జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

సెప్టెంబర్ లో జన్మించిన తొమ్మిది మంది తెలుగు మహాకవులు

తెలుగు సాహిత్య చరిత్రలో సెప్టెంబర్ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆధునిక సాహిత్యానికి వన్నెలద్దిన తొమ్మిది మంది ప్రముఖ తెలుగు కవులు ఇదే మాసంలో జన్మించడం ఓ విశిష్టత. ఈ తొమ్మిది మంది కవులూ సాహిత్య చరిత్రలో తిరుగులేని స్థానాన్ని అలంకరించడం మరో ప్రత్యేకత. ఈ తొమ్మిది మంది తెలుగు కవులూ మహాకవులుగా కొనియాడబడ్డారు. 19వ శతాబ్దం ప్రథమార్థం వరకూ ఉన్న సాహిత్యానికి భిన్నంగా, నూతన ప్రక్రియలను సృజిస్తూ, సాహిత్య పరమార్ధాన్ని చాటి చెబుతూ, సమాజ హితాన్ని కోరుకున్న అభ్యుదయ కవులు కొందరైతే, సాంప్రదాయవాదాన్ని కొనసాగిస్తూ, సంస్కృతిని ప్రతిబింబిస్తూ, తేనెలూరే తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిన కవులు మరికొందరు. సాంఘిక దురాచార నిరసన, భాషా, సాహిత్యంలో రావలసిన మార్పులను ఆకాంక్షించిన గురజాడ అప్పారావు, తెలుగు సాహిత్యంలో ప్రముఖ నాటక కర్తగా స్థానం పొందిన చిలకమర్తి లక్ష్మీ నరసింహంలు సెప్టెంబర్ మాసంలోనే జన్మించారు. అలాగే, నాటి సమాజంలో పాతుకుపోయినకు వర్ణవివక్షపై యుద్ధాన్ని ప్రకటించిన విశ్వనరుడు గుర్రం జాషువా, బోయి భీమన్న, దేశము పట్టనంతటి మహాకవి విశ్వనాథ సత్యనారాయణ, మనోవిజ్ఞానిక నవలా సాహిత్యాన్ని అందించిన తాత్విక కథకుడు త్రిపురనేని గోపీచంద్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు, ప్రముఖ పేరడీకవిగా గుర్తింపు పొందిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి సెప్టెంబర్ మాసంలోనే జన్మించారు.

1. గురజాడ వెంకట అప్పారావు (1862 - 1915 )

" మతములన్నియు మాసిపోవును

జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును "

నవయుగ వైతాళికుడు గురజాడ వెంకట అప్పారావు సెప్టెంబర్ 21న ఎలమంచిలి తాలూకా రాయవరంలో జన్మించారు. విజయనగరం మహారాజా వారి హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆనాటి సాంఘిక పరిస్థితులు గురజాడ అప్పారావును ఆలోచింప చేశాయి. నాటి సాంఘిక దురాచారాలను నిరసిస్తూ గురజాడ చేసిన రచనలు తెలుగు సాహిత్యంలో అజరామరమైనవి. ఆయన రాసిన ' కన్యాశుల్కం ' నాటకం తెలియని తెలుగు వారు ఉండరు. గురజాడ రచనల్లో వ్యవహారిక భాషోద్యమం కనిపిస్తుంది. దిద్దుబాటు కథతో ఆధునిక సాహిత్యంలో కథానిక ప్రక్రియకు శ్రీకారం చుట్టిన మహాకవి గురజాడ. ముత్యాల సరాలు చందస్సులో ఆయన రాసిన కాసులు, కన్యక, లవణరాజు కల, పూర్ణమ్మ, దేశభక్తి మొదలైనవి తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయమైనవి. గిడుగు రామమూర్తి అన్నట్టు.."  నేటికీ, ఎప్పటికీ నవయుగ వైతాళికుడై గురజాడ బతికే ఉంటాడు. "

2. చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867 1946 )


" భరత ఖండంబు చక్కని పాడియావు

హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ

 తెల్లవారను గడుసరి గొల్లవారు

పితుకుచున్నారు మూతులు బిగియగట్టి "

తెలుగు సాహిత్యంలో నాటక కర్తగా ప్రముఖ స్థానాన్ని అందుకున్న చిలకమర్తి లక్ష్మీనరసింహం సెప్టెంబర్ 26న పశ్చిమగోదావరి జిల్లా ఎడవల్లి మండలం ఖండవల్లి గ్రామంలో జన్మించారు. రాజమండ్రి ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. చిలకమర్తి రాసిన గయోపాఖ్యానం నాటకం తెలుగు పౌరాణిక పద్య నాటక ప్రియులను రంజింపజేసింది. చిలకమర్తి రాసిన పదకొండు పద్య నాటకాలూ ప్రముఖమైనవే. పద్య సాహిత్యమే కాకుండా నవలా ప్రక్రియను కూడా బాగా ప్రచారంలోకి తెచ్చాడు చిలకమర్తి. ఆయన రాసిన సాంఘిక నవల ' గణపతి ' సాహిత్య ప్రియులందరికి సుపరిచితమే. ఆధునిక సాహిత్య చరిత్రలో అగ్రస్థానాన్ని అందుకున్న కళాప్రపూర్ణుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు.

3. తాపీ ధర్మారావు (1887 - 1973)

" అది నా తత్వంలో ఉన్న లోపమో, చదువులో ఉన్న దోషమో, శిక్షణలో ఉన్న కొరతో తెలియదు. దీని అర్థం ఏమిటి? ఇది ఎందుకిలాగుంది ? అది లేకపోతేనో ? ఇలాంటి ప్రశ్నలు వేల వేలు పుడుతూనే ఉంటాయి. అది సాహిత్యం కానీయండి, గణిత శాస్త్రం కానీయండి, రాజ్యాంగ విషయం కానీయండి పుడుతుంది. ఏదో ప్రశ్న. కొంటెతనంవల్ల కాదు. ఒకరిని అడుగుదామన్న ఉద్దేశంతో కాదు. మరేమో చేద్దామని కాదు. సంగతేమిటో తెలియాలనీ, తెలుసుకుందామనీ అంతే, "అదే నాకు మంచి చేసింది. అదే నన్ను పాడుచేసింది కూడా " అంటారు తాపీ ధర్మారావు.

తాపీ ధర్మారావు గొప్ప రచయిత, భాషా పండితుడు, హేతువాది నాస్తికుడు. ఆయన 1887 సెప్టెంబర్ 19న బరంపురంలో జన్మించాడు. ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు చదువుకోని ఉన్నత చదువులకు మద్రాసు వెళ్ళాడు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త  గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం. కల్లికోట రాజావారి కళాశాలలో తాపీ ధర్మారావు గణిత ఉపాధ్యాయులుగా పనిచేశాడు. 1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ధర్మారావు తొలి రచన 1911లో 'ఆంధ్రులకొక మనవి' అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. కొండెగాడు, జనవాణి, కాగడా మొదలైన పత్రికలు తాపీ ధర్మారావు ప్రతిభకు నిదర్శనం. ఈయన మాలపిల్ల, రైతుబిడ్డ మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు.1973 మే 8న మరణించాడు.

4. గుర్రం జాషువా ( 1895 - 1971 )


" నిఖిలలోకమెట్లు నిర్ణయించిన నాకు 

తిరుగులేదు విశ్వనరుడు నేను "

అంటూ ధైర్యంగా చెప్పుకున్న నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా సెప్టెంబర్ 28న పల్నాడు జిల్లా వినుకొండలో జన్మించారు. గుర్రం జాషువా చిన్నతనం నుంచే వర్ణ వివక్షను ఎదుర్కొని జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. అందుకే జాషువా తన కవిత్వాన్ని ఓ కత్తిగా చేపట్టాడు." నా కత్తి కవిత. నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపై మాత్రమే ద్వేషం" అని జాషువా చెబుతారు. జాషువా రచనల్లో ఖండాకావ్యాలు ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. దళిత వేదనకు ప్రతీకగా నిలిచిన గబ్బిలం కావ్యం జాషువా రచనలన్నిటిలో గొప్పగా నిలిచింది. మరణం లేని మానవత్వాన్ని ఆకాంక్షించిన జాషువా తెలుగు సాహిత్యంలో విశ్వనరుడిగా నిలిచిపోయాడు.

5. విశ్వనాథ సత్యనారాయణ (1895 - 1976 )


" అల నన్నయకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశం.. " 

అంటూ ఆత్మవిశ్వాసంతో అభివ్యక్తీకరించిన మహాకవి విశ్వనాథ సత్యనారాయణ. ఆయన సెప్టెంబరు 10న కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలో ఉన్న నందమూరు గ్రామంలో జన్మించారు. బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశారు. విశ్వనాథ గురించి " దేశము పట్టనంతటి మహాకవి " అనడం  తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం. సాంప్రదాయవాదిగా ముద్రపడినప్పటికీ ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియల్లో విశ్వనాథ సృజించని ప్రక్రియ లేదు. విశ్వనాథ సాహిత్యం ఆధునిక యుగ లక్షణాలన్నీ సంతరించుకుంది. ఒకటా, రెండా.. 25 కావ్యాలు, 6 శతకాలు,13 గేయ కావ్యాలు, 15 నాటకాలు, 88 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శనా గ్రంధాలు, కథలు, పద్యాలు, పాటలు...ఇలా ఆయన జీవితాంతం సాహిత్య వ్యాసంగంలోనే గడిపారు. అందుకే తెలుగునాట తొలి జ్ఞానపీఠ అవార్డు ఆయన్నే వెతుక్కుంటూ వచ్చి వరించింది. విశ్వనాథ సత్యనారాయణ ఆధునిక యుగంలో సాహితీ చైతన్యమూర్తి, శ్రీనాధుడంతటి గొప్పవాడు.

6. బోయి భీమన్న ( 1911 - 2005 ) :


" బానిసతనమును – బాపుమురా

భారతభూమికి – భాగ్యము తేరా

సకల దేశముల – సర్వమానవుల

సామ్యము – సాధింపుమురా "

సామాజిక చైతన్యాన్ని ఆశించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి బోయి భీమన్న. గుర్రం జాషువా కన్నా పదహారేళ్ల చిన్నవాడైన బోయి భీమన్న, కవిత్వంలో జాషువాను తన గురువుగా చెప్పుకున్నాడు. 1911 సెప్టెంబర్ 19న తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలోని ఓ హరిజన కుటుంబంలో బోయి భీమన్న జన్మించారు. తల్లిదండ్రులు నాగమ్మ, పుల్లయ్య. 1937 నాటికే బి.ఏ., బి.ఈడి. పూర్తి చేసిన భీమన్న ఉపాధ్యాయ ఉద్యోగంతో జీవితం ప్రారంభించాడు. పద్య, గేయ, వచన రచనతో పాటూ, నాటకాలు కలిపి సుమారు 70 పుస్తకాలను రాశారు. భీమన్న రాసిన పాలేరు నాటకం అప్పట్లో పెద్ద సంచలనం. 25 వేల కాపీలు ముద్రణతో లక్ష ప్రదర్శనలతో పాలేరు నాటకం ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపింది. కేంద్ర సాహిత్య అకాడమీ, పద్మభూషణ్ వంటి ఎన్నో అవార్డులు అందుకున్న 2005 డిసెంబర్ 16న కన్నుమూశాడు.

