జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

పడి లేచిన కెరటం.. సలీం

ఇది ఓ విజేత జీవిత చరిత్ర. 1960లో ప్రారంభమైన ఈ విజేత జీవిత ప్రయాణం నేటికీ కొనసాగుతూనే ఉంది. 'పడిలేచే కెరటం' నవలలోని  కథాంశం నిజ జీవితం చుట్టూ అల్లుకున్న అందమైన సంఘటనల సమాహారం. జీవితం కథలా ఉండటం ఎంత గొప్ప విషయం. ఎన్ని వడిదుడుకులు, ఎన్ని ఎత్తుపల్లాలు, పడుతూ, లేస్తూ, జీవితానికి కావలసినన్ని జ్ఞాపకాలను మూటగట్టుకోవడం ఎంత గొప్ప విషయం. ఈ నవలలోని కథానాయకుడు సాగర్ జీవితం కూడా అంతే. నిరాశపరిచే తన జీవితాన్ని చుసి కృంగి పోకుండా, తాను ఎలా ఉండాలని కలలు కన్నాడో అది సాధించి శిఖరాగ్రాన గెలుపు జెండా ఎగరేశాడు. తాను గెలవడమే కాకుండా నిరాశలో ఉన్నవారు ఎలా గెలవచ్చో దారి చూపాడు. సముద్రమంత సమస్యలు చుట్టుముట్టినా.. పడుతూ, లేస్తూ, పడిలేచిన కెరటంలా విజయాన్ని ముద్దాడిన సాగర్ జీవితం నేటి సమాజానికి అవసరం. ఈ నవల చివరిలో.. కథా నాయకుడు సాగర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సయ్యద్ సలీం ఒక్కడేనని, ఇది సలీం జీవిత చరిత్ర అని తెలుసుకున్నప్పుడు మన ఆశ్చర్యానికి అంతుండదు. అందుకే, ఈ కథ చదవాల్సిన కథ. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజ జీవిత చరిత్ర.


కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సయ్యద్ సలీం రచించిన నవల ' పడి లేచే కెరటం '. ఇది స్వయానా రచయిత జీవిత చరిత్ర. తన జీవిత చరిత్రనే అత్యద్భుతంగా నవలగా రచించడం ఓ నూతన ప్రక్రియ. సలీం పేరు ఈ నవలలో సాగర్. ఒంగోలు దగ్గర త్రోవగుంటలో పుట్టిన సాగర్ అందరిలాంటి వాడేం కాడు. అందరిలాంటి వాడైతే ఇంత గొప్ప నవలలో కథానాయకుడు ఎలా అవుతాడు.

1960 ప్రాంతంలో ఒంగోలు దగ్గర త్రోవగుంటలో ఓ నిరుపేద కుటుంబంలో సాగర్ జన్మిస్తాడు. తల్లిదండ్రులు ఇద్దరూ రోజువారి కూలీలే. ముగ్గురు సంతానంలో సాగర్ రెండో వాడు. చిన్నప్పుడు వరి అన్న వండితే వాళ్ళింట్లో పండగ జరిగినట్టు గుర్తు. చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండే సాగర్, ప్రాథమిక పాఠశాలలో చేరటానికి కూడా పట్టు పట్టి మరి తల్లిదండ్రులను ఒప్పించి స్కూలు మెట్లెక్కుతాడు. ఇక అక్కడి నుంచి చదువులో, మార్కుల్లో ముందే. కానీ, మనసులో ఎప్పుడూ ఏదో తెలీనీ వెలితి, బాధ. తనని ఎప్పుడూ వెంటాడే ఆత్మన్యూణ్యత. తనని బాధించే తన తోటి పిల్లల్ని చూసి ఏమీ చేయలేని నిస్సహాయత. ఓ పక్క కటిక పేదరికం, మరో పక్క తోటి పిల్లల అవమానాలు.. ఈ రెండిటి అంతర్మథనంలోనే 10వ తరగతి పరీక్షలు రాసి ఒంగోలు జిల్లా ఫస్ట్ వస్తాడు సాగర్. ఇది తిరుగులేని విజయం. ఈ విజయం సాగర్ లో కొత్త ఆలోచనలను కలిగిస్తుంది. ఈ విజయం అతని భాధని మాయం చేస్తుంది. ఆనాడే ఓ నిర్ణయానికి వస్తాడు. సమస్యలన్నిటికీ పరిష్కారం చదువేనని, అందుకే ఉన్నతమైన చదువు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సాగర్ నిర్ణయించుకుంటాడు.

