జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
వందేళ్ల పాటు బతికిన మా నాయన అమ్మ కొన్నేళ్ల క్రితం చనిపోయింది. మేమందరం చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని కూర్చోపెట్టుకుని చాలా ముచ్చట్లు చెప్పేది. ఆ పండు ముసలమ్మ చెప్పే ముచ్చట్లు బలే ఆసక్తిగా ఉండేవి. ముచ్చట్లతో పాటు అప్పుడప్పుడూ వాల్ల రోజుల్ని గుర్తుకు తెచ్చుకునేది. " మీరిప్పుడు కమ్మగా తింటున్నారు కానీ, ఆ రోజుల్లో కడుపు నింపడానికి ఎంత కష్ట పడే వాళ్ళమో తెలుసా.." అంటూ తడి ఆరిన ఆమె గాజు కళ్లతో గతాన్ని గుర్తు చేసుకునేది. " ఒక పూట తినాలంటే ఒక రోజంతా కష్ట పడాలి. మా పల్లెలో చాలా మంది తిండికి లేక నానా కష్టాలు పడే వాళ్ళు. కొంత మంది ఎంత కష్టపడే వాళ్ళంటే చిన్న పిల్లల్ని కూడా ఇంట్లోనే వదిలేసి, కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని, ఇరవై మైళ్ళ దూరం ఉన్న వినుకొండకి నడుచుకుంటూ వెళ్ళి ఏ అణాకో బేడాకో వాటిని అమ్ముకుని, అక్కడే తిండి గింజలు కొనుక్కొని, మళ్ళీ నడుచుకుంటూ వూరొచ్చి గంజి కాసుకొని తాగేవాళ్లు. బతకాలంటే రోజూ ఇదే పని. అసలు అదేముందీ మా అయ్యల, తాతయ్యల కాలంలో గొప్ప కరువు వచ్చిందంట. అప్పట్లో తిండి లేక చచ్చిన శావాలు పొలిమేరల్లో గుట్టలు గుట్టలుగా ఉండేవట. ఆకలికి తట్టుకోలేక ఆ కరువు రోజుల్లో మట్టి కూడా తిన్నారట..." ముసలామె చెబుతుంటే ఆమె గాజు కళ్ళలో గతం తాలూకు భయం కనిపించేది.
అసలు ఈ కరువు ఎప్పుడు వచ్చిందో తెలుసుకోవాలన్న ఆసక్తితో కొన్ని చరిత్ర పుస్తకాలు తిరగేశా. నేను వెతుకుతున్న, నాకు కావాల్సిన సమాచారం ఓ పుస్తకంలో కనిపించింది.
1890కి ముందు ఒంగోలు కేంద్రంగా నడిచిన మిషనరీలో జాన్ ఇ క్లౌ పనిచేశారు. అతని భార్య ఎమ్మా రోషాంబు క్లౌ. ఆమె గొప్ప పరిశోధకురాలు. రాయల్ ఏషియాటిక్ సొసైటీ సభ్యురాలు. ఆ రోజుల్లోనే స్త్రీల హక్కులు, సమస్యల గురించి పుస్తకాలు రాశారు. ఆమె రాసిన పుస్తకంలో " ఒక గొప్ప సంక్షోభం " అంటూ 1876- 78 మధ్య సంభవించిన కరువు పరిస్థితులను ప్రస్తావించారు. ఈ కరువు పరిస్థితులను చదివినప్పుడు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. బ్రిటిష్ కాలంలో సంభవించిన అతి పెద్ద కరువు ఇది. దక్షిణ భారత దేశం అంతటా తీవ్ర విషాదాన్ని నింపిన రోజులు అవి. ఈ కరువును ' మద్రాసు కరువు ' అని కూడా అంటారు. ఆకలి దప్పులతో అలమటించి అల్లాడిన ఈ కరువు కాలంలో సుమారు కోటి మంది చనిపోయి ఉంటారని అప్పటి అంచనా. అత్యంత దుర్భరమైన ఈ కరువు పరిస్థితులను గుర్తు చేస్తూ క్లౌ ఏమన్నారంటే " రక్త దాహంతో నిరంతరంమూ భూమి మీదకు చూసే భూతాల గురించి ఎవ్వరూ ఆలోచించ లేనంతగా ఉన్నాయి ఆ గడ్డు రోజులు. తిండి కోసం భూతాలన్ని కలిసి కట్టుగా భూమ్మీద బ్రతికి ఉన్న అన్నింటినీ చంపేయడానికి గుమికూడితే ఎవరు ఆపగలరు ? వాటన్నింటినీ ఎవరు శాంతింప చేస్తారు ? " అంటూ ఆ నాటి దుర్భర భయానక పరిస్థితులను ఆమె వివరించారు.
ఎటు చూసినా శవాల గుట్టలు. రోడ్ల మీద పడి చనిపోయిన వారి ఎముకలు రోడ్లకి అటూ ఇటూ ఉండేవి. " మేమందరం చచ్చిపోతున్నాం... " అన్నది అప్పటి జనాల చివరి మాటగా ఉండేది. ఇంతటి తీవ్ర సంక్షోభంలో కొంతైనా బయట పడేసేందుకు ప్రజలకు తిండిగింజలు అందించేందుకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఇప్పటి పనికి ఆహార పథకం లానే బకింగ్ హాం కాలువ నిర్మాణ పనులు చేపట్టింది. మద్రాసు నుంచి విజయవాడ వరకూ ఈ కాలువ నిర్మాణం ద్వారా కొంతైనా సహాయ చర్యలు చేయాలని భావించింది. ఇందులో మూడు కిలోమీటర్లు కాలువ పనులు అప్పటి ఒంగోలు మిషనరీ కాంట్రాక్టు తీసుకుంది. ఈ పని ద్వారా అప్పటి జనాలకు కొంతైనా ఆహారం దొరుకుతుంది. ఈ పని కోసం ఒంగోలు, గుంటూరు, ప్రకాశం ప్రాంతాల నుంచి వేలాదిగా జనం చేరుకున్నారు. అప్పటికే వాళ్ళందరూ బక్కచిక్కి పోయారు. ఆకలితో అల్లాడిపోతున్న వారికి శిబిరాల్లో అన్నం దొరికింది. అప్పటి వరకూ అన్నం కోసం అల్లాడిన వాళ్ళందరూ ఒక్కసారిగా అన్నాన్ని చూసి తట్టుకలేకపోయారు. ఆకలితో ఎంత తిన్నారో, తింటున్నారో అర్థం కాక తిని చనిపోయిన వారు ఎందరో ఉన్నారని క్లౌ రాసిన పుస్తకంలో కనిపిస్తుంది. ఆ పుస్తకాన్ని చదివిన తరవాత కరువు ఎంత దారుణమైనదో అర్థమవుతుంది.
దీని కన్నా ముందు మరొక కరువు వచ్చింది.1832 - 33లో గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఘోరమైన కరువు సంభవించింది. ఈ కరువును గుంటూరు కరువు, డొక్కల కరువుగా పిలిచారు. క్లౌ రాసిన పుస్తకంలో గుంటూరు కరువు ప్రస్తావన ఉంది. " ముసలి వాళ్లు ఒక కరువుని గుర్తు చేసుకునే వారు. బహుశా అందులో అసాధారణమైన భయానక దృశ్యాలు ఉండి ఉండవచ్చు. ఈ కరువులో మనుషులు మనుషులను తినేవారు అని అందరూ అనేవారు. నా కది నమ్మబుద్ధి అయ్యేది కాదు " అంటూ క్లౌ చెప్పారు. అప్పట్లో గుంటూరు ప్రాంతంలో ఐదు లక్షల మంది జనాభా ఉంటే గుంటూరు కరువు ధాటికి రెండు లక్షల మంది, అంటే సుమారు సగానికి సగం జనాభా తుడిచి పెట్టుకుపోయారని అనుకునే వారు. ఈ కరువు ప్రభావం ఇరవై సంవత్సరాల వరకు కొనసాగిందని చెబుతారు. ఇలాంటి దుర్భరమైన కరువుల గురించి చదివిన తర్వాత మనం ఇప్పుడు ఎంత సుఖంగా ఉన్నాం, ఎంత హాయిగా తింటున్నాం అనిపించింది. 1832లో గుంటూరు కరువులో మనుషుల్ని మనుషులే తిన్నారేమో అన్నంత ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయి. 1878లో ఆకులు, అలములు, చివరికి మట్టి కూడా తిని జనాలు బతికారు. 1920లో మా నాయన అమ్మ కాలంలో ఒక పూట తినటానికి రోజంతా కష్టపడ్డారు. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 53 దేశాల్లో 11.30 కోట్ల మంది నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రస్తుతం 82.10 కోట్ల మంది జనాలు సమతుల ఆహారం లేక బాధపడుతున్నారు. ఇదంతా తెలుసుకున్న తర్వాత నేనెప్పుడూ విందు భోజనంలో ఒక్క మెతుకూ మిగల్చలేదు. మితాహారం ఆరోగ్యానికి మంచిదే అన్న భావనకు వచ్చాను.
- శిఖా సునీల్
( ఎమ్మా రోషాంబు క్లౌ రాసి తెలుగులో వివిన మూర్తి అనువదించిన ' చెప్పులు కుడుతూ కుడుతూ ' పుస్తకం ఆధారంగా.. )
Sir ,మా అమ్మమ్మ గారు , కరువు గురించి వాళ్ళు పడిన కష్టాలు గురించి చెబుతుంటే విన్నాను, కానీ మీరు రాసిన "గుంటూరు కరువు" గురించి చదువుతున్నప్పుడు నా మనస్సు బరువు ఎక్కి కళ్ళలో నుండి నీళ్ళు ఆగాలేదు sir ,ఆకలి ,అన్నం విలువ తెలియని ఎంతో మంది ఉన్నారు . ఇటువంటి వి రాయటం ద్వారా కొంత మంది అయినా మారుతారు . thank you sir
రిప్లయితొలగించండిధన్యవాదాలు సార్ చాలా చక్కగా వివరించారు ఆనాటి పరిస్థితుల గురించి ప్రజలు ఆహారం దొరకక పడిన బాధలు తలుచుకుంటే నా చిన్ననాటి రోజులు ఆహారం కోసం నేను పడిన బాధలు గుర్తుకు వచ్చాయి ఇలాంటి సమాచారం ద్వారా ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్
రిప్లయితొలగించండి