7. కాళోజి నారాయణరావు (1914 - 2002 )


" పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె

మాయ మోసము జూచి మండిపొవును ఒళ్ళు

పతిత మానవు జూచి చితికి పోవును మనసు

ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?..."

అంటూ మానవత్వాన్ని అద్ది కవిత్వాన్ని అందించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. ఆయన సెప్టెంబర్ 9న కర్ణాటక బీజాపూర్ లోని రిట్టిహళ్లిలో జన్మించారు. హైదరాబాదులో న్యాయవిద్య పూర్తి చేసుకున్న కాళోజీ నారాయణరావు ప్రజా ఉద్యమాల వైపు దృష్టి మరల్చారు. నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టాడు. " మనిషి బతుకు బతుకుతాను. నా మనసుకు నచ్చినట్లు మాట్లాడతా. రాస్తా. ప్రకటిస్తా.. " అంటూ నిర్భయంగా తన అభిప్రాయాన్ని ప్రకటించిన ధీరుడు కాళోజీ నారాయణరావు. ఆయన అభ్యుదయవాది, మానవతావాది, అంతకు మించిన తాత్విక భావాలు కలిగిన గొప్ప మేధావి." పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది.." అంటూ బతికినంత కాలం ప్రజల పక్షాన నిలబడిన ప్రజాకవి, కాళోజీ నారాయణరావు.

8. త్రిపురనేని గోపీచంద్ ( 1910 - 1962 )


రచయిత, దర్శకుడు, హేతువాది, అభ్యుదయవాది త్రిపురనేని గోపీచంద్ సెప్టెంబర్ 9న కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు సమీపంలోని అంగలూరులో జన్మించాడు. తెనాలిలో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ అందులో ఆసక్తి కనపరచలేక సినీరంగ ప్రవేశం చేశారు. కొన్ని సినిమాలకు దర్శకుడిగా, మాటల రచయితగా పనిచేశారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో గోపీచంద్ ఎన్నో చిరస్మరణీయ నవలలు, కథలు రాశారు. గోపీచంద్ రాసిన 11 నవలల్లో పరిచయం అక్కర్లేని నవల ' అసమర్ధుని జీవిత యాత్ర '. ఆధునిక తెలుగు సాహిత్యంలో తొలి మనోవైజ్ఞానిక నవల అసమర్ధుని జీవిత యాత్ర. గోపీచంద్ కథలన్నీ గొప్పవి. గోపీచంద్ తండ్రి త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రముఖ నాస్తికుడు. ఆయన నుంచి అబ్బిన ' ప్రశ్నించే తత్వం ' గోపీచంద్ రచనలపై స్పష్టంగా కనిపిస్తుంది. గోపీచంద్ కథలు, నవలలు ఇప్పటికీ.. ఎప్పటికీ.. తెలుగు పాఠకులకు జీవిత పాఠాలు నేర్పుతూనే ఉంటాయి.

9. జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి (1914 -1968 )


ఆధునిక తెలుగు సాహిత్యంలో పేరడీ శాస్త్రిగా సుపరిచితులైన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి సెప్టెంబర్ 7న బందరులో జన్మించాడు. తెలుగు ఉపాధ్యాయుడిగా, జర్నలిస్టుగా పలు ఉద్యోగాలు చేశాడు. జరుక్ శాస్త్రిది ఎందులోనూ నిలకడలేని వ్యక్తిత్వం. అయినా స్వతంత్ర భావాలు ఉన్న గొప్ప వ్యక్తిగా అందరి మన్ననలు పొందాడు. జరుక్ శాస్త్రి కలం నుంచి ఆనాటి ప్రముఖ కవులందరి రచనలు పేరడీలు అయ్యాయి. తెలుగు సాహిత్యంలో పేరడీ రచనకు ప్రత్యేక స్థానాన్ని కల్పించిన జరుక్ శాస్త్రి పేరడీ పితామహుడుగా పేరు పొందారు.

-----------------------------------

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్