. దళిత కవిత్వం (వ్యాసం) - డా॥ శిఖామణి
4. భారతీయ గిరిజనులు: నదీం హసనైన్
- వి. పద్మ
యూజీసీ నెట్ , ఏపీ సెట్ ఇన్ తెలుగు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి