" ప్రతి క్షణాన్ని ఇదివరకే జీవించినట్లుగా భావించి, మళ్ళీ ఈ అవకాశం మీకు వచ్చినట్లుగా ఊహించి, ఆ అవకాశాన్ని మరింత ప్రయోజనకరంగా జీవించడానికి ప్రయత్నించు "
- విక్టర్ ఈ. ఫ్రాంకిల్

అవి రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి రోజులు. 1943 వ సంవత్సరం. జర్మనీలోని ఆశ్విడ్జ్ అనబడే నిర్భంధ శిబిరాల ముందు వేలమంది యుద్ధ ఖైదీలు బారులు తీరి ఉన్నారు. యుద్ధానికి ముందు వారంతా స్వేచ్ఛగా, సంతోషంగా కుటుంబాలతో గడిపిన సామాన్య ప్రజలు. ఇప్పుడు యుద్ధ ఖైదీలుగా నిస్సహాయంగా నిర్భంధ శిబిరాలలోకి వెళ్లేందుకు బారులు తీరారు. ప్రధాన ద్వారం ముందు వడపోత కార్యక్రమం జరుగుతోంది. యుద్ధ ఖైదీల్లో ఒక్కొక్కరిని నిశితంగా పరిశీలిస్తున్న ఓ అధికారి వారిని కుడివైపుకు వెళ్లాలో, ఎడమవైపుకు వెళ్లాలో నిర్ణయిస్తున్నాడు. కుడి వైపుకు వెళితే నిర్బంధ శిబిరంలోకి దారి, ఎడమ వైపుకు వెళితే విషవాయువు గదుల్లోకి మార్గం. ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించే అధికారం అక్కడ ఉన్న వడపోత అధికారి హక్కు. బతకడానికీ, చావడానికీ మధ్య ఒక్క ఆజ్ఞ మాత్రమే అక్కడ పనిచేస్తుంది. కొందరిని కుడివైపు వెళ్ళమని మరికొందరిని ఎడమవైపు వెళ్ళమని అధికారి ఆజ్ఞాపిస్తున్నాడు. బారులు తీరిన జనం గుండెల్లో నిస్సహాయత. తమకు ఏ వైపు మార్గం స్వాగతం పలుకుతుందో అనే ఆందోళన. కుడివైపు ఉన్న నిర్బంధ శిబిరం వైపు వెళ్ళమని ఆజ్ఞాపిస్తే ఎంత కాలం బ్రతికి ఉంటారో తెలియకుండా, ప్రతిరోజూ చస్తూ బతుకుతూ, బతికినంతకాలం నరకం అనుభవిస్తూ బతకాలి. ఎడమ వైపు వెళ్ళమని ఆజ్ఞాపిస్తే నేరుగా అది మరణానికి దారి. ఎడమ వైపున ఉన్న గ్యాస్ చాంబర్లలో విషవాయువులు వదిలి గంటల్లోనే మూకుమ్మడిగా చంపేస్తారు. పనిచేయగలిగే శరీర దారుఢ్యం ఉన్న వాళ్ళని కుడివైపుకు, పనిచేయలేని వాళ్ళని ఎడమవైపుకు పంపిస్తున్నారన్న విషయం బారులు తిరిన జనంలోని ఓ వ్యక్తికి అర్థమైంది. ఎలాగైనా బతకాలని అతను బలంగా నిర్ణయించుకున్నాడు. యుద్ధం ముగుస్తుందనీ, మళ్ళీ తన భార్య, పిల్లలను కలుసుకుంటాననే ఆశ అతని మనసులో బలంగా నాటుకుపోయింది. కుడి వైపు వెళ్లాలని పదే పదే మనసులో కోరుకుంటున్నాడు. తన వంతు రానే వచ్చింది. శరీరమంతా గాయాలతో బాధిస్తున్నా చెక్కు చెదరని మనో ధైర్యంతో నిల్చున్నాడు. మరణించడానికి , జీవించడానికీ మధ్య ఓకే ఒక్క ఆజ్ఞ దూరం. అతని చెవులకు కరుకైన ఓ శబ్దం బలంగా వినిపించింది " కుడివైపుకు వెళ్ళు.."