జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

సంస్కర్త బసవేశ్వరుడు

కుల రహిత సమాజ నిర్మాణానికి జీవితాన్ని వెచ్చించిన కన్నడ మహనీయుడు బసవేశ్వరుడు. 890 ఏళ్ల  క్రితమే నాటి సమాజంలో వర్ణాంతర వివాహం జరిపించి సంచలనం సృష్టించిన అభ్యుదయవాది బసవేశ్వరుడు. " కుల సంకరము సేయగూడునే..." అంటూ నిలదీసి ప్రశ్నించిన బిజ్జల మహారాజుకి " మొన్న బుట్టిన కులమ్ముల మాటలేలా..." అంటూ కులం గురించి మాట్లాడటమే సరైనది కాదని సూటిగా సమాధానం చెప్పిన ధీరుడు బసవడు. జ్ఞాన హీనమైన భక్తి అంధము, భక్తి హీనమైన జ్ఞానము వంధ్యము అన్నట్లు జ్ఞానము, భక్తీ కలిసి ఉన్న చోటే పరిపూర్ణత వుంటుంది. బసవేశ్వరుడు కూడా మహాజ్ఞాని. అంతకు మించిన ' కూడల సంగమ ' వీర భక్తుడు. భక్తిని ఉద్యమంగా చేపట్టిన మేధావి. సమసమాజ నిర్మాణానికి జ్ఞాన మొక్కటే సరిపోదని, అత్మశుద్ది కలిగిన భక్తి కూడా కావాలంటూ నూతన సిద్దాంతాన్ని ప్రతిపాదించిన వీర శైవ భక్తుడు. సమానత్వం, సోషలిజం సిద్దాంతాలు కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ తరువాత ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ పన్నెండవ శతాబ్దంలోనే సమానత్వ భావాలను ద్రవిడ ప్రాంతంలో ప్రచారం చేసిన సంఘసంస్కర్త బసవేశ్వరుడు.

బౌద్ధ, జైన మతాల క్షీణత తర్వాత పన్నెండవ శతాబ్దంలో బ్రాహ్మణ ఆధిక్యత, కర్మకాండల ప్రాభల్యం పెరిగిపోయింది. ఈ సమయంలోనే బసవేశ్వరుడు అభ్యుదయవాదిగా, జ్ఞానిగా సమాజ పునర్నిర్మాణానికి పూనుకున్నాడు. చిన్ననాడే బసవేశ్వరుడు కర్మకాండలను వ్యతిరేకించి ఉపనయనం నిరాకరించాడు. దైవాన్ని నమ్ముతూ, మనిషిని ప్రేమిస్తూ మానవత్వాన్ని పెంపొందించుకున్నాడు. కుల, మత, వర్గ, రహిత సమాజాన్ని ఆకాంక్షించాడు. స్త్రీ, పురుష సమానత్వాన్ని ఆ నాటి రోజుల్లోనే కోరుకున్న సంఘసంస్కర్త బసవేశ్వరుడు. అప్పటికే క్షీణదశలో ఉన్న శైవమతాన్ని పునర్నిర్మించడానికి నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఓ పక్క బిజ్జల మహారాజు కొలువులో భాండారి ఉద్యోగం చేస్తూనే సమసమాజ స్థాపనకు పూనుకున్నాడు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితం మొత్తం వెచ్చించాడు.

బసవేశ్వరుడు ప్రతిపాదించిన నూతన ధర్మం ' వీరశైవం '. ఇది కొద్ది కాలంలోనే భక్తి ఉద్యమ రూపాన్ని సంతరించుకుంది. ఆ నాటికి క్షీణదశలో ఉన్న శైవ మతం బసవేశ్వరుడి బోధనలతో పునరుజ్జీవం పొందింది. నాటి పరిస్థితుల్లో వీరశైవ ధర్మం విప్లవాత్మక సిద్దాంతాలు ప్రతిపాదించింది. కుల, మత, వర్గ ప్రస్తావన లేదు. స్త్రీ, పురుష భేదం లేదు. దేహమే దేవాలయమని ప్రతిపాదించిన నూతన సిద్ధాంతం. పరిపూర్ణ భక్తితో మనిషిని ప్రేమించటం అనే మానవతావాదం వీరశైవంలో కనిపిస్తుంది. తనను తాను ఉద్దరించడంతో పాటు సంఘాన్ని ఉద్ధరించాలని వీర శైవం చెబుతుంది. దీనితో పాటు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నిరసించడం, శివభక్తి పథ ఆధిక్యతను చాటి చెప్పటం వీరశైవం ఉద్దేశం. బసవేశ్వరుడి పట్టుదలతో వీర శైవ సిద్ధాంతం భక్తి ఉద్యమంగా తదనంతరం సామాజిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. బసవేశ్వరుడి చొరవతో అణగారిన వర్గాల ప్రజలను నాటి సమాజం గౌరవ ప్రదంగా చూశారు. బసవేశ్వరుడు ప్రతిపాదించిన సిద్ధాంతాల ఆచరణ కోసం భక్తి ఉద్యమాన్ని మరింత విస్తృత పరచడానికి  బసవేశ్వరుడు 1160లో ' అనుభవ మండపం ' నిర్మించాడు. అప్పట్లో ఇది ఓ విప్లవాత్మక ఆలోచన. వీరశైవ సిద్ధాంతాన్ని నమ్మి ఆచరించే భక్తి ఉద్యమకారులు అనుభవ మంటపంలో కలుసుకుంటారు. ఇక్కడ కుల, వర్ణ, వర్గ ప్రసక్తి ఉండదు. ధనిక, పేద తారతమ్యం ఉండదు. స్త్రీ, పురుష భేదం ఉండదు. ఎవరైనా సరే సమానమే. సామ్యవాద భావజాలం అప్పట్లోనే పురుడు పోసుకున్న ఈ అనుభవ మండపంలో నూతన భక్తి మార్గంలో నడిచే ప్రతి ఒక్కరూ తమ అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. బసవేశ్వరుడు సాహిత్య, సంగీతకారుడు. ఆయన రాసిన భక్తి గీతాలు నాలుగు లక్షలకు పైగా ఉన్నాయని సాహిత్య కారుల అంచనా. వీటికి ' వచనాలు ' అని పేరు. " కూడలి సంగమ దేవరా! " అనే మకుటంతో ఈ వచనాలు రాశాడు. బసవేశ్వరుడి బాటలోఎంతో మంది సామాన్యులు కూడా అనుభవ మండపంలో భక్తి గీతాలు రచించారు. ఇవి కన్నడ సాహిత్యంలో వచన కవిత్వానికి బాటలు వేశాయి.

చారిత్రక ఆధారాల ప్రకారం బసవేశ్వరుడి (1134-96) జన్మస్థలం కర్ణాటకలోని హింగులేశ్వర బాగెవాడ. తల్లిదండ్రులు మండిగ మాదిరాజు, మాదాంబ. కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జలుని కొలువులో బాండారిగా, ప్రధనామాత్యునిగా ఉద్యోగం చేసాడు. బసవేశ్వరుడు బోధించిన సాంప్రదాయం అనంతర కాలంలో ' లింగాయత ధర్మంగా ' స్థిరపడింది. బసవేశ్వరుడు ప్రతిపాదించిన సిద్దాంతాలు నిచ్చెన మెట్ల వర్ణాశ్రమ వ్యవస్థను వ్యతిరేకించడంలో ప్రధానమైనవి.

 - శిఖా సునీల్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్