జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
తెలుగు సాహిత్య అధ్యయనంలో " ఆంధ్ర సాహిత్య చరిత్ర " ప్రధానమైన అంశం. తెలుగు సాహిత్యం ఎలా పుట్టింది, ఎలా మొదలైంది, ఎలా పరిణామం చెందింది అని చెప్పే శాస్త్రమే తెలుగు సాహిత్య చరిత్ర లేదా ఆంధ్ర సాహిత్య చరిత్ర. యూజీసీ నెట్ అర్హత సాధించాలన్నా, జేఆర్ఎఫ్ అవార్డు పొందాలన్నా ఇతర తెలుగు పోటీ పరీక్షల్లో నెగ్గలన్నా ఆంధ్ర సాహిత్య చరిత్రను విస్తృతంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తెలుగు సాహిత్యం చదివే విద్యార్థులకు ఆంధ్ర సాహిత్య చరిత్ర పాఠ్యాంశం గుండె లాంటిది. డిగ్రీ స్థాయిలోనే తెలుగు సాహిత్య అధ్యయనం ప్రారంభించినప్పుడే సాహిత్య చరిత్ర అధ్యయనాన్ని కూడా ప్రారంభిస్తాం. డిగ్రీ విద్యార్థుల కోసం గతంలో తెలుగు అకాడమీ ప్రచురించిన " ఆంధ్ర సాహిత్య చరిత్ర " పుస్తకం అమూల్యమైనది. సాహిత్య చరిత్ర పట్ల ప్రాథమిక అవగాహన కలిగించడంలో ఈ పుస్తకానికి సాటి లేదు. డిగ్రీ తరువాత పీజీ స్థాయిలో, యూజీసీ నెట్, జేఅర్ఎఫ్ ఇతర పోటీ పరీక్షలకోసం ఆంధ్ర సాహిత్య చరిత్రను విస్తృతంగా, లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
తెలుగు సాహిత్యంలో నెట్ అర్హత సాధించడానికి యూజీసీ పొందుపరిచిన సిలబస్ లో తెలుగు సాహిత్య చరిత్ర యూనిట్ -3 లో ఉంటుంది. నెట్ సిలబస్ లో " ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనం - ప్రక్రియలు " అనే పేరుతో పొందుపరిచారు. దీనినే మనం సాధారణంగా ఆంధ్ర సాహిత్య చరిత్ర లేదా తెలుగు సాహిత్య చరిత్ర అనవచ్చు. సిలబస్ లో కొన్ని లోతైన అంశాలు ఉన్నాయి. సాధారణంగా పీజీ స్థాయిలో తెలుగు సాహిత్య చరిత్ర చదవడం వేరు, నెట్, జేఆర్ఎఫ్ కోసం తెలుగు సాహిత్య చరిత్ర చదవడం వేరు.సాహిత్య చరిత్ర - పుస్తకాలు
ఆంధ్ర సాహిత్య చరిత్రను మహామహులైన సాహిత్య కారులు గ్రంథస్తం చేశారు. ఎంతో మంది గొప్ప రచయితలు, కవులు తెలుగు సాహిత్య చరిత్రను రాసినప్పటికీ ప్రతి ఒక్కరూ " ప్రాజ్నన్నయ యుగం " తోనే తెలుగు సాహిత్య చరిత్రను ప్రారంభించారు. అయితే వారి వారి అధ్యయనాలు, అప్పటివరకు ప్రాచీన కవుల గురించి వారు చేసిన పరిశోధన అంశాలు, వారికి లభించిన సమాచారం, వారి శైలిని బట్టి ఆంధ్ర సాహిత్య చరిత్రను ఒక్కొకరు ఒక్కో విధంగా రచించారు. ఇవన్నీ అమూల్యమైన గ్రంధాలే. నవ్యాంధ్ర యుగ కర్తగా ప్రసిద్ధి పొందిన కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఎన్నో సాహిత్య ప్రక్రియలకు ఆద్యుడు. ఆయనే మొదటిగా " ఆంధ్ర కవులు చరిత్ర " అనే పేరుతో ఆంధ్ర సాహిత్య చరిత్రను రచించారు. ఆయన బాటలో గురజాడ శ్రీరామమూర్తి ( కవి జీవితాలు ), కాశీనాధుని నాగేశ్వరరావు ( ఆంధ్ర వాజ్మయ చరిత్రము ), చాగంటి శేషయ్య (ఆంధ్ర కవి తరంగిణి ), వంగూరి సుబ్బారావు ( ఆంధ్ర వాజ్మయ చరిత్ర ), పింగళి లక్ష్మీకాంతం ( ఆంధ్ర సాహిత్య చరిత్ర ), కల్లూరి వెంకట నారాయణరావు ( ఆంధ్ర వాజ్మయ చరిత్ర సంగ్రహము ), నిడదవోలు వెంకటరావు ( తెలుగు కవుల చరిత్ర ), ఖండవల్లి లక్ష్మీ రంజనం ( ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము ), వారణాసి వెంకటేశ్వర్లు (ఆంధ్ర సాహిత్య సంగ్రహ చరిత్ర ), దివాకర్ల వెంకటావధాని ( ఆంధ్ర వాజ్మయ చరిత్రము ), ఆరుద్ర (సమగ్ర ఆంధ్ర సాహిత్యం ), కొర్లపాటి శ్రీరామమూర్తి ( తెలుగు సాహిత్య చరిత్ర ), ఆచార్య జి.నాగయ్య ( తెలుగు సాహిత్య సమీక్ష ), ఆచార్య వెలమల సిమ్మన్న ( తెలుగు సాహిత్య చరిత్ర ), డాక్టర్ ద్వా.నా శాస్త్రి ( తెలుగు సాహిత్య చరిత్ర ).. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో గొప్ప సాహిత్యకారులు తెలుగు సాహిత్య చరిత్రను గ్రంథస్తం చేశారు. అమూల్యమైన సాహిత్య సంపదను పొందుపరిచి మన ముందు ఉంచారు.
మరి ఏ పుస్తకం చదవాలి ?
సాహిత్యం పట్ల ఆసక్తితో చదవడం వేరు, పరీక్షల కోసం చదవడం వేరు. సాహిత్య విద్యార్థులుగా పై పుస్తకాలన్నీ ఏదో ఓ సందర్భంలో చూడడం కొన్నిటినైనా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ, యూజీసీ నెట్ పరీక్ష కోసం మూడు నెలల వ్యవధిలో లోతుగా చదవాల్సి ఉంటుంది. నెట్ సిలబస్ పరిశీలిస్తే యూనిట్ -3 లో ఉన్న " ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనం - ప్రక్రియలు " లో అన్ని అంశాలు ఒకే పుస్తకంలో లభించటం కాస్త కష్టమే. కానీ, సాహిత్య చరిత్ర రాసిన ఎంతో మంది కవులు ప్రాజ్నన్నయ యుగంతో ప్రారంభించి ఆధునిక కవుల వరకు, వివిధ సాహిత్య ప్రక్రియల వరకు సృజించారు. దీనికి అనుగుణంగా యూజీసీ నెట్ కోసం ఒకటి లేదా రెండు పుస్తకాలు దగ్గర పెట్టుకోవడం ఉత్తమమైన మార్గం. సులభంగా అర్థమయ్యే రీతిలో, వాడుక భాషలో ఉన్న ప్రామాణిక సాహిత్య చరిత్ర పుస్తకాలను ఎంచుకోవాలి. పుస్తకంతో ఒకసారి నెట్ సిలబస్ ను పోల్చి చూసుకోవాలి. దాదాపు ఎనభై శాతం సిలబస్ ఆ పుస్తకం లో ఉండేలా చూసుకోవాలి. ఆలాంటి పుస్తకాన్ని ఎంచుకోవడం ఉత్తమం. ఇక్కడ అభ్యర్ధుల అభిరుచి కూడా ముఖ్యం. ఎంచుకున్న పుస్తకాన్ని మనసుపెట్టి చదవాలి. లోతుగా అవగాహన చేసుకుంటూ పదేపదే చదవాలి. చదివేటప్పుడే సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న నోట్స్ యూజీసీ నెట్ పరీక్షకు ఎంతో ఉపకరిస్తుంది. తెలుగు సాహిత్య విద్యార్థులు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే " ఆంధ్ర సాహిత్య చరిత్ర " అనేది సాహిత్య విద్యార్థులకు గుండె లాంటిది. అందుకే దీనిని ఎంత లోతుగా, ఇష్టంగా చదివితే అంత మంచిది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి