జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
విప్లవ చిత్రంలో ఎర్రటి రక్తం కనిపించాలి కానీ, కృష్ణశాస్త్రి పాట వినిపించడమేంటి ? ఎక్కడో పండువెన్నెల్లో, పారే సెలయేటి ఒడ్డున, ఊహాప్రేయసి ఊర్వశి ఊహల్లో తరించే కృష్ణశాస్త్రికి గెరిల్లా పోరాటంతో పనేంటి ? ఊపిరికీ, ఊపిరికీ మధ్య, ఊపిరిసలపని నక్సల్బరీ పోరాటంలో..." ఏల నా హృదయమ్ము ప్రేమించు నిన్ను " అంటూ కృష్ణశాస్త్రి కవిత్వం కనిపించడమేంటి ? ఎక్కడి కార్ల్ మార్క్స్, ఎక్కడి కృష్ణశాస్త్రి ? ఎక్కడి మావో, ఎక్కడి ఆంధ్రా షెల్లి ? ఒకరు విప్లవోద్యమ సృష్టికర్తలైతే మరొకరు భావకవిత్వ పితామహులు. వీరిద్దరినీ కలిపి తెలుగు తెర మీద ఓ చోట కూర్చుండబెట్టడమంటేనే ఊహకందని అసాధ్యం. అలాంటి ఊహాతీత ప్రయోగం చేయాలంటేనే ఎంతో సాహసం, దైర్యం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇలాంటి ఓ సరికొత్త ప్రయోగాన్నే విరాటపర్వం సినిమా ద్వారా యువ దర్శకుడు వేణు ఊడుగుల చేశాడు. నలభై ఏళ్ళు కుడా నిండని ఈ యువ దర్శకుడు వేణు ఇప్పుడు తెలుగు తెరకు చిక్కిన రత్నం.
దట్టమైన అడవి. ఓ పక్కన పోలీసులు. మరో పక్కన నక్సలైట్లు. ఎటు చూసినా తుపాకుల మోత. భీకర యుద్ధం. నేలకొరుగుతున్న ప్రాణాలు.. ఇలాంటి సన్నివేశం మధ్యన వినిపించే... " దారులన్నియు మూసె దశదిశలు ముంచెత్తే ; నీరంధ్ర భయదాంధకారజీమూతాళి ; ప్రేయసీ.. ప్రేయసీ..! వెడలిపోయితి వేల ఆ యగమ్య తమస్వినీ గర్భకుహారాల." అంటూ వినిపించే కృష్ణ శాస్త్రి పాట అత్యున్నత సాహిత్యాభిలాషకు నిదర్శనం. "జీవితంలో ఏ అనుభవం ఎదురైనా స్వాగతించు. ప్రతి అనుభవము మీ ఇంట్లో అడుగుపెట్టే అతిథి లాంటిదే.." ఓ సందర్భంలో సూఫీ కవి రూమి కవిత, మరో సందర్భంలో శేషప్ప పద్యం, కార్ల్ మాక్స్, దోస్తోవ్‌స్కీ కొటేషన్స్. విరాటపర్వం సినిమా కోసం సాంకేతికంగా ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో సాహిత్య పరంగానూ అత్యున్నత విలువలను పాటించడం వేణు సాహిత్యాభిలాషకు నిదర్శనం. అందుకే విరాటపర్వంలో మంచి సాహిత్యం కనిపిస్తుంది. శ్రీ శ్రీ రాసిన " మరో ప్రపంచం.. మరో ప్రపంచం.. మరో ప్రపంచం పిలిచింది " కవిత తెలీని వారుండరు. శ్రీ శ్రీ తరువాత అంతటి భావావేశంతో, మరో ప్రపంచం కవితకు అతి దగ్గర బాణీలో డా. జిలకర శ్రీనివాస్ విరాట పర్వం కోసం ఓ పాట రాసాడు. " కులాల మతాల ఎల్లలు చెరిపే నవీన లోకం తెద్దామా.. చలో.. చలో.. పరిగెత్తు. అదిగో చూడు.. పాణిగ్రాహి పార్థివదేహం పాడిన ప్రచండగేయ ప్రకాశం చూడు.. " అనే వారియర్స్ పాట వింటున్నప్పుడు నరాలు ఉప్పొంగుతాయి. ఈ పాట రాసిన డా. జిలకర శ్రీనివాస్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ, పీడీఎఫ్ చేసిన బహుజన తాత్వికుడు. ఇలాంటి గొప్ప బహుజన మేధావిని తెలుగు తెరకు పరిచయం చేయడం గొప్ప విషయం. సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత, బహుజన మేధావి, తెలుగు సాహిత్యంలో సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పీడీఎఫ్ చేసిన పసునూరి రవీందర్ ఈ సినిమా కోసం ఓ పాట రాసినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఉపయోగించలేక పోయినట్టు వేణు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మిత్ర, మిట్టపల్లి సురేందర్, ద్యావరి నరేందర్ రెడ్డి, శనపతి భరద్వాజ్ పాత్రుడు వంటి గొప్ప రచయితలు విరాటపర్వంలో కనిపిస్తారు. వీటన్నిటికీ మించి సురేష్ బొబ్బిలి సంగీతం అద్బుతం. నిన్న మొన్నటి వరకు అణగారిన జీవిత కథలను వాస్తవ రూపంలో చూడాలనుకునే తెలుగు సినీ ప్రేక్షకులు తమిళ తెరవైపు ఆశగా చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ లోటు వేణు ద్వారా తీరుతుందేమో చూడాలి. సినిమా అనే ప్రక్రియ ద్వారా అణగారిన కథలు, వాస్తవ జీవితాలు, అభ్యుదయ ప్రజా ఉద్యమాలు, సాహిత్య భావజాల వ్యాప్తి జరగాలని కోరుకుంటున్న నేటి తరం సినీ ప్రేక్షకులకు ఇప్పుడు వేణు ఓ ఆశా కిరణం.
- శిఖా సునీల్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి