
ఆదివారం వచ్చిందంటే చాలు లైబ్రరీకి పరిగెత్తే వాళ్ళం. ఎనిమిదో తరగతిలో మా నాన్న చేయి పట్టుకుని మొదటిసారి లైబ్రరీకి వెళ్లినట్టు గుర్తు. ఆ ఒక్కసారే. ఆ మర్నాటి ఆదివారానికల్లా ఒంటరిగా వెళ్లడం అలవాటయ్యింది. నాతో పాటూ మా అన్నయ్య, మా ఫ్రెండ్స్ అందరం లైబ్రరీని ఇష్టపడే వాళ్ళం. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల కల్లా మా ఊరు పెద్ద బజారు సందులో ఉన్న లైబ్రరీకి ఎవరు ముందు వెళ్తారా అని పరుగులు తీసే వాళ్లం. లైబ్రరీ వాతావరణం బలే ఉండేది. చిన్నదైనా ముచ్చటగా ఉండేది. ముఖ ద్వారం దగ్గర లైబ్రరీ తాత రాజులా కూర్చుని కనిపించేవాడు. లైబ్రరీ అంటెండర్ అయిన ఆయన్ని అందరూ లైబ్రరీ తాత అనేవాళ్ళు. ఆయన ఎప్పుడు ఉద్యోగంలో చేరాడో తెలీదు కానీ, తాతగా మారినప్పుడే ఆ లైబ్రరీకి అందం చేకూరినట్లు ఉండేది. లైబ్రరీ వరండాలో పెద్ద పెద్ద టేకు బల్లలూ, కుర్చీలు ఉండేవి. లైబ్రరీ తాత పక్కనే మమ్మల్ని హెచ్చరిస్తున్నట్లు నిశ్శబ్దం అన్న బోర్డు కత్తిలా వేలాడుతూ కనిపించేది. మా లాంటి పిల్లలు కాస్త కిక్కురుమన్నా ఉరుము ఉరిమినట్లు లైబ్రరీ తాత కళ్ళతోనే మమ్మల్ని హెచ్చరించే వాడు. ఆ లైబ్రరీలో ' పిన్ డ్రాప్ సైలెంట్ ' అన్న పదం నూటికి నూరుపాళ్లు నెరవేరుతుంది. వరండాలో ఉన్న పెద్ద చెక్క బల్లలపై ఓ వైపు దినపత్రికలు, మరోవైపు వారపత్రికలు, పిల్లల కథల పుస్తకాలు ఉండేవి. వరండా దాటుకొని లోపలికి వెళితే గర్భగుడి లాంటి పెద్ద గది వుండేది. అక్కడ పెద్ద పెద్ద పుస్తకాలతో పుస్తక భాండాగారం ఉండేది. మాకు ఆ గర్భగుడిలోకి వెళ్ళే అవసరం ఎప్పుడూ ఉండేది కాదు. కానీ, అప్పుడప్పుడూ ఆసక్తిగా లోపలికి తొంగి చూసేవాళ్ళం.

ఇక, ఆదివారం ఎనిమిది గంటలకల్లా ఎవరు ముందు వెళ్ళినా వారి చేతికి అద్భుతమైన ప్రతిఫలం దక్కేది. అదే చందమామ కథల పుస్తకం. అసలు, మేమంతా లైబ్రరీకి వెళ్ళేదే చందమామ కథల పుస్తకం కోసం. మిగతా దినపత్రికలు, వారపత్రికలు వీటి గురించి మాకు పట్టేవి కావు. ఇతర పుస్తకాల గురించీ తెలీదు. అటువైపు కన్నెత్తి కూడా చూసే వాళ్ళం కాదు. కానీ, దురదృష్టం ఏంటంటే లైబ్రరీ మొత్తానికీ చందమామ ఒక్క కాపీనే వచ్చేది. అంటే ముందు వచ్చిన వాళ్లకు మాత్రమే అది దక్కేది. మిగతా పిల్లలందరూ ఆ చందమామని చేజిక్కించుకున్న వాడివైపు అసూయగా చూసేవాళ్లు. వాడు ఎప్పుడు చదివి పూర్తి చేస్తాడా, ఎప్పుడు దక్కించుకుందామా అనుకొంటూ ఆతృతగా ఎదురు చూసేవాళ్లు. ముందుగానే " నీ తరువాత నాకు ఇవ్వవూ..." అంటూ చందమామను రిజర్వ్ చేసుకునే వాళ్ళం. అలా ఒకరి తరువాత ఒకరు కనీసం ముగ్గురు లేదా నలుగురు రిజర్వ్ చేసుకునేవాళ్లు. ఈ రిజర్వేషన్లో పిల్లలతో పాటూ ఒకరిద్దరు పెద్దలు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించేది. మా