కుడి వైపు వెళ్లిన ఆ వ్యక్తి Man's Search for Meaning పుస్తక రచయిత విక్టర్ ఈ. ఫ్రాంకిల్. ఆయన ఆస్ట్రియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ మానసిక వైద్య నిపుణుడు. సైకోథెరఫీ రంగంలో ఫ్రాయిడ్, ఆడ్లర్, యాంగ్ ల తర్వాత అంతటి గొప్ప మేధావి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో తన నలభైయవ ఏట నాజీల చేతుల్లో యుద్ధఖైదీగా నిర్బంధ శిబిరాల్లో మూడేళ్లపాటు విక్టర్ ఈ. ఫ్రాంకిల్ ఉన్నాడు. ప్రతిరోజు మరణిస్తూ రేపటిపై ఆశతో జీవించాడు. ప్రపంచ చరిత్రలో నాజీలు ఏర్పరిచిన ఆశ్విడ్జ్ నిర్భంధ శిబిరాలు అత్యంత పాశవికమైన భూలోక నరకాలు. అపరిశుభ్ర వాతావరణం, అనారోగ్యం, తీవ్ర నిర్బంధం, మానసిక వేదన, గొడ్డు చాకిరి, కేవలం రోజుకి ఒక్క బ్రెడ్డు ముక్క ఆహారం, ఏ రోజు చనిపోతారో తెలియని పరిస్థితుల్లో నిర్భంధ శిబిరాల్లో మగ్గిపోవాలి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి నిర్బంధ శిబిరాల్లో ఉన్న ఖైదీలు కొన్ని లక్షల మంది చనిపోయి ఉంటారు. ఇది చరిత్ర మరువలేని భయానక వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో విక్టర్ ఈ. ఫ్రాంకిల్ మనోధైర్యం కోల్పోకుండా భవిష్యత్ మీద ఆశతో మూడు సంవత్సరాల పాటు నిర్బంధ శిబిరంలో గడిపాడు. ఎన్నోసార్లు మృత్యు ముఖానికి సమీపంగా వెళ్లి వచ్చాడు. అయినప్పటికీ బ్రతకాలన్న అతని ఆశను మాత్రం చావనివ్వలేదు. మూడేళ్ల ప్రత్యక్ష నరకం తర్వాత నిర్బంధం నుంచి విక్టర్ ఈ. ఫ్రాంకిల్ విడుదలయ్యాడు. అనంతరం వియన్నా విశ్వవిద్యాలయ వైద్య కళాశాలలో న్యూరాలజీ, సైకియాట్రీ ప్రొఫెసర్ గా 1997లో తాను మరణించే వరకు పనిచేసాడు. ఈ కాలంలోనే తాను నిర్భంధ శిబిరంలో అనుభవించిన యధార్థ జీవితాన్ని Men's Serch for Meaning అనే పుస్తక రూపంలో రచించాడు. ఈ పుస్తకాన్ని కేవలం తొమ్మిది రోజుల్లో విక్టర్ ఈ. ఫ్రాంకిల్ పూర్తి చేశాడు. ఇంగ్లీషులో అనువదించబడిన తర్వాత ఈ పుస్తకం సంచలనంగా మారింది. మానసిక వైద్య రంగంలో ఈ పుస్తకం సిద్ధాంతగ్రంథం. ఎందుకంటే తాను నిర్బంధం నుంచి, మృత్యు ముఖం నుంచి, తన అనుభవాల నుంచి కొత్త సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు విక్టర్ ఈ. ఫ్రాంకిల్. అదే ' లోగో థెరపీ '.
Men's Search for Meaning పుస్తకం చాలా చిన్న పుస్తకం. తెలుగు అనువాదంలో 150 పేజీలు మాత్రమే ఉంటుంది. ఇందులో రెండు భాగాలు ఉంటాయి. మొదటిభాగం రచయిత విక్టర్ ఈ. ఫ్రాంకిల్ తాను నిర్బంధ శిబిరంలో గడిపిన రోజుల గురించి చెప్తాడు. మొదటి భాగం చదువుతున్నంత సేపు పాఠకులు కూడా యుధ్ధ ఖైదీలతో పాటే ఆశ్విడ్జ్ నిర్బంధ శిబిరంలో గడిపిన అనుభూతి చెందుతారు. అంత వాస్తవికంగా ఈ పుస్తక రచన కొనసాగుతుంది. జీవితం అంటే ఎంత గొప్పదో ఈ పుస్తకం చదివిన తరువాతే అర్థమవుతుంది. మనం అనుకునే మన బాధలు, కష్టాలు ఎంతో చిన్నవిగా కనిపిస్తాయి. మనకు ఎదురయ్యే దుఃఖం కూడా కొన్నిసార్లు మంచిదే అంటాడు రచయిత." దుఃఖం కూడా అన్ని సందర్భాల్లో రోగ కారకం కాదు. కొన్నిసార్లు మానసిక ఆందోళన కలిగించినప్పటికీ దుఃఖం, మానవున్ని విజయం వైపు పయనించేలా అన్వేషణాగ్నిని రగల్చగలదు. ఆ దుఖం అస్తిత్వపు పోరాటం నుంచి జనించినదైతే తప్పక విజయం వైపే పయనిస్తుంది." రెండో భాగంలో రచయిత తన నూతన ఆవిష్కరణ " లోగో థెరపీ " సిద్ధాంతం గురించి వివరిస్తాడు. మనో వైజ్ఞానిక రంగంలో ఈ సిద్ధాంతం చాలా గొప్పది. ఇది అత్యంత ప్రభావవంతమైన సిద్ధాంతం. జీవితంలో వ్యతిరేక అంశాలను కూడా సానుకూలంగా, ఉపయుక్తంగా, మార్చుకుని క్రియాశీలకంగా మానవ మేథ ఉండాలనేది లోగో థెరపీ అంతరార్థం. లోగో థెరపీ ప్రకారం మూడు విధానాల్లో జీవిత పరమార్థం బోధపడుతుంది 1. ఏదైనా ఒక పనిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా 2. ఏదైనా ఒక అనుభవాన్ని కానీ, ఎవరినైనా ఒక వ్యక్తిని కాని కేంద్రంగా చేసుకోవడం ద్వారా 3. పోగొట్టుకోలేని బాధను అనుభవిస్తున్న నిస్సహాయమైన వ్యక్తికి, ఆ బాధ వెనుక అసలు అర్థాన్ని బోధించి, తద్వారా అతడికి జీవితం పట్ల ఉండే దృక్పథాన్ని మార్చడం ద్వారా. లోగో థెరపీని ఇలా ప్రయత్నించి విషాదాన్ని కూడా విజయంగా మార్చుకోవచ్చు.
ప్రపంచంలో అన్ని భాషల్లోకి Men's Search for Meaning పుస్తకం అనువదించబడింది. అమెరికాలో అత్యంత ప్రభావవంతమైన 10 పుస్తకాల జాబితాలో ఈ పుస్తకం ఒకటి. ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సిన పుస్తకం ఇది. కేవలం ఒక సినిమా టికెట్ ధర కూడా లేని ఈ పుస్తకంలో(100 రూపాయలు) ఎందరో జీవితాలను మార్చగలిగే వాక్యాలు కనిపిస్తాయి." అర్ధం కోసం అన్వేషణ " పేరుతో ఎమెస్కో ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందుబాటులో ఉంచారు.
మరణించాలనుకుంటున్నారా ?
ఈ పుస్తకాన్ని చదవండి.
జీవించాలనుకుంటున్నారా ?
ఈ పుస్తకాన్ని తప్పక చదవండి.
- శిఖా సునీల్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి