జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

ఫాదర్ ఫర్గెట్స్

అమెరికన్ రచయిత డబ్ల్యూ. లివింగ్ స్టన్ లార్నెడ్ రాసిన చిన్న వ్యాసం "ఫాదర్ ఫర్గెట్స్". అత్యంత ప్రభావవంతమైన ఈ చిన్న వ్యాసం ఎన్నో ఏళ్ల నుంచి పునర్ముద్రితమవుతూనే ఉంది. మొదటిసారిగా పీపుల్స్ హోమ్ జర్నల్ లో సంపాదకీయంగా ఈ వ్యాసం అచ్చయింది. ఆ తర్వాత ఇది ఎన్నో పత్రికల్లో మళ్లీమళ్లీ అచ్చవుతూనే ఉంది. ఎన్నో పాఠశాలలు, చర్చిలు, కళాశాలల్లోని కార్యక్రమాల్లో ఇది చదివి వినిపించబడింది. ఇప్పటికీ, ఎప్పటికీ దీని అవసరం ఉంది. ఓ తండ్రి పశ్చాత్తాప భావన కళ్ళకు కట్టినట్లు రాసిన ఈ వ్యాసం ఎంతో గొప్పది. ఈ వ్యాసం గురించి రచయిత డబ్ల్యూ. లివింగ్ స్టన్ లార్నెడ్ ఇలా చెప్తాడు.. "కొన్నిసార్లు ఒక చిన్న ప్రయత్నమే ఆశ్చర్యకరంగా ఫలిస్తుంది. ఇది అదే చేసింది"


                           ఫాదర్ ఫర్గెట్స్

                 - డబ్ల్యూ. లివింగ్ స్టన్ లార్నెడ్


విను, బాబూ: నీవు గదిలో గడ్డం క్రింద నీ చిన్ని చేతులు పెట్టుకొని తడిసిన నీ నుదుటి పైన ముంగురులు అతుక్కొని ఉండగా నిద్రపోతున్నప్పుడు నీకు కొన్ని విషయాలు చెబుతున్నాను. కొద్ది నిమిషాల క్రితం గ్రంధాలయములో పేపరు చదువుతూ కూర్చున్నప్పుడు ఒక విధమైన పశ్చాత్తాపము అలలాగా నా హృదయంలో ప్రవేశించినది. తప్పు చేశానన్న భావనతో నీ మంచం ప్రక్కన నిలబడ్డాను.

నేను వీటి గురించి ఆలోచించాను, నేను నిన్ను చాలా విషయాలలో కోప్పడ్డాను. నీవు స్కూలుకు వెళుతూ సరిగా ముఖం కడుక్కోలేదని తిట్టాను. నీ బూట్లు సరిగా శుభ్రం చేసుకోలేదని నిందించాను. నీవు నేల మీద కొన్ని వస్తువులు చిందర వందరగా పడేశావని కోపగించుకున్నాను.

నీవు అన్నం తినేటప్పుడు నమలకుండా మింగేశావని నిన్ను తప్పు పట్టాను. డైనింగ్ టేబుల్ పై నీ భుజాలు ఆనించావని, బ్రెడ్ పైన వెన్న ఎక్కువ వేసుకొన్నావని, నిన్ను నేను నిందించాను. కానీ నువ్వు ఆడుకోవడానికి, నేను రైలు ఎక్కడానికి వెళుతుంటే, నీవు వెనక్కి తిరిగి చెయ్యి ఊపుతూ నాకు "గుడ్ బై నాన్నా!” అని చెప్పావు. అప్పుడు కూడా నిన్ను నేను, "వెనక్కి వెళ్ళు" అని కసురుకున్నాను.

సాయంత్రం మళ్ళీ ఇదంతా మొదలైంది. రోడ్డు మీదికొచ్చి, నీవు మోకాళ్ళ మీద కూర్చొని  గోలీలు ఆడుతున్నప్పుడు నీ మేజోళ్ళలో కన్నాలు కనిపించాయి. అప్పుడు నిన్ను నీ స్నేహితుల మందు అవమానిస్తూ నిన్ను నా ముందు నడిపిస్తూ ఇంటికి తీసుకొచ్చేశాను. మేజోళ్ళు ఖరీదైనవి. నువ్వే వాటిని కొనుక్కోవాల్సి వస్తే వాటిని మరింత జాగ్రత్తగా వాడేవాడివి ! ఒక తండ్రి నుంచి ఆ విషయాన్ని ఊహించు,నాన్నా!

