వానాకాలం మొదలై అప్పుడే నెల రోజులు గడిచిపోయింది. ఎటు చూసినా పచ్చటి వాతావరణం. అది, శ్రావణమాసం ముగిసి ఆషాడమాసం ప్రారంభమయ్యే తొలి రోజు. తెలుగుదనం ఉట్టిపడే ఆ రోజుని పూర్వం తెలుగు సంవత్సర ప్రారంభంగా పిలిచేవాళ్ళు. ఏడాది పొడవునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశి రోజుల్లో ఆషాడ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. శాస్త్రం ప్రకారం వీటిని అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టమే కానీ, ' కొండ పండుగ ' అంటే చాలు, అమెరికాలో ఉంటున్న మా వినుకొండ ప్రజల మనసులు కూడా పులకించిపోతాయి. వినుకొండ గడ్డపై పుట్టిన ఎవ్వరైనా సరే, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కానీ, ' కొండ పండుగ ' అంటే చాలు, వారి మనసుల్లో ఆనందాల జ్ఞాపకాలు పొంగిపొర్లుతాయి.
కొండ పండుగ అంటే నాకూ ఓ చెరిగిపోని జ్ఞాపకం. మొదటిసారి ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు కొండ పండుగ రోజున వినుకొండ కొండ ఎక్కిన గుర్తు. పల్నాడు ప్రాంతంలో పేరెన్నికగన్న ప్రాంతం మా వినుకొండ. విష్ణుకుండినులు ఏలిన ప్రాంతం కావడం వల్ల చారిత్రక నేపథ్యం బలంగా ఉన్న ప్రాంతం ఇది. తొలి ఏకాదశి రోజున వినుకొండ కొండపై ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. ఆ ఆనవాయితీ కాలక్రమంలో గొప్ప పండుగగా, " కొండ పండుగ "గా మారింది. ఈ పండుగ కులమతాలకు అతీతంగా వినుకొండ ప్రజల గడపగడపనా జరిగే గొప్ప పండుగ.

అప్పట్లో కొండ పండుగ కోసం వినుకొండ ప్రజలు పది రోజుల నుంచీ ఎదురు చూస్తూ ఉండేవారు. కొండపైకి ఎక్కడానికి వేసిన మెట్లమార్గానికి తెల్లటి సున్నం కొట్టడంతో వినుకొండకు కొండ పండుగ కళ వచ్చేది. వినుకొండ కొండని చిన్న కొండ, పెద్ద కొండ అని పిలిచేవాళ్ళు. పెద్ద కొండ పైన రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. మామూలు రోజుల్లో పిల్లలు ఎవరైనా సరే కొండ ఎక్కాలంటే భయం. కానీ, కొండ పండుగ రోజున మాత్రం కొండ ఎక్కకపోతే బాధ. వాళ్లూ, వీళ్లూ అన్న తేడా ఉండదు.. కులం, మతం అన్న భేదం ఉండదు.. తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే తలారా స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకునే వారు. పొద్దున్నే వంటావార్పు ముగించుకొని పది గంటల కల్లా కొండపైకి వెళ్లడానికి కుటుంబాలు కుటుంబాలు కలసికట్టుగా బయలుదేరేవాళ్ళు. పెద్ద బజారు, బంగారపు కోట్ల సెంటర్, కోమట్ల బజారు మీదుగా కొండ వైపు నడిచి వెళ్తుంటే ఇది మా వినుకొండేనా అని ఆశ్చర్యంగా అనిపించేది. ఆ రోజున మా వినుకొండ, మా వీధులే మాకు కొత్తగా, మునుపెన్నడూ చూడనంత వింతగా ఉండేవి. అలా నడుస్తూ, నడుస్తూ కొండ ముందుకు చేరే వాళ్ళం. కొండ ఎక్కాలంటే 1200 మెట్లు ఎక్కాలి. అప్పటికే తెల్లవారుజామున కొండ ఎక్కి స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యే జనాలు, అప్పుడే కొండమీదకి వెళ్లడానికి బయలుదేరే జనాలతో ఆ మెట్ల మార్గం కిక్కిరిసి ఉండేది.
కొండ మొదటి మెట్టు ఎక్కితే చాలు, ఇక మన ప్రమేయం ఉండదు. గలగల పారే సెలయేరులా అలా.. అలా.. జనాలతో కలిసి కొండపైకి వెళ్ళిపోతాం. చిన్న కొండ సమీపిస్తుండగా మెట్ల మార్గానికి అటూ ఇటూ విచిత్ర మైన వేషధారణతో ఎప్పుడూ చూడని సాధువులు కనిపించే వాళ్ళు. త్రిశూలాలు చేతబూని, విభూది, జులపాలతో ఆధ్యాత్మిక శోభకు ప్రతీకగా కనిపించేవారు. చిన్న కొండ నుంచి పెద్ద కొండ ఎక్కాలంటే మూడింతల సమయం పడుతుంది. అయినా అలసట తెలిసేది కాదు. వినుకొండ కుర్రోళ్ళు అయితే రెండు మూడు సార్లు కొండెక్కి దిగి మళ్ళీ కొండెక్కే వాళ్ళు. మెట్ల మార్గం గుండా వెళ్తుంటే రాళ్ళను పట్టుకొని కొండ ఎక్కటానికి ప్రయత్నించే సాహసగాళ్లు కనిపించే వాళ్ళు. ఏమాత్రం పట్టు తప్పినా వాళ్ల పని అంతే. కానీ, పట్టుతప్పే వాళ్ళు ఎవరూ ఉండరు. ఎటు చూసినా జనాలూ, అరుపులూ, కేకలూ, చెవులు పగిలే తిరణాల బూరల శబ్దాల మధ్య ఎలా ఎక్కామో తెలియకుండా అంత పెద్ద కొండ ఎక్కేసేవాళ్ళం. కొండ ఎక్కడ మంటే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత సంతోషం. చాలామంది స్వామివారి దర్శనానికి వెళ్లేవాళ్లు. 
స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీ రామచంద్రుడు, సీతా దేవి జాడ కోసం అన్వేషిస్తూ వినుకొండ కొండమీదకు చేరుకుంటాడు. ఆ రోజు తొలి ఏకాదశి రోజు. శ్రీ రామ చంద్రుడు శివ భక్తుడు కావడం వల్ల తెల్లవారుజామున శివాభిషేకం చేయడం అలవాటు. దానికి తోడు ఆ రోజు తొలి ఏకాదశి రోజు కావడంతో కొండపై ఒక కోనేరు ఏర్పాటు చేసి, ఆయన స్వహస్తాలతో లింగేశ్వరస్వామిని ప్రతిష్టించాడని భక్తుల నమ్మకం. అందుకే ఈ దేవాలయానికి రామలింగేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది. ఈ దేవాలయాన్ని విష్ణుకుండినుల కాలంలో నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. తొలి ఏకాదశి రోజున స్వామిని దర్శించుకుంటే ప్రారంభించే ఏ పనైనా నిర్విఘ్నంగా జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే కొండపైకి ఎక్కిన ఎంతోమంది ప్రజలు స్వామివారి దర్శనం కాకుండా తిరిగి రారు. 
అంత పెద్ద కొండ ఎక్కి మేము ఉండే వినుకొండను చూడడం భలే తమాషాగా ఉండేది. చిన్న, చిన్న అగ్గిపెట్టెల్లా కొండపై నుంచి వినుకొండలో ఉన్న ఇల్లు కనిపించేవి. అంత ఎత్తు నుంచి ఏ ఇల్లు ఎక్కడ ఉందో, ఏ బజారు ఎటువైపు ఉందో అని వెతుక్కోవడం భలే ఆనందంగా ఉండేది. జూనియర్ కాలేజీ గ్రౌండ్, రైల్వే స్టేషన్ ప్రతి ఒక్కరూ ఇట్టే గుర్తుపట్టేవారు. అంత ఎత్తు నుంచి శివయ్య స్తూపం స్పష్టంగా కనిపించేది. కొండపైన ఇసుకేస్తే రాలనంత జనాలు ఉండేవారు. ఎటు చూసినా జనాలే, తెలిసిన జనాలే. ఆకాశంలో విహరిస్తున్నట్టు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళు. కొండపైన చెట్టు, గుట్ట, రాయి, రప్పా దాటుకుంటూ కొండెక్కిన ప్రతి ఒక్కరూ గుహా వైపు వెళ్లేవారు. కొండపైన అందరికి తెలిసిన ఓ గుహా వుండేది. అది రాజుల కాలం నాటి గుహా అని పెద్దలు చెప్పేవాళ్ళు. ఆ గుహా లోపలి నుంచి స్వరంగ మార్గం ద్వారా నేరుగా వినుకొండకు శివారులో ఉన్న రాజుల కాలం నాటి కట్టడం వరకు దారి ఉండేదని చెప్పుకునేవారు. ఆ గుహలో మహామునులు తపస్సు చేశారని, నిధినిక్షేపాలు ఉండేవని కథలు ప్రచారంలో ఉండేవి. కొండ పండుగ రోజున అవన్నీ చూడడం భలే తమాషాగా, సంతోషంగా ఉండేది. కొండపైన తిరిగి తిరిగి అలిసిపోయి ఏ రాయి నీడనో నాగజెముడు చెట్ల నీడనో కులబడేవాళ్ళం. ఆ రోజు కొండపైన ఉండే నాగజెముడు చెట్టు నీడే మహా అద్భుతంగా ఉండేది. కొండ మధ్యలో రాజుల కాలం నాటి కోనేరు ఒకటి ఉంటుంది. ఏ కాలంలో దాన్ని నిర్మించారో తెలియదు కానీ, ఆ రోజున మాత్రం కలువపూలతో ఆ కోనేరు కళకళలాడుతూ వినుకొండ ప్రజలకు స్వాగతం పలుకుతూ కనిపించేది. మాతో వచ్చిన పెద్ద వాళ్లు వెళ్ళి కోనేరు నీళ్లు పట్టుకొచ్చేవాళ్ళు. అందరూ గుంపుగా కూర్చొని తెచ్చుకున్న భోజనాలు హాయిగా తినేవాల్లు. కొండ మిద తినే భోజనాలు పరమాన్నం తిన్నంత కమ్మగా ఉండేవి.తొలి ఏకాదశి అంటేనే అందమైన ప్రకృతి చిహ్నం. వినుకొండ కొండపైన ఇంకా అద్భుతమైన అందం కొలువై ఉంటుంది. చేతికి అందే మేఘాలు, చల్లటి గాలులతో మనసు హాయిగా ఉంటుంది. ప్రతి ఏడాది ఆనవాయితీలా తొలి ఏకాదశి రోజే చిరు జల్లులు పలకరిస్తూ ఉంటాయి. ముఖాన్ని ముద్దాడుతూ అలా తాకి ఇలా మాయమయ్యే వర్షపు చినుకులు మనసును మత్తెక్కిస్తాయి. అలా అందమైన ప్రకృతి మధ్య, ఆధ్యాత్మిక నిలయంలో సాయంత్రం దాకా గడిపి తిరుగు ప్రయాణమయ్యే వాళ్లం.
కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం అంత సులభం. అలా చూస్తుండగానే కొండ దిగేసేవాళ్ళం. పెద్ద బజారు వీధులకు ఇరువైపులా తిరుణాల బొమ్మలు వుండేవి. చిన్నప్పుడు ప్రతి బొమ్మల కొట్టు చిత్రంగానే కనిపించేది. ఎప్పుడూ చూడని బొమ్మలు, తినుబండారాలు.. కొండ పండుగ అంటే వినుకొండ ప్రజలకు నిజమైన పండుగే. కొండ పండుగ గుర్తు చేసుకుంటే చాలు.. ఒక్కొక్కరికి ఒక్కో జ్ఞాపకం కళ్ళ ముందు కదిలాడుతూ ఉంటుంది.
ముప్పై ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడంతా మారిపోయింది. ఇంకా అభివృద్ధి చెందిన వినుకొండ నాలుగింతలు పెరిగింది. కానీ, మా కొండ అలాగే ఉంది...వినుకొండ ప్రజల జ్ఞాపకాలు మోస్తూ..
- శిఖా సునీల్ కుమార్
( జూలై 17 న వినుకొండ కొండ పండుగ )
వినుకొండ కొండ పండుగ గురించి చాలా అద్బుతంగా చెప్పారు. తొలకరి జల్లుల పండుగ వినుకొండ పండుగ. మీరు వర్ణించిన వర్ణన నా మనసుని పులకరింప చేసింది. నా మనసులో ఆనందాల జ్ఞాపకాలు పొంగిపొర్లాయి.
రిప్లయితొలగించండిమాది వినుకొండ కాదు, పక్కనే
రిప్లయితొలగించండిఉన్న మార్కాపురం. వినుకొండ నాకు అత్తగారు ఊరు. పెళ్లి అయిన గత నాలుగు నెలలు గా కొండ మీద తొలి ఏకాదశి పండగ గురించి వింటూనే ఉన్నా. శివయ్య పట్ల ఒక ప్రత్యేకమైన ఆకర్షణ,ఆరాధన భావం ఎక్కువ గా ఉండడం వల్ల, ఒకానొక సోమవారం న భ్ర, బావమరిది, ఇంకొక బావగారు, చెల్లి తో కొండ కి మలచిన కొత్త దారి లో వెళ్ళాం. అభిషేకం చేసుకునే భాగ్యం కూడా కలిగింది. తొలి ఏకాదశి నాడు తప్పకుండా రావాలి అని ఆ రోజే నిశ్చయం చేసుకున్నా.
ఇవ్వాళ దశమి,రేపు ఏకాదశి. ప్రస్తుతం బస్ లో వినుకొండ కే వెళ్తున్నా, వినుకొండ పండగ - మీ జ్ఞాపకాలు చదువుతుంటే, మా వినుకొండ అనే భావన కలిగించేలా ఉంది.
ఇంకా విష్ణుకుండినులు పాలించారు అనే ఒక కొత్త విషయం తెలిసింది. అందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
నా ఈ భాగ్యానికి, కొండ మీది రామలింగయ్య కి శతకోటి వందనాలు.
🪷👣🪷
😊😊😊
🙏🙏🙏
|| అఉమ్ నమః శివాయ ||
థాంక్యూ వెరీ మచ్ సర్, వెల్కమ్ టూ వినుకొండ. ఈ ఏడాది అఖండ జ్యోతి ఏర్పాటు, ఘాట్ రోడ్ , ప్రభుత్వ అధ్వర్యంలో పండుగ జరగడం ఇంకా సంతోషం..
తొలగించండి