లైబ్రరీ ఉదయం 11 గంటల వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఒకరిద్దరికి మాత్రమే చందమామ చదివే ఛాన్స్ దక్కేది. మిగిలిన వాళ్ళంతా నిరుత్సాహంగా మళ్లీ సాయంత్రం నాలుగ్గంటలకు లైబ్రరీ తెరిచే దాకా లేదా వచ్చే ఆదివారం దాకా ఎదురు చూడాల్సిందే. నిశబ్దం అనే బోర్డ్ కింద కూర్చొనే లైబ్రరీ తాత ఎప్పుడూ మాట్లాడినట్టు మేం చూడలేదు. మేం ఊరికే కూర్చుంటే లైబ్రరీ తాత ఊరుకునే వాడు కాదు. కళ్ళతోనే మమ్మల్ని బెదిరించే వాడు. అందుకే ఇష్టం లేకపోయినా ఏదో ఒక వారపత్రిక అడ్డం పెట్టుకుని చదువుతున్నట్టు నటిస్తూ చందమామ కోసం ఎదురుచూసే వాళ్ళం. మా లాంటి పిల్లలే ఆ లైబ్రరీలో ఎక్కువ మంది ఉండేవారు.
వెయిటింగ్ లిస్ట్ తక్కువగా ఉండి మా చేతిలో చందమామ పడితే నిలువెల్లా వెలిగిపోయే వాళ్ళం. మిగిలిన పిల్లలు మాకేసి అసూయగా చూసేవాళ్లు. ఎందుకో చందమామ అంటే అంతిష్టం. చందమామ చేతిలో పడ్డ మరుక్షణమే జానపద లోక యాత్రకు బయలుదేరే వాళ్ళం. ఆ కథల్లో లీనమై పోయేవాళ్ళం. కర్పూర దేశాన్ని పాలించే ఇంద్రసేనుడు, చంపకదేశం, మహీపాలుడు, కోసల దేశాన్ని ఏలిన ప్రచండుడు, విజయ కేతుడు, శ్రీశుకుడు, కాంభోజ వర్మ, శిఖ ముఖి, విక్రమ కేసరి, ధూపకుడు, ఖడ్గ వర్మ వంటి క్యారక్టర్లు, రాకాసి లోయ, ముగ్గురు మాంత్రికులు, వరహాల దానం, మంత్రి నీతి, వల్లభుడి జట్టు, మంత్ర గ్రంధం, పిల్ల పిచాచాలు.. వంటి కథలు మమ్మల్ని మరో లోకానికి తీసుకెళ్లేవి.
చందమామ అంటే ఎందుకో అంత ఇష్టంగా ఉండేది. ఆ ఇష్టం ఇప్పటికీ పోలేదు. చందమామలో టీవీ రాఘవన్ (చిత్ర), శంకర్, ఎంటీవీ ఆచార్య, వడ్డాది పాపయ్య, బాపు వేసిన చిత్రాలు అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడు చూసినా మనసంతా హాయిగా ఉంటుంది. బి.నాగిరెడ్డి, చక్రపాణి మదిలో చందమామ పుట్టింది. వెనువెంటనే 1947లో కార్యరూపం దాల్చి ఆ ఏడాది జూలై మాసంలో చందమామ బాలల మాస పత్రిక తొలి సంచిక విడుదలైంది. కొడవటిగంటి కుటుంబరావు ఎడిటర్ గా భాద్యతలు స్వీకరించిన తరువాత చందమామ తిరుగులేని బాలల మాసపత్రికగా పిల్లలూ పెద్దలూ అన్న తేడా లేకుండా తెలుగు, తమిళ, మలయాళ ప్రజల మనసులు గెలిచింది. చక్కటి భాష, చిన్న చిన్న పదాల పొందిక, తెలుగు నుడికారాలు, సామెతలు, ఆకట్టుకునే శైలి, మరో లోకంలోకి తీసుకెల్లే కథా సాహిత్యం.. అసలు చందమామ కథల ఎంపికలోనే ఓ ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. భారతం, రామాయణం, భాగవతం, పంచతంత్రం, బేతాళ కథలు, కథాసరిత్సాగరం, అరేబియన్ నైట్స్ కథల సారం అక్కడక్కడా ఉన్నప్పటికి చందమామ కధల తీరే వేరు. మూఢనమ్మకాలు, దైవభక్తిని ప్రేరేపించే కథలకు చందమామలో ప్రాధాన్యత కనిపించదు. కొడవటిగంటి కుటుంబరావు అభ్యుదయ భావాలు కలిగిన గొప్ప రచయిత. " నాకు విశ్వాసం మనిషిలోనే కానీ, దేవుడులో కాదు.." అంటూ ఉంటారు ఆయన. అందుకే చందమామ కథలన్నీ మనిషిని గెలిపించే కథలుగానే ఉంటాయి. మానవత్వం, స్నేహ ధర్మం, ప్రేమతత్వం, భూతదయ, పట్టుదల, దయాగుణం, వీరత్వం, పోరాడే తత్వం.. ఇవన్నీ పెంపొందించే కథలకే చందమామలో ప్రాధాన్యత కనిపిస్తుంది.బాలల మానసిక వికాసానికి చందమామ కధలు ఎంతో ముఖ్యం. అందుకే బాలసాహిత్యం గురించి కొడవటిగంటి కుటుంబరావు రాస్తూ.. "బాలసాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావనలను బలంగా నాటాలి. ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలుచేస్తాయి...పిల్లలలో దౌర్బల్యాన్ని పెంపొందించేది మంచి బాలసాహిత్యం కాదు...దేవుడి మీద భక్తినీ, మతవిశ్వాసాలనూ ప్రచారం చెయ్యటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు...కథలో నెగ్గవలసినది మనుష్య యత్నమూ, మనిషి సద్బుద్ధీనూ". అన్నారు. ఆయన ఆలోచనలన్నీ చందమామ కథల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి. # # #
కాలం గిర్రున తిరిగింది. ఇంతింతై వటుడింతై అన్నట్టు మా ఊరు నాలుగు రెట్లు పెరిగింది. కొత్త కొత్త కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్లు ఎప్పుడూ వినని పేరుతో రకరకాల షాపులు గుళ్ళూ గోపురాలు వెలిశాయి. ఎటు చూసినా జనాలు. అప్పుడు నాలాగే ఇప్పుడు మా అమ్మాయి ఎనిమిదో తరగతి. మా నాన్న చేయి పట్టుకుని నన్ను లైబ్రరీకి తీసుకెళ్లినట్లు నేనూ మా అమ్మాయిని లైబ్రరీకి తీసుకువెళ్లాలని కోరిక. కానీ ఇప్పటి మా పెద్ద పట్టణంలో అప్పటి లైబ్రరీ లేదూ.. చందమామా లేదు..
- శిఖా సునీల్
నేను కూడా చందమామ అభిమానిని. పది రోజుల క్రితమే చందమామ చదివాను. మీరు చెప్పినట్టే ఆ కథలు చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిని చదువుతున్నప్పుడు మనసు చాలా పులకరించిపోతుంది. రాజుల కథలు చదివితే ఆ లోకానికి వెళ్ళి చూస్తున్నట్టుగా ఉండేది.
రిప్లయితొలగించండినా చిన్ననాటి రోజులు మళ్లీ గుర్తు చేశారు. చందమామ కథలన్నా, అందులోని పాత్రలు అన్నా నాకు బాగా ఇష్టం. చిన్నప్పుడు అమ్మమ్మ చందమామ కథలు చెప్పేది. ఆ కథలు విన్నప్పుడు మేము ఆ ప్రపంచంలో విహరించే వాళ్ళం. లైబ్రరీలో కూర్చొని చందమామ కథలు చదవడం అంటే చాలా ఇష్టం. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత లైబ్రరీకి వెళ్లే వాళ్ళు కనుమరుగైపోయారు. మీరు రాసిన కథనం నన్ను మరలా చందమామ కథలు చదవడానికి ప్రేరేపించింది.
రిప్లయితొలగించండిచాల సంవత్సరాల తరువాత వొక మంచి జ్ఞాపకం. లైబ్రేరీ వున్నంత కాలం వినుకొండ వొక కొండగానే వుంది ఇపుడు మోడువారి పెద్ద బండగా మారింది
రిప్లయితొలగించండి