జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

ది ప్రోఫెట్ ( The Prophet )

               " అర్ధం లేని అన్వేషణ చేయను " 

                   - ఖలీల్ జీబ్రాన్


ఖలీల్ జీబ్రాన్ గొప్ప తాత్వికుడు. లెబనాన్ దేశానికి చెందిన రచయిత. దానికన్నా ముందు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు. జీవితాన్ని అమితంగా ప్రేమించిన ఖలీల్ కేవలం 49 ఏళ్ల వరకే ఈ భూమిపై ఉన్నాడు. అయితేనేం, ప్రపంచానికి కావలసినంత తత్వాన్ని, కవిత్వాన్ని అందించాడు. ఖలీల్ క్రైస్తవ మతానికి చెందిన క్యాథలిక్. కానీ, తన 14వ ఏటనే " నేను ఎంతో కాలం క్యాథలిక్ గా ఉండబోను, నేను మత వ్యతిరేకినైపోతాను.." అని చెప్పాడు. మతాన్ని వ్యతిరేకించాడే కానీ మనిషిని ప్రేమించాడు. తానే ఓ ప్రవక్తలా మారి మానవత్వాన్ని బోధించాడు. కొన్నిసార్లు విషాదం, ఒంటరితనంలో నుంచి ప్రపంచాన్ని మార్చగలిగే ఆలోచనలు పుడతాయి. లోతైన ఆలోచనలే అన్నిటికన్నా శక్తివంతమైన ఆయుధాలు. ఆలోచనలో నుంచి పుట్టే అర్థవంతమైన సిద్ధాంతాలు ప్రపంచ గతిని కూడా మార్చగలవు. ఖలీల్ కూడా గొప్ప ఆలోచనాపరుడు. అత్యంత పేదరికం, వలస జీవితం కుటుంబంలో తల్లి, చెల్లి, అన్న చనిపోవడం, విషాదం, ఒంటరితనం ఖలీల్ తాత్విక చింతనకు ఓ కారణమైంది. చిన్న వయసులోనే చిత్రకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఖలీల్ ఆపై ప్రపంచ ప్రసిద్ధ రచయితల జాబితాలో చేరిపోయాడు.
ఖలీల్ జీబ్రాన్ రాసిన ' ది ప్రోఫెట్ ' చాలా ప్రభావవంతమైన చిన్న పుస్తకం. ఈ పుస్తకం ద్వారానే ఖలీల్ కు ప్రపంచవ్యాప్తంగా అత్యంత పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఆయన రాసిన పుస్తకాలన్నింటిలోనూ ది ప్రోఫెట్ మాస్టర్ పీస్. ఖలీల్ మొదట ఈ పుస్తకాన్ని అరబ్బీలో రాశాడు. ఆ తర్వాత 1923లో తానే స్వయంగా ఇంగ్లీష్ లో అనువదించాడు. ఇంగ్లీష్ లో అనువాదం పొందిన తరువాత ' ది ప్రోఫెట్ '  ప్రపంచ సాహిత్యంలో తిరుగులేని స్థానాన్ని పొందింది. 1960 నాటికే ఒక్క ఇంగ్లీష్ లోనే 20 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయి సంచలనం సృష్టించింది. ప్రపంచంలో దాదాపు అన్ని భాషల్లోకి ' ది ప్రోఫెట్ ' అనువాదం చేయబడింది. తెలుగులో మొదటిసారిగా కాళోజీ నారాయణరావు " జీవనగీత " అనే పేరుతో అనువదించాడు. ఆ తర్వాత ఇతర రచయితల చేతిలో ఐదు అనువాదాలు పొంది తెలుగు పుస్తక ప్రియులకు అందుబాటులో ఉంది.

ది ప్రోఫెట్ అంటే ప్రవక్త అని అర్థం. అన్నీ తెలిసిన జ్ఞానినే ప్రవక్త ఆంటారు. ది ప్రోఫెట్ లో ప్రవక్త గురించి ఖలీల్ ఇలా రాస్తాడు..

" మేం దేశదిమ్మరులం

ఒంటరి దారుల్లోనే

సదా సాగుతుంది మా ప్రయాణం

ఏ రోజు ఎక్కడ ముగిస్తామో

ఏ రోజు యెక్కడ ప్రారంభిస్తామో

ఏ సూర్యాస్తమయం

మమ్మల్ని యెక్కడికి చేర్చిందో 

ఏ సూర్యోదయానికి అంతు చిక్కదు.

విశేషం ఏమిటంటే-

భూమి నిదురించే వేళ కూడా

మేము ప్రయాణిస్తూనే ఉంటాం. "

ప్రపంచంలో ఎంతో గొప్ప ప్రవక్తలు ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. ఖలీల్ కూడా ది ప్రోఫెట్ లో ' అల్ ముస్తఫా ' ద్యారా మనందరితో ఎంతో తత్వాన్ని పంచుకున్నాడు. ఈ పుస్తక ఇతివృత్తాన్ని పరిశీలిస్తే... ' ఆర్ఫాలిస్ ' అనే పట్టణంలో ఒక గొప్ప ప్రవక్త ఉంటాడు. అతని పేరు అల్ ముస్తఫా. పన్నెండేళ్ళ పాటు అక్కడి ప్రజలతో కలిసి జీవిస్తాడు. ఓ రోజు ఆ పట్టణాన్ని వదలి అతను వెళ్ళాల్సిన సమయం ఆసన్నమవుతుంది. ఆ రోజు రానే వస్తుంది. బాధాతప్త హృదయంతో అతను ప్రయాణమవుతాడు. ఆ ప్రయాణం తప్పనిసరి. అది అనివార్యం. దీంతో అల్ ముస్తఫాను సాగనంపేందుకు ఊరు ఊరంతా కదలి వస్తుంది. అతను ఎక్కాల్సిన ఓడ వద్ద వీడ్కోలు సభ జరుగుతుంది. అక్కడ ప్రజలు సందేహాలకు అల్ ముస్తఫా సమాధానాలు ఇస్తాడు. ఈ సమాధానాలే ది ప్రోఫెట్ పుస్తక ఇతివృత్తం. ఈ పుస్తకం ఓ దీర్ఘ కవిత్వంలా కనిపిస్తుంది. ప్రవక్త అంతరంగంతో ప్రారంభమైన దీర్ఘ కవితలు ప్రవక్త వీడ్కోలుతో ముగుస్తుంది. ప్రజలు అడిగిన.. స్వేచ్ఛ, వివేకం, వేదన, ఆత్మజ్ఞానం, బోధన, స్నేహం, ప్రేమ, పెళ్లి, ఇవ్వడం, ఆనందం, విషాదం, మాట్లాడడం, కాలం, ప్రార్ధన, అందం, మతం... వంటి ప్రశ్నలకు అల్ ముస్తఫా జవాబు ఇస్తాడు. ఖలీల్ మనసు నుంచి పుట్టిన ఈ ప్రవచనాలు ప్రపంచ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఎంతో లోతైన అర్ధంతో, ఎంపిక చేసిన అక్షరాలను కూర్చి ఖలీల్ ఈ పుస్తకాన్ని రచించాడు. ఇంత గొప్ప తాత్విక భావాలని రచించిన ఖలీల్ ఒక చోట ఇలా అంటాడు..

" నేనేనా ప్రవచించినది..?

 నేను సైతం శ్రోతనే కదా..?? "


మన మెదళ్లనూ ఎన్నో ప్రశ్నలు తోలుస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాటికి సరైన సమాధానాలు దొరక్కపోవచ్చు. కానీ, The Prophet పుస్తకం మన సమస్యకు కొంత పరిష్కారాన్ని చూపిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

- శిఖా సునీల్


The Prophet లో కొన్ని..

1. 

" రంగు యెలా ఉందో మరచిపోయినా

తాగిన పాత్ర ముందు లేకపోయినా

సేవించిన మధువు రుచి మాత్రం గుర్తుండిపోయే విధంగా

హృదయ సాక్షిగా నీవు సత్యం వచిస్తే 

స్నేహితుని ఆత్మలో సదా నిలిచే ఉంటుంది "

2.

" ఎప్పుడైనా సరే, 

అడిగినప్పుడు దానం చేయడం వాంఛితం

అయితే, అడగకముందే అర్థంచేసుకుని 

ఇవ్వడమే ఉత్తమోత్తమం!

దానం తీసుకునేవాని కోసం

చేతులు సాచి అన్వేషించినప్పుడు

యెదురుపడితే యెంత ఆనందం! "

3.

" నుదిటి నుంచి చెమట కార్చినప్పుడే

నీ తలరాతకూడా మారి పోతుంది "


4.

" పని అంటే- 
 ప్రేమకు రూపం ఇవ్వడమే

ప్రేమతో కాకుండా విసుగుతో చేయడం కంటే -

ఆ పనిని విడిచిపెట్టి, 

ఏ గుడి ముంగిటనో కూర్చోని

ముష్టి యెత్తుకో ! "

5. 

" అమాయకునిలో పశ్చాత్తాపం కలిగించలేరు, 

నేరస్థుని మనసులోంచి అపరాధ
భావనను తొలగించనూ లేరు "

6.

" మీరు చేసిన

ఏ చిన్న పనినో లెక్కలోకి తీసుకుని

మిమ్మల్ని అంచనా కట్టడం

ఎలా ఉంటుందంటే-

ఒడ్డు దరిదాపులో

అలల తలలపై

తేలి ఆడుతూ కనిపించే

నురగను చూసి

సముద్రం శక్తిని లెక్కకట్టినట్లు అవుతుంది

 మీ వైఫల్యాలను బట్టి

తీర్పు చెప్పడం యెలా ఉంటుందంటే-

ఆగకుండా మారుతూ ఉండే

రుతువుల్ని చూసి చంచలమని

ఆక్షేపించినట్లుగా ఉంటుంది "

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్