జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
2019 జూన్ 28న హిందీలో విడుదలైన సినిమా ఆర్టికల్ - 15. ఈ సినిమా బాలివుడ్ లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. గౌరవ్ పొలంకి, అనుభవ్ సిన్హా రచనలో రూపుదిద్దుకున్న ఆర్టికల్- 15 సినిమా అప్పట్లో ఓ పెద్ద చర్చ. ఇదే కథాంశంతో గత నెల తమిళ రీమేక్ వెర్షన్లో విడుదలైన సినిమా " నెంజుకు నీది ". ప్రస్తుతం ఈ సినిమా తమిళం, కన్నడం, తెలుగులో దూసుకుపోతోంది. హిందీ మూల కథాంశాన్ని తీసుకున్నప్పటికీ తమిళ నేటివిటీకి తగ్గట్టుగా చిత్రికరించడంతో ద్రవిడ భాషా ప్రేక్షకుల మనసులకు ఈ సినిమా హత్తుకుపోతోంది. ఆ మధ్య తమిళంలో సంచలనం సృష్టించిన కర్ణన్, ఈ మధ్య బాక్సాఫీస్ బద్దలు కొట్టిన జై భీమ్, ఇటీవలే విడుదలైన రైటర్, జనగణమన సరసన ' నెంజుకు నీది ' సినిమాకు సగౌరవ స్థానాన్ని ఇవ్వడానికి సందేహించల్సిన పనిలేదు.
సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల భావన ఓ మానసిక రుగ్మత. రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టి, రెండు వేల ఇరవై రెండులో కూడా మనిషి మనసుల్లో శాశ్వితంగా తిష్ట వేసిన వివక్ష, కులం అనే భావన. కుల నిర్మూలన గురించి ఎంత ప్రయత్నించినప్పటికీ తన రూపం మార్చుకుంటుందే కానీ అంతం కావడం లేదనేది ఒప్పుకోవాల్సిన విషయం. కొత్తగా తన రూపాన్ని మార్చుకున్న కుల భావన " అహంకారం " అనే రూపంలో బయట పడుతూ ఉంటుంది. సమకాలీన అంశాలను పరిశీలిస్తే ఈ అహంకారం ఏదో ఓ రూపంలో, ఎక్కడో ఓ చోట, ఎవరో ఒకర్ని బలి తీసుకుంటూనే ఉంటుంది. ఇలాంటి కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా నెంజుకు నీది.
బలమైన కథాంశం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ తలపించే కథాగమనంతో కులవివక్ష వంటి సమకాలీన అంశాలను కలిపి ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించారు. దర్శకుడు చెప్పాలనుకున్న ప్రతి విషయాన్నీ సూటిగా చెప్పేశాడు. ఇంటి పేరును బట్టి కులాన్ని అంచనా వేయడం, దళిత వాడల్లో టీ తాగడానికి కూడా ఇష్టపడక పోవడం, దళిత మహిళ వంట చేసిందన్న కారణంగా మధ్యాన్న భోజనాన్ని పాఠశాలలోనే విద్యార్థుల ముందు పారేయడం వంటి సన్నివేశాలు మనం వినే వాస్తవ సంఘటనలను తలపిస్తాయి. పెరియార్, అంబేడ్కర్ విగ్రహాలకు బోను ఏర్పాటు చేయడం ఆలోచింపజేస్తుంది. "మాతృ భాష ఏదైనా కావచ్చు, కానీ దేశ భాషగా చట్టమే ఉండాలి.. అది సరైన వారి చేతిలో ఉండాలి" వంటి డైలాగులు ఇప్పటి భాషా వివాదాలను గుర్తు చేస్తాయి . " వాళ్ల చెత్తను వాల్లే శుభ్రం చేసుకోవాలి, అప్పుడే మనిషికీ, చెత్తకీ తేడా తెలుస్తుంది." " అన్ని జాతుల్లోనూ బాధ ఉంటుంది. కానీ, జాతి వల్ల మాత్రమే కలిగే బాధ మాకు మాత్రమే తెలుసు ... " వంటి డైలాగులు పవర్ ఫూల్గా అనిపిస్తాయి. తమిళ నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమాను నిర్మించడంలో డైరెక్టర్ అరుణ్ రాజ్ కామరాజ్ నూరు శాతం విజయం సాధించాడు. యువ ఐపీఎస్ అధికారి విజయ రాఘవన్ పాత్రలో ఉదయనిధి స్టాలిన్ ఇమిడిపోయాడు. ఆలోచింప చేసే సినిమాలను ఇష్టపడే వారు ఈ సినిమాను మిస్ అవ్వద్దు.
- శిఖా సునీల్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి