జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
కొన్ని జరిగిన సంఘటనలు వినటమే కానీ చూసే అవకాశం ఉండదు. 1990 - 2000 సంవత్సరాల మధ్య విప్లవ పోరాటాల నేపథ్యం ఉన్న సంఘటనలు చాలా ఆసక్తిగా ఉంటాయి. విప్లవకారుల చర్యలు దినపత్రికల్లో చదివినప్పుడు, టీవీల్లో చూసినప్పుడు ఉత్కంఠగా, ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటాయి. అలాంటి యధార్థ సంఘటనల నేపథ్యాన్ని కథగా తీసుకుని తెరకెక్కిన సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతూనే ఉంటాయి. విప్లవ పోరాట నేపథ్యాన్ని చూపించే సినిమాల్లా కాకుండా, కేవలం ఒక్కరోజులో, ఇరవై గంటల వ్యవధిలో జరిగిన సంఘటన యధావిధిగా తెర మీద చూపిస్తే చాలా బాగుంటుంది. 1996లో కేరళలో ఇలాంటి ఓ సంఘటన జరిగింది. ఈ సంఘటన అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్నే కాకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. దీనికి సంబంధించిన పోరాట నేపథ్యం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ ఆ పోరాటం మొత్తాన్నీ ప్రతిబింబించే సంఘటన ఒక్క రోజులో జరిగింది. దీన్నే కథాంశంగా తీసుకుని మలయాళ దర్శకుడు కమల్ కె.ఎం.' పద ' సినిమాను తెరకెక్కించాడు. గత మార్చి10న విడుదలైన ఈ సినిమా కేవలం రోజుల వ్యవధిలోనే తప్పక చూడాల్సిన సినిమాల జాబితాలో చేరిపోయింది.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో 1996లో జరిగిన యధార్థ సంఘటన ' పద ' సినిమా. కేరళ రాష్ట్రంలో ఆదివాసీల సంఖ్య కేవలం ఒక్క శాతంలోపే ఉంటుంది. వీరంతా అడవిని, భూమిని నమ్ముకుని జీవించే వారే. అలాంటి అమాయక గిరిజనుల జీవనోపాధిని దెబ్బ కొట్టే ఆదివాసీ భూ చట్టాన్ని 1976లో అప్పటి కేరళ ప్రభుత్వం చేసింది. నాటి నుంచీ ఆదివాసీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రకరకాల ఉద్యమాలు, నిరసనలు చేశారు. వీటిని ఏమీ పరిగణలోకి తీసుకోకుండా, నిరసన కారుల డిమాండ్లను పట్టించుకోకుండా కేరళ ప్రభుత్వం 1996లో ఆదివాసీ భూ చట్టానికి సవరణ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదింప చేస్తుంది. ఈ చట్టం ద్వారా ఆదివాసుల జీవనోపాధి అగమ్యగోచరంగా మారుతుంది. భూమిని, అడవిని వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో కొంత మంది అభ్యుదయవాదులు, నిరసనకారులు నిర్ణయించుకుంటారు. వీరిలో బాలు, అరవింద్, రాజేష్, కుట్టి అనే నలుగురు గిరిజన ఉద్యమకారులు ఒక టీమ్ గా ఏర్పడి తమ నిరసనను తక్షణం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఓ పథకం సిద్ధం చేస్తారు. వీరి పథకంలో భాగంగా పాలక్కాడ్ జిల్లా కలెక్టర్ ను తమ అదుపులోకి తీసుకుని నిర్భందిస్తే వెంటనే మీడియా దృష్టి ఆకర్షించి తమ సమస్య ప్రభుత్వానికి చేరుతుందని తద్వారా పరిష్కారం లభిస్తుందని భావిస్తారు. వీరి ప్లాన్ లో భాగంగా ఓ తుపాకీని కొనుగోలు చేస్తారు. కొన్ని బాంబులు సిద్ధం చేసుకుంటారు. వీటన్నిటితో కలెక్టరేట్లోకి ప్రవేశిస్తారు. ఇక్కడ నుంచే సినిమా ప్రారంభమవుతుంది..
కేవలం ఒక్క రోజులో జరిగిన కథాంశాన్ని డైరెక్టర్ కమల్ కె.ఎం. అద్భుతంగా రెండు గంటల పది నిమిషాల సినిమాగా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభమైన తరువాత సుమారు గంటసేపు ఉత్కంఠగా సాగుతుంది. మొదటిసారి సంచలనాన్ని చేయాలనుకునే వ్యక్తుల ఫీలింగ్స్ ఈ సినిమాలో అత్యద్భుతంగా చూపించారు. బాలు (వినాయకన్), అరవిందన్ (జోజు జార్జి), రాజేష్ (కుంచాకో బోజన్), కుట్టి (దిలీప్ పోతన్) నటన సహజత్వం ఉట్టి పడుతుంది. నిమిష నిమిషానికీ ఆ తర్వాత ఏం జరుగుతుందా అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు. ఈ సినిమాలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ప్రకాష్ రాజ్ నటించారు. సమీర్ తాహిర్ ఫోటోగ్రఫీ, షాన్ మహ్మద్ ఎడిటింగ్, విష్ణు విజయ్ సంగీతం అద్భుతం. నిజ జీవిత సంఘటనలు చూడాల్సిన అవసరం ఉంది. విప్లవోద్యమ నేపథ్యం ఉన్న నిజ జీవిత సంఘటనలు అస్సలు మిస్ కాకూడదు.
- శిఖా సునీల్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి