జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
లేచిపోయింది. 1927లో చలం మైదానంలో ' రాజేశ్వరి ' కూడా లేచిపోయింది. అంతకు ముందూ, ఆ తరువాత ఎంతో మంది లేచిపోతూనే ఉన్నారు. ప్రతిరోజూ ఏదో ఓ దినపత్రికలో లేచిపోయే సింగిల్ కాలం వార్తలను మనం చదువుతూనే ఉన్నాం. ఓరు కుప్పై కథై లో ' పోంగొడి ' కూడా లేచిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది. లేచిపోవడానికి ముందు ఏం జరిగేది. ఇలాంటి లేచిపోయిన సంఘటనల కథలు మనకు అంతగా తెలియకపోవచ్చు. లేచిపోయిన కథలన్నీ విషాదాంతాలు కావడం మాత్రం సహజంగా అందరికీ తెలుసు. లేచిపోవడాన్ని సమర్ధించుకున్న చలం మైదానం నవల కూడా విషాదాంత కథే. ఓరు కుప్పై కథై చిత్రం కూడా విషాదాంత చిత్రమే. కానీ, ఇలాంటి విషాదాంత కధలు కళ్ళకు కట్టినట్లు చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. ఇలాంటి సంఘటనలు నిజంగా చూస్తే భయం కలుగుతుంది. ఇలాంటి సంఘటనలు మనిషిని హెచ్చరిస్తాయి. అందుకే, ఓరు కుప్పై కథై చిత్రం ఇరవైఒక్క ఏళ్లు దాటిన వాళ్ళు చూడాల్సిన చిత్రం.
ఓరు కుప్పై కథై అంటే ' ఓ మురికి కథ ' అని అర్థం. చెన్నై మురికి వాడలో ఓరు కుప్పై కథై సినిమా ప్రారంభమవుతుంది. ఏదైనా కొత్త సినిమాని పరిచయం చేస్తున్నప్పుడు దాని కథ జోలికి వెళ్లక పోవడం మంచిది. కథ ముందుగానే తెలిస్తే సినిమాపై ఆసక్తి తగ్గిపోతుందనేది జగమెరిగిన సత్యం. కానీ, ఈ ' మురికి కథ ' గురించి ముందుగానే తెలిస్తే ఓరు కుప్పై కథై సినిమాపై మరింత ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. ఈ సినిమా కథ ముందుగానే తెలుసుకుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రైమ్ వీడియో ఆన్ చేసేస్తాం. రెండు గంటల సినిమాని తెరకి అతుక్కుని, కథలో లీనమై చుసేస్తాం.ఓరు కుప్పై కథై సినిమాలో కుమార్ అనబడే హీరో చెన్నై మురికి వాడలో చెత్త కుప్పలు ఎత్తే పని చేస్తూ ఉంటాడు. ఇలాంటి పని గురించి, చెన్నై మురికివాడల వాతావరణం గురించి ఏ మాత్రం తెలీని పోంగొడి అనే ఓ పల్లెటూరి అందమైన అమ్మాయితో కుమార్ వివాహం జరుగుతుంది. ఎన్నో ఆశలతో కొత్త కాపురంలోకి అడుగు పెట్టిన పోంగొడికి మురికి మనుషులు, మురికివాడల వాతావరణం ఏమాత్రం నచ్చదు. దీనిని అర్ధం చేసుకున్న కుమార్ తన భార్య ఆనందం కోసం ఇళ్లు మారతాడు. దగ్గరలోని అపార్ట్మెంట్లో ఓ ఇళ్లు అద్దెకు తీసుకుంటాడు. అప్పటికే వాళ్ళిద్దరికీ ఏడాది పాప కూడా వుంటుంది. ఇక్కడి వరకూ సవ్యంగా జరిగిపోయే కథలోకి అపార్ట్మెంట్ లో ఎదురు పోర్షన్లో అద్దెకు ఉండే అర్జున్ ఎంట్రన్స్ తో మరో మలుపు తిరుగుతుంది. సాప్ట్ వేర్ ఇంజనీర్ అయిన అర్జున్ కన్ను పోంగొటిపై పడుతుంది. సహజంగానే భర్తపై అయిష్టంగా ఉన్న పోంగొటి ఎదురింటి అర్జున్ ఆకర్షణలో పడుతుంది. ఆ తరువాత ఆకర్షణ సాన్నిహిత్యనికి దారితీయడం.. ఓ రోజు లేచిపోవడం వరుసగా జరిగి పోతాయి. ఇక్కడి నుంచే సినిమా కథ ఊహించని మలుపు తిరుగుతుంది..
వివాహేతర సంబంధం, సహజీవనం వంటి పదాలు మనకు అంతగా నచ్చవు. అసభ్యంగా వినిపిస్తాయి. కానీ, ఈ చిత్రంలో అసభ్యత అన్న దానికి పెద్దగా చోటు ఉండదు. ఈ చిత్రం మొత్తం ప్రేమకథా చిత్రంగా కనిపిస్తుంది. మురికి మనుషుల్లా కనిపించే వాళ్ళలో ఎంత గొప్ప ప్రేమ నిండి ఉంటుందో ఈ చిత్రంలో చూస్తాం. ఇది మొదట చెప్పినట్లు ' లేచిపోయే ' సినిమా కాదు. మనసును కరిగించే ' మానవత్వం ' ఉన్న సినిమా. చిన్న ఆశ, కోరిక జీవితాలను ఎలా చిద్రం చేస్తుందో చెప్పే సందేశాత్మక చిత్రం.
ఓరు కుప్పై కథై జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. 2018 లో తమిళంలో విడుదలైంది. రచన, దర్శకత్వం కాళీ రంగస్వామి. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో రెండు గంటల పాటు తెరకు అతుక్కునేలా చేసిన రంగస్వామి ప్రతిభ గొప్పగా కనిపిస్తుంది. సన్నివేశాలో ఇంకిపోయే జాషువా శ్రీధర్ సంగీతం బాగుంటుంది. అప్పుడెప్పుడో సత్యజిత్ రే సినిమాల్లో మురికివాడలను చూశాం. మళ్లీ ఇప్పుడు ఒరు కుప్పై కథై సినిమాలో మురికివాడల చిత్రీకరణ వాస్తవ జీవితానికి అద్దం పట్టేలా ఉంటుంది. కుమార్ పాత్రలో దినేష్ కుమార్, పోంగొటి గా మనీషా యాదవ్ అద్భుతంగా నటించారు. తప్పు చేయడం మానవ సహజం అంటూ ప్రారంభమయ్యే ఈ సినిమా క్షమించడం దైవత్వం అనే కొటేషన్ తో ముగుస్తుంది. ఇది మురికి కథ కాదు, మనసున్న ఒక మనిషి కథ.
- శిఖా సునీల్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి