జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
'సార్పట్ట పరంపర' తర్వాత పా రంజిత్ సినిమా కోసం ఎదురు చూస్తున్న నాకు 'రైటర్' కనిపించింది. పా రంజిత్ సినిమాలంటేనే ఓ ప్రత్యేకత ఉంటుంది. నేరుగా దర్శకత్వం వహించినా, నిర్మించినా కథలు ఎంచుకునే విధానంలోనే పా రంజిత్ గొప్పతనం వుంటుంది. "మన దేశంలో రెండు వేలకు పైగా దళిత జాతికి చెందిన కులాలు ఉన్నాయి. వీరిలో కొందరు మాత్రమే కనీసం మాట్లాడుతున్నారు. వారి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి కదా. నేనూ ఆ ప్రయత్నమే చేస్తున్నాను" అంటూ అంబేద్కర్ ఫోటో పట్టుకుని సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన అరుదైన దర్శకుడు పా రంజిత్. అణగారిన జీవిత కథలను తవ్వితీసి బహుజన భావజాలాన్ని అద్ది కమర్షియల్ హిట్ కొట్టడం పా రంజిత్ ప్రత్యేకత. ఇదే బాటలో పా రంజిత్ నిర్మాతగా "రైటర్" సినిమా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం తెలుగులో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ద్వారా తొలిసారి ఫ్రాంక్లిన్ జాకబ్ దర్శకుడిగా పరిచయమై హిట్ కొట్టేశాడు. మొదటి సారి హిట్ కొట్టడమే కాదు, తమిళ సినిమాల్లో అత్యంత సహజంగా అణగారిన వర్గాల కథలను వినిపిస్తూ సంచలనం సృష్టిస్తున్న పా రంజిత్, మారి సెల్వరాజ్, వెట్రి మారన్, టిఎస్ జ్ఞానవేల్ సరసన ఫ్రాంక్లిన్ జాకబ్ కూడా చేరిపోయాడు.
రైటర్ సినిమా కథను ఫ్రాంక్లిన్ జాకబ్ తానే స్వయంగా రాసుకున్నాడు. ఈ సినిమా కథలో కులవివక్ష అనేదే కీలకమైన కథాంశం. అయినప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్, అందులో కిందిస్థాయి ఉద్యోగులు ఎదుర్కునే వాస్తవ పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపించారు. అమాయకులపై ఎలా, ఎందుకు అక్రమ కేసులు పెడతారు, తరవాత జరిగే పరిణామాలు సహజత్వంతో కూడుకున్న సన్నివేశాలు ఈ చిత్రంలో కనిపిస్తాయి. గతంలో చూసిన అంకురం, ద్రోహి, జై భీమ్ వంటి సినిమాల తరహాలోనే రైటర్ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే, ఫోటోగ్రఫీ, దర్శకత్వ ప్రతిభ చాలా భిన్నంగా కనిపిస్తుంది. నిరుపేద ఎస్సి కులానికి చెందిన ఓ పీహెచ్డీ స్కాలర్ చేయని తప్పుకు అత్యంత కఠినమైన చట్టాల కింద అరెస్ట్ కావడం, ఆ యువకున్ని ఎలా ఆయినా కేసు నుంచి తప్పించాలని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న ఓ పోలీస్ రైటర్ ప్రయత్నించడం చుట్టూ కథ తిరుగుతుంది. సెకండ్ హాఫ్ లో రేకెత్తించే ఉత్కంఠతతో సస్పెన్స్ సినిమాకి దగ్గరగా కథ నడుస్తుంది. పోలీస్ రైటర్ రంగరాజుగా సముద్ర ఖని నటన అద్భుతం. పీహెచ్డీ స్కాలర్ దేవకుమార్ గా హరి కృష్ణన్ అభినయం బాగుంది. ఎంటర్టైన్మెంట్ సినిమాలతో పాటూ ఇలాంటి వాస్తవ కథలకు దగ్గరా ఉండే సినిమాలను మిస్ కాకుడదు. పా రంజిత్ సినిమాలు ఎప్పటికీ మిస్ కాకూడదు.
- శిఖా సునీల్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి