జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

ఇస్లాం వాదం ఎందుకు ?

తెలుగు సాహిత్యంలో ' ఇస్లాం వాదాన్ని ' బలంగా వినిపిస్తున్న ప్రముఖ కవి షేక్ కరీముల్లా. " ఈ దేశ కల్లోల సంద్రంలో కరీముల్లా కవిత్యం ఓ పోరాడే యుద్దనౌక " అన్నాడు శివసాగర్. కరీముల్లా కవిత్వం ఆసాంతం చదివిన తరువాత ఆయన అభ్యుదయ భావాలు మనకు పూర్తిగా అర్థమవుతాయి. అయితే, కొన్ని ప్రశ్నలకు మరింత లోతుగా సమాధానాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కరీముల్లా సైద్ధాంతిక పోరాటం ఎవరి మీద ? ఆయన కవిత్వం ఎవరి కోసం ? తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నప్పటికీ ' ఇస్లాం వాదం ' అవసరం ఎందుకు వచ్చింది ? దాని ప్రయాణం ఎటువైపు ? అంతిమ లక్ష్యం ఏమిటి ? అనే ప్రశ్నలు మన ముందుకు వస్తాయి. వీటన్నిటికీ సమాధానాలు కరీముల్లా నుంచి తెలుసుకోవడమే ఉత్తమం.

షేక్ కరీముల్లా

ప్ర: తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి కదా ! మళ్లీ ' ఇస్లాం వాదం 'ఎందుకు ? 

జ: దశాబ్దాల ముస్లింల వెనుకబాటుతనం, ఆవేదన, ఆగ్రహం ముస్లిం కవిత్వ రూపంలో ఉవ్వెత్తున వచ్చింది. ఏ సాహిత్య ఉద్యమమైనా ఆరంభంలో ధిక్కార స్వరంతో మొదలైనప్పటికీ క్రమేణా అది ఒక బలీయమైన సిద్ధాంత, తాత్వికత వైపునకు ప్రయాణించి తన స్థానాన్ని పదిలపరుచుకోవాలి. అభ్యుదయ, విప్లవ, దళిత, బహుజన ఉద్యమాలు ఇలానే బలపడ్డాయి. కానీ ముస్లిం సాహిత్యం దగ్గరకు వచ్చేసరికి ఇటువంటి ముందు చూపు లేదు. వ్యక్తులపై ఆధారపడే ఏ వాదమైనా శాశ్వతంగా నిలబడదు. అందుకే నేను ఇస్లాంను ముస్లిం సాహిత్య కారుల సైద్దాంతిక, తాత్విక రూపంగా ప్రకటిస్తూ తెలుగు సాహిత్యంలో ఇస్లాం వాదాన్ని ఆవిష్కరించాను. సోషలిస్టు, బహుజన, ప్రగతిశీల శక్తులతో కలిసి నడుస్తూ నిజమైన లౌకిక రాజ్యం కోసం కృషి చేస్తూ ముస్లింల పట్ల, ఇస్లాం పట్ల నెలకొన్న ఫోబియాను దూరం చేసే క్రమంలో ఇస్లాం వాదం నడుస్తుంది. ఇస్లాంవాదం అనగానే మత వాదం కాదు. ఇస్లాం మాత్రమే రాజ్యమేలాలి అనే సంకుచిత భావమూ కాదు. అన్ని మతాలూ, కులాలూ, సోదరభావంతో జీవిస్తూ సామాజిక, ఆర్థిక అసమానతలు, పీడనలు లేని సమాజాన్ని నిర్మించే క్రమంలో చైతన్యాన్ని ప్రోది చేసుకోవడమే ఇస్లాం వాద సాహిత్య లక్ష్యం.

ప్ర: మీ సాహిత్య ప్రయాణాన్ని వివరిస్తారా ? 

జ: విద్యార్థి దశలో వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకంగా ఉన్న నేను, అభ్యుదయ కవిగా మొదలైన నా ప్రయాణం బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ మారణకాండ అనంతరం మైనారిటీ కవిగా సాగి " సాయిబు " దీర్ఘ కవిత్వంతో ఇస్లాం వాద కవిగా నిలిచాను. ఈ ప్రయాణపు దారుల వెంట ఎన్నో నిద్రలేని రాత్రులు, ముళ్ళు, రాళ్ళు, అవమానాలు భరించాను. 2006లో ముస్లిం సాహిత్యకారులను సమైక్యం చేస్తూ ' ముస్లిం రచయితల సంఘం ' స్థాపించాను. ఇస్లాం వాద ఆవిష్కరణతో పాటు ' అబాబీలు ' అనే నూతన వచన కవితా ప్రక్రియ సృష్టించి సామాజిక, సాంస్కృతిక చైతన్యానికి నా వంతు కృషి చేస్తున్నాను. ఇప్పటి వరకు 22కు పైగా పుస్తకాలు రాశాను. అందులో పదిహేను పుస్తకాలు అచ్చయ్యాయి. ' సాయిబు ' దీర్ఘ కవిత ఆంగ్లంలో డాక్టర్ పి.రమేష్ నారాయణ చేత ' ఇండియన్ ముస్లిం 'గా అనువదించబడి పుస్తకంగా వచ్చింది. మరొక ప్రముఖ కన్నడ కవి ధనపాల నాగరాజప్ప నేను రాసిన ' బదర్ ' ను కన్నడంలో అనువదించారు. ఇంకా నా కవిత్వం ఉర్దూ, హిందీ, ఒరియా భాషల్లోకి అనువదించబడింది. అనేక యూనివర్సిటీలలో నా పుస్తకాలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. 

ప్ర: రకరకాల వాదాలు, ప్రక్రియల పేర్లతో సాహిత్యాన్ని విభజించుకుంటూ పోతే కవి పరిధి తగ్గిపోదా ?

జ: ఇది చాలా విలువైన ప్రశ్న. నిజానికి కవికి ఎల్లలు లేవు. కవి ఎప్పుడూ విశ్వమానవుడే. సాహిత్యం ఎప్పుడూ కేంద్రీకృతం కాదు. అనేక భావాల, సిద్ధాంతాల సమాహారం. సాహిత్యం విభజన చెందకూడదు అనే భావన నియంతృత్వానికి, మైనారిటీ భావాలపై మెజారిటీ భావాల పెత్తనానికి దారితీస్తుంది. కవిత్వాన్ని ఏ వాదానికి చెందినవారైనా రాయవచ్చు. విశాలమైన దృష్టికోణం ఉండాలి. పీడింపబడేవాడు నీవాడైనా, నావాడైనా, ఎవరైనా సరే తన వారే అనుకోవాలి. ఎందుకంటే పీడితుల పక్షం వహించే కవిత్వమే నిజమైన కవిత్వం అనేది నా నమ్మకం. ఈ తాత్విక దృష్టితోనే ఇస్లాం వాదం వచ్చింది. ఇస్లాం వాద కవులు తమదైన దృష్టి కోణం నుండి ఏ విషయం పైనైనా స్పందించగలరు. ముస్లింల గురించి మాత్రమే రాయాలనే సంకుచిత భావాలు ఏమి లేవు. ఇస్లాం వాద కవిత్వం కార్మిక, కర్షక, జెండర్, జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా చర్చిస్తుంది. ఇందులో కవి తన పరిధిని తగ్గించుకోవడం అనేది ఏముంది ? ఇక ప్రక్రియల విషయానికొస్తే కవి తనకు ఇష్టమైన ప్రక్రియను ఎంచుకుంటాడు. ఎవరి సౌలభ్యాన్ని బట్టి వాళ్ళు రాస్తారు. ' అబాబీలు ' అనే నూతన వచన కవితా ప్రక్రియ నా ' బదర్ 'అనే పుస్తకంలో ఆవిష్కరించబడ్డ సంగతి మీకు తెలిసిందే. తెలుగు సాహిత్యంలో నానీలు, రెక్కలు తదితర ప్రక్రియలు ఉన్నాయి. ఇస్లాం వాద కవినైన నేను ఇస్లామియా సామాజిక, సాంస్కృతిక నేపథ్యం నుంచి ఓ ప్రక్రియ ఆవిష్కరించాలనే తలంపుతోనే అబాబీలు  ఆవిష్కరించాను. ఇప్పుడు ఎంతో మంది ముస్లిం కవులు అబాబీలు రాస్తున్నారు. బదర్ కన్నడంలోకి ధనపాల నాగరాజప్ప అనువదించాక ఎంతో మంది కన్నడ కవులు అబాబీలు రాస్తున్నారు. ఇది సాహిత్యాన్ని మరింత విస్తృతం చేయడమే తప్ప పరిధిని తగ్గించడం కాదు. ఎప్పుడూ పండితులే కవిత్వం రాయాలా ? సామాన్యుడు సైతం తన అంతరంగాన్ని ఆవిష్కరించుకునే వెసలుబాటు అబాబీల ప్రక్రియ కల్పించింది. భవిష్యత్తులో ప్రతి ముస్లీం కవి అబాబీల కవి గానూ, ఇస్లాం వాద కవి గానూ మారతారు. ఇది నా నమ్మకం.

ప్ర: తెలుగు సాహిత్యంలో వస్తున్న మార్పుల గురించి చెప్తారా ?

జ: ఒకప్పుడు సాహిత్యం అనేది పండితులకు మాత్రమే సంబంధించిన విషయం. ఇప్పుడు అలా కాదు, అన్ని వర్గాలు అందిపుచ్చుకున్న ఆయుధం. ఆస్కార్ వైల్డ్ అన్నట్టు " ప్రతి రాత్రికో గుండె ఉంది. ఆ గుండెకో కోత ఉంది. ఆ గుండె కోతే కవిత్వం." ప్రియురాలు అందించే తమలపాకులు తింటూ జడలపై, వంపు సొంపులపై రాసే కవిత్వం మాసిపోయి ఇప్పుడు కవిత్వం ప్రజా కవిత్వంగా రూపు దాల్చింది. నేటి కవిత్వమంతా కార్మిక, కర్షక స్వేదం నుండి మొలచి అస్తిత్వ ఉద్యమాల ప్రభావంతో దోపిడి, కుల, మత అణిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ మత, ఫాసిజాల నుండి సామ్రాజ్యవాద దురాక్రమణల నుండి విముక్తి కోరుకునే పీడితుల పోరాట పతాకగా నిలిచింది. తెలుగు సాహిత్యంలో ఎన్నో ఉద్యమాలు వచ్చాయి. వ్యక్తులపై ఆధారపడ్డ ఉద్యమాలు గతించాయి. సిద్ధాంతం పునాదులపై నిలబడ్డ ఉద్యమాల నిలిచాయి. అయితే ప్రతి వాదం ఒక చైతన్యాన్ని నింపింది. అన్ని వాదాల చైతన్యాన్ని తనలో నింపుకున్న ఒక గంభీర సముద్రం ఇస్లాం వాదం. ఇస్లాం వాద ఆవిష్కరణ సామాన్యమైన విషయం కాదు. ఇది ఫాసిస్టు శక్తులకు, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ముస్లింల సాంస్కృతిక జీవనంపై దాడికి  వ్యతిరేకంగా పోరాడుతుంది. తెలుగు సాహిత్యంలో వచ్చిన ఆన్ని మార్పుల్లో కెల్లా ఈ మార్పు ప్రధానమైనది.

ప్ర: కవిగా మీ లక్ష్యం ఏమిటి?

జ: సామాజిక పరమార్థం లేని కవిత్వం, కవిత్వం కావచ్చునేమో కాని ప్రజా కవిత్వం కాజాలదు. పేదల, పీడితుల పక్షం వహించటమే నా కవిత్వ లక్ష్యం.  సమస్త శ్రామిక, పీడిత శక్తులను సమైక్య పర్చటం, ప్రజాస్వామిక ఉద్యమాల వైపు నడిపించటమే నా సాహిత్య లక్ష్యం. ఎటువంటి సామాజిక, ఆర్థిక అసమానతల్లేని వ్యవస్థను ముస్లింలు కోరుకుంటున్నారు. అలా కోరుకోవటం వారి ఇస్లామియా విశ్వాసంలో భాగమే. కనుకే ఇస్లాంవాద కవిగా నేను ఎప్పుడూ అభ్యుదయ, విప్లవ, బహుజన వాదాలను సమర్ధిస్తూ ముందుకు సాగుతాను. సమాజ హితాన్ని కోరుకునే అన్ని ప్రగతిశీల వాదాలు, సాహిత్య శిబిరాలు మాకు నేస్తాలే. ముస్లిం సమాజం సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉంది. ఈ సమాజంలో పుట్టి అంతో, ఇంతో చదువుకున్న, రాయగలిగిన మేము ఈ సమాజ క్షోభను ఆవిష్కరించే తీరాలి. లేకుంటే భవిష్యత్ తరాలు మమ్మల్ని క్షమించవు. దేశీయ ఫాసిజం, అంతర్జాతీయ సామ్రాజ్యవాదం తమ అధీనంలోని మీడియా ద్వారా ముస్లింలపై, ఇస్లాంపై అనేక అపోహలు వ్యాపింపజేశాయి. ఈ అపోహలను తొలిగించటం, సామరస్యాన్ని నిర్మించుకోవటం మా బాధ్యత. ఎవరేమైనా అనుకోనివ్వండి ఇస్లాం శాంతిని ప్రబోధించే ధర్మమని, ముస్లింలది శాంతియుత, ప్రేమపూర్వక జీవన విధానమని మేం చెప్పే తీరతాం. 

ఇంటర్వ్యూ : శిఖా సునీల్

( మౌలానా మౌదూది జీవన సాఫల్య పురస్కారాన్ని షేక్ కరీముల్లా ఈ నెల 27న అందుకోనున్న సందర్భంగా...)

-------------------------------------------------------------------------------

కరిముల్లా రచనలు :

1) వినుకొండ చరిత్ర (1999)

2) ఆయుధాలు మొలుస్తున్నాయ్ (2000)

3) గాయ సముద్రం (2000)

4) థూ...(ముస్లిం కవిత్వం) 2002

5) నా రక్తం కారుచౌక (ముస్లిం కవిత్వం) 2002

6) సాయిబు (తెలుగు మైనారిటీ సాహిత్యంలో ముస్లిం కవి రాసిన తొలి దీర్ఘకవితగా, ఇస్లాం వాద దీర్ఘకవితగా గుర్తింపు పొందిన పుస్తకం. ఈ పుస్తకంతో తెలుగు సాహిత్యంలో ఇస్లాం వాదం ఆవిష్క్రృతమైంది.)

7) ఖిబ్లా (ఇస్లాంవాద కవితా సంకలనం, సంపాదకత్వం) 2006

8) కవాతు (ఇస్లాంవాద కవితా సంకలనం, సంపాదకుడు) 2008

9) ఈద్ ముబారక్ (ప్రగతిశీల ముస్లిం కవిత్వం) 2008

10) కొలిమి (ఇస్లాంవాద వ్యాసాలు) 2009

11) నన్ను సాయిబును చేసింది వాళ్లే (ముస్లిం సామాజిక వ్యాసాలు) 2013

12) ఎదురు మతం (నవ్యాంధ్ర తొలి ముస్లిం కవితా సంపుటి) 2015

13) బదర్ ("అబాబీలు "అనే నూతన వచన కవితా ప్రక్రియ) 2019

14) ఇండియన్ ముస్లిం (సాయిబు దీర్ఘ కవిత ఆంగ్లాను వాదం, అనువాదం: డా.పి.రమేష్ నారాయణ) 2020

అముద్రితాలు :

1) ముస్లింలు-నిజాలు

2) కరీముల్లా కవిత్వం-సమీక్ష

3) ఇస్లాం వాదం-వాదోపవాదాలు

4) కరీముల్లా కవిత్వం-1999-2020

5) సామ్రాజ్యవాద సందర్భంలో 'సాయిబు'

6) మొహల్లా (ఇస్లాం వాద కథలు)

7) విద్యార్థీ నీ పయనమెటు?(నాటిక)

8) సుగంధాలు (గేయాలు)

పరిశోధనలు :

"షేక్ కరీముల్లా సమగ్ర సాహిత్యానుశీలన" అనే అంశంపై అందుగులపాటి శ్రీనివాసరావు నాగార్జున విశ్వవిద్యాలయంలో పిహెచ్ డి పూర్తి చేశారు.

గుర్రం జాషువా,పులుపుల శివయ్య, షేక్ కరీముల్లా (వినుకొండ కవిత్రయం) పేరుతో డా.వంకాయలపాటి రామకృష్ణ "ఆవిష్కర్తలు" అనే పరిశోధనాత్మక పుస్తకం వెలువరించారు.

డా.గుమ్మా సాంబశివరావు "కవాతు" పుస్తకం పై అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో పత్ర సమర్పణ చేసారు.

డా. సుహాసిని పాండే నా 'సాయిబు' దీర్ఘకవితపై అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో పత్ర  సమర్పణ

అవార్డులు :

1.జాతీయ కళాలయ అవార్డు ( పాలకొల్లు )2007

2. గుర్రం జాషువా కళా సాహితీ అవార్డు ( వినుకొండ )2012

3. నాగభైరవ కోటేశ్వరరావు స్ఫూర్తి అవార్డు ( నెల్లూరు )2013

4. అభినవ జాషువా అవార్డు ( బొల్లాపల్లి )2015

5. ఆదర్శ సాహిత్య రత్న అవార్డు ( గుంటూరు ) 2016

6. శ్రీ శ్రీ సాహిత్య అవార్డు (రాజమండ్రి )2016

పురస్కారాలు :

1. కళహంస సాహితీ పురస్కారం ( హైదరాబాద్ )2013

2. హసన్ ఫాతిమా సాహితీ పురస్కారం ( ఒంగోలు )2016

3. జాబిల్లి సాహితీ పురస్కారం ( హైదరాబాద్ )2017

4. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలుగు భాషా పురస్కారం (కడప)2017

5. అస్తిత్వం నేషనల్ పురస్కారం ( హైదరాబాద్ )2018

6. లఘురూప కవితా వేదిక పురస్కారం (హైదరాబాద్ )2019

7. శ్రీ గిడుగు రామమూర్తి సాహితీ పురస్కారం ( హైదరాబాద్ )2020

8. జనరంజక కవి ప్రతిభా పురస్కారం (గుంటూరు )2020

9. కవి సంధ్య సాహితీ పురస్కారం 2021

10. మౌలానా మౌదూదీ జీవన సాఫల్య పురస్కారం2022

కామెంట్‌లు

  1. తెలుగు సాహిత్యంలో ఇస్లాం వాదం పై స్పష్టత ఇచ్చారు.

    రిప్లయితొలగించండి
  2. మీ సాహిత్యంతో ఇస్లాం పై కారుమబ్బులను తొలగించడానికి ప్రయత్నించారు.

    రిప్లయితొలగించండి
  3. Common civil code ,paramathma సహనం,లౌకిక వాదం పాటించే ఇస్లాం వాదం వుండాలి..

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్