నీకు గుర్తుందా? తరువాత నేను పేపరు చదువుతూ లైబ్రరీలో ఉన్నప్పుడు భయంగా నా దగ్గరికి వచ్చి నిలబడ్డావు. అప్పుడు కూడా, "ఎందుకు వచ్చావ" ని గట్టిగా అరిచాను.

నీవు ఏమి చెప్పకుండా నా దగ్గరకి వచ్చి నా మెడ చుట్టూ చేతులు వేసి నన్ను ముద్దు పెట్టుకున్నావు. నీ చేతులు నన్ను గట్టిగా చుట్టేసినపుడు దేవుడిచ్చిన ప్రేమను నాపై కురిపించావు. నేను చేసినవన్నీ మరిచిపోయి నీ దారిన నీవు మెట్లెక్కి నీ గదిలోకి వెళ్ళావు.

నీవు వెళ్ళిన తరువాత నా చేతిలో నుండి పేపరు జారిపడి ఒక విధమైన భయం నన్ను ఆవరించింది. ఇన్నాళ్ళ నుండి నాలో ఉన్న ఈ అలవాటు ఏమిటి? తప్పులు చేస్తున్నావని నిందలు, విమర్శలు చేసే అలవాటు. నీవు చిన్న పిల్లవాడివిగా ఉన్నందుకు నేను నీకు ఇచ్చిన బహుమానం విమర్శ. అలా అని నీ మీద ప్రేమ లేక కాదు. నీ గురించి ఎక్కువగా ఊహించుకోవడం, నా అనుభవాల కొలబద్ద ద్వారా నిన్ను అంచనా వేయడం అనేది ఇన్ని సంవత్సరాల నుండి జరుగుతున్నది. 

మంచివి, సత్యమైనవి, గొప్పవి అయిన లక్షణాలు నీలో ఉన్నాయి. నీ చిన్ని హృదయం గొప్ప పర్వతాల మధ్య ఉదయిస్తున్న సూర్యోదయమంత విశాలమైనది. నీవు నా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడే నీ గొప్పతనం నిష్కల్మషమైన ప్రేమ ప్రకటితమైనది. ఈ రాత్రి ఇంకా ఏది నాకు ముఖ్యం కాదు. అందుకే నీ దగ్గరకి వచ్చి సిగ్గు పడుతూ పాదాక్రాంతుడనైనాను.

నాలోని ఈ మార్పు ఎటువంటి వత్తిడి లేని ప్రాయశ్చిత్తం లాంటిది. ఈ వయస్సులో నీకు ఈ విషయం చెప్పినా అర్ధం కాదు. రేపటి నుండి నేను నీకు నిజమైన తండ్రిలాగా ఉంటాను. నీ స్నేహితుడిగా నీవు బాధపడితే బాధపడుతాను. నవ్వినప్పుడు నవ్వుతాను. నా నోటి నుండి తప్పు మాటలు వచ్చినప్పుడు నన్ను నేను నిందించుకుంటాను. నాకు నేను ఈ విధంగా చెప్పుకుంటాను. "నా కుమారుడు ఒక బాలుడు, కేవలం చిన్న పిల్లవాడు మాత్రమే!" 

నిన్ను పెద్దవాడిగా ఊహించుకున్నానేమో. అయినా ఇప్పుడు నిన్ను నీ మంచంలో ముడుచుకొని, అలసిపోయి ఉండటం చూస్తున్నాను, నాన్నా, నీవు ఇంకా బిడ్డవే, నిన్ననే నీవు నీ తలను అమ్మ భుజం మీద పెట్టుకొని ఆమె చేతుల్లో ఉన్నావు. నేను నీ నుంచి మరీ ఎక్కువగా ఆశించాను, మరీ ఎక్కువగా.


( డేల్ కార్నేగీ రాసిన How to Win Friends and Influence People పుస్తకం నుంచి సేకరించినది )

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్