జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

హార్సిలీ హిల్స్ లో..

" ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకీ ప్రాంతం ఎంతో విచిత్రంగా కనిపిస్తుంటుంది. ఈ ప్రకృతి సౌందర్యాన్ని తిలకించినప్పుడు, ఇక్కడి నిశబ్దం, శోభ గమనించినప్పుడు ఆశ్చర్యానందాలు కలుగుతూ ఉంటాయి. ఆ కనిపించే కొండల్ని చూస్తున్నప్పుడు, ఇక్కడి పక్షుల కిలకిలరావాలు, ఆ చెట్ల ఆకుల మధ్య గుండా వీచే గాలి, అటున్న చింత చెట్టు, చిగురించిన మామిడి చెట్టు, సూర్యోదయాన, సంధ్య వేళ ఆ పక్షుల కుహూరవాలు, నిర్మలమైన ఆకాశం, ఇప్పుడిప్పుడే పొడసూపుతున్న నక్షత్రాలు, ఆ పశ్చిమాన సూర్యాస్తమయం ఎంత అద్భుతంగా ఉన్నదో కదా..! వింత వింత రంగులు, చెట్ల ఆకుల మీద తేలియాడే ఆ కాంతి, ఈ నేల సౌందర్యం, అతి సుసంపన్నమైన ఈ భూమిని చూసారా.. "  అంటూ తూర్పు కనుమలలోని దక్షిణ భాగపు కొండల్లో ఉన్న రిషివ్యాలీ, హార్సిలీ హిల్స్ కొండలను చూసినప్పుడు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి పరవశించి పోయేవాడు. ఆయన తాత్విక చింతనకు ఇంతటి ప్రశాంతమైన వాతావరణం కూడా ఓ కారణమై ఉండవచ్చు. అంతటి అందమైన హార్సిలీ హిల్స్ పైకి మిట్టమధ్యాహ్నం మేము అడుగుపెట్టాం.

రోహిణి కార్తె ఎండలను కొండ కింద మదనపల్లెలోనే వదిలేసి చల్లటి వాతావరణంలోకి మా ప్రయాణం చేరింది. బస్సు దిగిన వెంటనే ఏపీ టూరిజం రిసెప్షన్ భవనం స్వాగతం పలికింది. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని మేము ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్న హరిత రిసార్ట్ కు వెళ్ళాము. ఏపుగా పెరిగిన చెట్ల నడుమ అందమైన చిన్న ఇంటిని రెండు రోజుల పాటు ఉండేందుకు మాకు అప్పగించారు. మా కొత్త ఇంటి చుట్టూ పచ్చటి ప్రకృతి, రంగు రంగుల పక్షుల అరుపులు మమ్మల్ని ఆహ్వానించాయి. మేము రెండురోజుల పాటు ఉండాల్సిన ఆ ఇంటి తలుపులు తీసిన వెంటనే  చల్లటి గాలి మమ్మల్ని తాకి మా ప్రయాణ బడలికని తనతో తీసుకెళ్ళి పోయింది. 1863లో డబ్ల్యు.డి.హార్సిలీ అనే బ్రిటిష్ అధికారి మదనపల్లె సబ్ కలెక్టర్ గా పనిచేశారు. ఓ రోజు దగ్గరలోని ఎత్తైన కొండల్లోకి ఆయన విహారానికి వెళ్ళాడు. ఆ ఎత్తైన కొండమీద చల్లటి వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రకృతి డబ్ల్యు.డి.హార్సిలీని బాగా ఆకర్షించాయి. ఆ ప్రాంతంలో విడిది చేయాలని 1863 లోనే ఫారెస్ట్ బంగ్లా పేరుతో అందమైన భవనాన్ని నిర్మించాడు. ఆ తరువాత కాలక్రమంలో ఈ ప్రాంతం హార్సిలీ హిల్స్ పేరుతో ఆంధ్రా ఊటీగా ప్రాచుర్యం పొందింది. ఈ అడవిలో గంధం చెట్లతో పాటు 150 ఏళ్ళ నాటి నీలగిరి చెట్లు కూడా కనిపిస్తాయి. రోళ్లు పగిలే రోహిణి కార్తె ఎండల్లో కూడా హార్సిలీ హిల్స్ లో గరిష్టంగా 32 డిగ్రీల టెంపరేచర్ మాత్రమే ఉండడం విశేషం. రాత్రిపూట కచ్చితంగా దుప్పటి కప్పుకుని పడుకోవాల్సిందే.

మా చిన్న లగేజీ బ్యాగును ఓ మూలన విసిరేసి, చల్లటి నీళ్లతో నిలువెల్లా స్నానం చేసి భోజనానికి బయల్దేరాం. దగ్గర్లోనే ఏపీ టూరిజం హోటల్ ఉంది. మేము అక్కడ ఉన్న రెండు రోజులూ ఏపీ టూరిజం హోటల్లోనే భోజనాన్ని తిన్నాం. కావాలనుకుంటే ప్రవేటు హోటల్స్ లో మనకు నచ్చిన వంటకాలు ఆర్డర్ ఇస్తే చేసిపెడతారాని తెలిసింది. హార్సిలీ హిల్స్ లో ఎక్కడికి  వెళ్ళాలనుకున్నా నడకదారే ఉత్తమం. ఏపుగా పెరిగిన యూకలిప్టస్, అడవి చెట్ల నీడన, దారులన్నీ పరచుకున్న పూల అందాలను చూస్తూ అలా నడుస్తూ ఉంటే సమయం, శ్రమ తెలిసే అవకాశమే ఉండదు.

హార్సిలీ హిల్స్ లో ఎక్కువ సమయం గడపాల్సింది సూర్యోదయాలు, సూర్యాస్తమయాలతోనే. ఇక్కడ కనిపించే అందమైన ఉదయాలు, సంధ్యా సమయాలు మరెక్కడా చూడలేం. ప్రకృతి ప్రేమికులు వీటి కోసమే ఎక్కడెక్కడి నుంచో హార్సిలీ హిల్స్ వస్తుంటారు. ఆ తూర్పు కనుమలపై నిలబడి, కనుచూపుమేరా కనిపించే కొండల నడుమ, నిశబ్దంగా కనుమరుగయ్యే అందమైన సూర్యున్ని చూస్తూ గడిపే సమయం మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం. అందుకేనేమో జిడ్డు కృష్ణమూర్తి ఆ తూర్పు కనుమల అందాలను చూసినప్పుడల్లా ఇలా అంటూ అంటాడు.. " ఈ కొండలోయ నేను చూసిన వాటిలోకెల్లా అతి సుందరమైనది. ఇక్కడ వీచే గాలి, మన చుట్టూ ఉండే వాతావరణం విలక్షణంగా ఉంటుంది, ముఖ్యంగా సంధ్యా సమయాన ప్రాతః కాలానా ఈ లోయను ఆవరించే ఈ నిశ్శబ్దాన్ని గమనించారా ? ఈ ప్రాంతంలోని పర్వతాలు అతి పురాతనమైనవి. ఏమైతేనేమి మనిషి వీటినింకా కలుషితం చేయలేదు."

మొదటిరోజు సాయంత్రం మొత్తం సూర్యాస్తమయంతోనే గడిపేసాం. ఆ మర్నాడు తెలతెలవారుతుండగా మా ప్రయాణం సూర్యోదయంతో ప్రారంభమైంది. ఆ తరువాత హార్సిలీ హిల్స్ జూ పార్కు, పురాతనమైన నీలగిరి వృక్షాలు, సంపెంగపూల పరిమళాలుతో ఆ మర్నాడు క్షణాల్లా కరిగిపోయాయి. ఆ తరువాత రోజే మా తిరుగు ప్రయాణం. మధ్యానం పన్నెండు గంటలకల్లా హార్సిలీ హిల్స్ లోని మా ఇంటిని వదిలి, అందమైన జ్ఞాపకాలను మాతోనే సర్దుకుని బస్సు కోసం ఎదురు చూస్తూ నిల్చున్నాం. అందమైన ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్తున్నందుకు మాలో ఏమాత్రం బాధలేదు. సూర్యాస్తమయంలోని అలౌకికానందాన్ని ఎలా ఆస్వాదించాలో హార్సిలీహిల్స్ మాకు నేర్పింది.  అప్పట్నుంచీ మా వినుకొండలో సంధ్యవేళ అందమైన సూర్యుడిలో హార్సిలీహిల్స్ అందాలు కనిపిస్తూనే ఉన్నాయి.

- శిఖా సునీల్



కామెంట్‌లు

  1. భూమిపై జెకె స్పృశించిన ఇష్టమైన అద్భుతమైన సమాచారాన్ని పరిచయం చేస్తున్న సునీల్ కి ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారములు

    రిప్లయితొలగించండి
  2. It's a beautiful place. I still cherish my visit to it. Good article, Sunil.

    రిప్లయితొలగించండి
  3. సునీల్ గారు మీరు రాసిన హార్సెలి హిల్స్ ఆర్టికల్ చాలా బాగుంది . అక్కడి అందాలను కళ్ళకు కట్టినట్లు చాలా చక్కగా వర్ణించారు.నేను ఆ లోకంలోకి వెళ్ళినట్లు అనిపించింది.మీకు ధన్యవాదాలు సార్

    రిప్లయితొలగించండి
  4. ధన్యవాదాలు సార్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ ఫుల్ గా ఉంది.

    రిప్లయితొలగించండి
  5. ఆ ప్రాంతం లోని అందాలకై నా కళ్ళు మీ రాతల్లో వెతికాయి..
    మరికొన్ని అద్భుతాల కోసం చూస్తు ఉంటాము.. 🙏

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్