చదవాలన్న పట్టుదల, కోరిక ఉంటే సరిపోదు. దానికి తగ్గ వనరులు కూడా కావాలి కదా. అవేమీ సాగర్ కి అందుబాటులో లేవు. ఓ పక్క వెంటాడే కటిక దరిద్రం, మరో పక్క చదువుకోవాలన్న కోరిక. ఈ రెండిటి సంఘర్షణ మధ్యనే సాగర్ ఒంగోలులోని శర్మ కళాశాలలో ఇంటర్ లో చేరిపోతాడు. పదో తరగతిలో ఉన్నప్పుడే సాగర్ జీవితంలో గొప్ప మలుపు తిరిగే సంఘటన జరుగుతుంది. దేవతలు భూమి మీదే ఉంటారంటారు కదా.. అలానే సాగర్ కి ఓ దేవత లాంటి అక్క పరిచయం అవుతుంది. ఆమె పేరు సత్యవతి. ఆమె ప్రోత్సాహం, ఆర్థిక సాయంతో పదో తరగతి, ఇంటర్మీడియట్ లో మంచి మార్కులతో పాస్ అవుతాడు సాగర్. తరువాత కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ లో సీటు సంపాదిస్తారు. ఆ రోజుల్లో సిల్వర్ జూబ్లీ కళాశాలలో సీటు రావడం మామూలు విషయమేమీ కాదు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆ కళాశాలలో చదవడమే గొప్ప విషయం. అలా తన లక్ష్యం వైపు బాటలు వేసుకున్న సాగర్ కి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చదివి సైంటిస్ట్ కావాలనేది కోరిక. కానీ తనని అన్ని విధాల ప్రోత్సహించిన సత్యవతి అక్క దూరమవడం, మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ సీటు వచ్చినా ఫీజు కట్టలేని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో సాగర్ ఏం చేశాడు ? ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ చదివాడా ? తను అనుకున్నట్టు సైంటిస్ట్ అయ్యాడా ? ఉన్నతమైన    ప్రభుత్వ ఉద్యోగం ఎలా సంపాదించాడు ?... ఇవన్నీ మనం నవల చదివి తెలుసుకోవాల్సిందే.

తెలుగు సాహిత్యంలో నిలిచిపోయే స్ఫూర్తిదాయకమైన గొప్ప నవల ' పడి లేచే కెరటం '. ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకమైన రచయితలుగా పేరుపడ్డ జేమ్స్ అల్లెన్, డేల్ కార్నెగీ, రాబిన్ శర్మ వంటి రచయితల పుస్తకాలు చదివితే మన ఆలోచనల్లో గొప్ప మార్పు వస్తుందని గమనిస్తాం. అదే కోవలో ' పడి లేచే కెరటం ' నవల కూడా చేరిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే పడి లేచే కెరటం నవలలోని కథానాయకుడు సాగర్, నిజ జీవితంలోని సలీం కటిక పేదరికంతోనే కాదు, శారీరక వైకల్యంతో కూడా పోరాడాడు. వైకల్యం శరీరానికి ఉంటే పెద్దగా బాధపడాల్సిన పనేమీ ఉండదు. కానీ మనసుకి, ఆలోచనలకి వైకల్యం ఉంటే సమాజానికి మంచిది కాదు. ఇదే విషయాన్ని సలీం తనదైన గొప్ప శైలిలో నవల ఆశాంతం వివరిస్తాడు. సలీం శైలి వినూత్నంగా ఉంటుంది. చిన్న చిన్న పదాలు, సులభంగా అర్థమయ్యే సంభాషణలు, మనం రోజూ మాట్లాడుకునే మాటలు, మనం కూడా కథలోని పాత్రలుగా భావించేటట్టు చేసే సంఘటనలు.. అన్నీ కలిపి నవల ఆసాంతం అత్యద్భుతంగా ఉంటుంది. కెరటాల మీద కూర్చోబెట్టి సలీం మనల్ని అలా.. అలా.. సముద్రయానం చేయించినట్టు.. అందంగా ఈ నవల సాగిపోతుంది.

 - వి. పద్మ, తెలుగు ఉపాధ్యాయురాలు, వినుకొండ.

-----------------------------------------

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్