జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
జై భీమ్ సినిమా తర్వాత అంతటి బలమైన కథా చిత్రాన్ని మళ్లీ చూడగలనా అన్న సందేహం నన్ను వెంటాడింది. ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన తర్వాత కలిగే సంతోషం ఎంతో కాలం నిలబడదు. మళ్లీ అంతటి ఉన్నత శిఖరాన్ని కనుగొనేంత వరకూ పర్వతాన్వేషకుడు ఓ చోట నిలబడలేడు. సినిమా ప్రేమికుడూ అంతే. మంచి సినిమా తర్వాత అంతకన్నా మంచి సినిమా కోసం ఆన్లైన్ ప్రవాహాన్ని నిరంతరం శోధిస్తూనే ఉంటాడు. అదృష్టం కొద్దీ ఈ నెల మొదటి వారంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ' జనగణమన ' సినిమా కనిపించింది. కేవలం రెండున్నర గంటలు వ్యవధిలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన నా సినిమాల జాబితాలో జై భీమ్ సరసన జనగణమన చేరిపోయింది.
ఇన్ స్టెంట్ జడ్జిమెంట్, మీడియా ట్రయల్, సోషల్ మీడియా అత్యుత్సాహం, అర్థంలేని ప్రజల భావావేశాలు, మానభంగాలు, అకృత్యాలు, విశ్వవిద్యాలయాల్లో వివక్షలు, మేధావుల ముసుగులో వేధింపులు, పనికిరాని రాజకీయాలు... వ్యవస్థలోని ఆన్ని కోణాలు జనగణమన సినిమా రూపంలో కళ్ళ ముందు కనిపిస్తుంది. జనగణమన కథా రచయిత షరీఫ్ మహమ్మద్. సమాజాన్ని బాగా చదివిన కథా రచయిత. వాస్తవ ఘటనల ఆధారంగా మలిచే కథలు ఆకట్టుకుంటాయి కానీ, వాస్తవ సంఘటనలను మైమరపించే కథలను సృష్టించడం చాల చాలా కస్టం. షరీఫ్ మహమ్మద్ ఈ విషయంలో నూరు శాతం సక్సెస్ అయ్యాడు. సినిమా ప్రారంభం నుంచి క్షణం కూడా పక్కకి చూసే అవకాశం ప్రేక్షకులకి ఇవ్వకుండా కేవలం సస్పెన్స్ నేపథ్యం ఉన్న సినిమాలను కూడా తలదన్ని జనగణమన సినిమా కమర్సియల్ హిట్ , సూపర్ హిట్, డూపర్ హిట్, బాక్సాఫీస్ హిట్.. ఇలా అన్ని హిట్లు కొట్టుకుంటూ దూసుకుపోతోంది.
జనగణమన సినిమా కథలోకి కాస్త వెళితే.. సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సభ పనిచేస్తుంటారు. ఆమె ఆదర్శ భావాలు కలిగిన యువతరం ప్రతినిధి. ఓ రోజు అర్ధరాత్రి సిటీ ఔట్ కట్స్ లో అత్యాచారానికి గురై కాల్చి వేయబడిన సభ మృతదేహం కనిపిస్తుంది. ఈ పాశవిక ఘటనకు నలుగురు పాత నేరస్తులు కారణం అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వస్తారు. ఆ యువకులను అదుపులోకి తీసుకోవడం, వాళ్లు తప్పించుకునే ప్రయత్నంలో ఎన్కౌంటర్ కి గురై చనిపోవడం గంటల వ్యవధిలో జరిగి పోతుంది. ఈ ఎన్కౌంటర్ చేసిన పోలీసు అధికారికి జనం పూలు చల్లి నీరాజనాలు పడతారు... ఇదంతా చూస్తూ ఉంటే అప్పుడెప్పుడో హైదరాబాదులో జరిగిన ఓ సంఘటన గుర్తొస్తోంది కదూ. కాదు, కాదు.. అసలు ఇది జనగణమన సినిమా కథ కానేకాదు. మనం సహజంగా సినిమా చూస్తున్నప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో అనే అంచనాలు మదినిండా రివ్వున తిరుగుతూ ఉంటాయి. మన అంచనాకి అందకుండా కథ నడుస్తున్నప్పుడే సినిమాలో పూర్తిగా లీనమైపోతాం. జనగణమన కూడా ఇలాగే ఉంటుంది. రెండున్నర గంటల సినిమా రెండు నిమిషాల్లా గడిచిపోతుంది. అప్పుడే అయిపోయిందా అన్న భ్రాంతి కలుగుతుంది. అదే జనగణమన కథ, దర్శకత్వ గొప్పదనం.
సమకాలీన రాజకీయ అంశాలను ప్రతిబింబించే కథా నేపథ్యంతో జనగణమన సినిమా చాలా ప్రభావవంతంగా ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ రోహిత్ వేముల, హైదరాబాద్ దిశ ఎన్ కౌంటర్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు, జై భీమ్ కోర్టు వాదనలు గుర్తుకు తెచ్చే సన్నివేశాలతో కథను నడపడం లో దర్శకుడు డిజో జోష్ ఆంటోనీ ప్రతిభ అత్యద్భుతం. హీరోయిజానికి కాకుండా కథకు ప్రాధాన్యతనివ్వడంలో మలయాళ సినిమాలు ముందువరుసలో ఉంటాయి. సన్నివేశాలకు తగిన పవర్ ఫుల్ డైలాగులూ ప్రతి ఫ్రేమ్లో ఇంకిపోయే సంగీతం బాగుంది. పృధ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడ్, మమతా మోహన్ దాస్, జిఎం సుందర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది.
- శిఖా సునీల్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి