జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
గబ్బిలం ముద్రితమై ఎనభై ఏళ్ళు గడిచిపోయాయి. ఆనాటి తెలుగు సాహిత్య లోకంలో గబ్బిలం కావ్యం ఓ విప్లాత్మకమైన రచన. అప్పటి వరకూ నడుస్తున్న సాంప్రదాయానికి భిన్నంగా ' మందభాగ్యుడైన ఓ హరిజనుడు ' గబ్బిలం కావ్యంలో కథానాయకుడు కావడం విశేషం. అంటరానితనం, అసమానతలు, ఆకలి భాధలే కావ్య కథా వస్తువు. అందుకే అప్పట్లో గబ్బిలం కావ్యం చర్చనీయాంశం. సాహసోపేతమైన, నూతన ప్రక్రియా కావ్యాలు రచించి వెలువరించడానికి నాటి కాలంలో ధైర్యం కావాలి. మహాకవి గుర్రం జాషువాలో ఆ ధైర్యం మెండుగా ఉంది. అందుకే, నాటి సంప్రదాయ వాదాన్ని ధిక్కరించి గబ్బిలం రచించాడు. అందుకే, వినుకొండ లాంటి మారుమూల ప్రాంతాన్ని, దేశాన్ని, ఖండాంతరాలనూ దాటి ప్రపంచ ప్రసిద్ధ కావ్యాల జాబితాలో గబ్బిలం తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. గబ్బిలం కావ్యం గుర్రం జాషువా అనుభవంలో నుంచి పుట్టిన కావ్యం. నాటి పరిస్థితులను గుర్తుచేస్తూ జాషువా ఇలా చెబుతాడు.." తూచి చెప్పరాని నెత్తుటి సిరాతో నా కులం వారు శోకరసంతో నిండిన అనేక కావ్యాలు రాస్తున్నారు. అగ్రజాతి వారి వజ్రం వంటి కఠినమైన మనస్సులు ఆ కావ్యాలకు కరిగి సంతోషిస్తాయో లేక మా వాళ్ల కావ్యాలు వారిని ఆనందింపజేయలేక అడ్డగింతలతో నశించిపోయి మామూలు దారుల్లో పడిపోతాయో! " (రెండవ భాగం 107వ పద్యం)
గబ్బిలం కావ్యంలోని కథానాయకుడు నాటి సమాజం నుంచి వెలివేయబడ్డ అరుంధతీ సుతుడు. తంజావూరు మండలానికి దక్షిణ దిక్కుగా ఓ మారుమూల ప్రాంతంలో నివసించే నిరుపేద. నిరంతరం ఆకలి బాధలను అనుభవిస్తూ చెప్పులు కుట్టి జీవనం చేస్తూ నిజాయితీగా జీవించే కడు పేదవాడు. ఓ రోజు రాత్రి తన గుడిసెలో నిద్రకు ఉపక్రమిస్తుండగా గబ్బిలం కనిపిస్తుంది. దాన్ని చూడగానే ఆ నిరుపేదకు ఎంతో సంతోషం వేస్తుంది. ఎవ్వరూ రాని తన ఇంటికి ఓ గబ్బిలపు రాణి రావడంతో ఎంతో ఉత్సాహపడతాడు. తన గోడు స్వయంగా వినడానికి వచ్చిన మహా మానవిలా ఆ గబ్బిలం కనబడుతుంది. శివాలయంలో ఎప్పుడూ శివయ్య పక్కనే వెలాడుతూ ఉండే ఆ గబ్బిలానికి తన గోడు, తన జాతి గోడు చెప్పుకుంటే ఆ శివుడి చెవిన పడి తన జాతి కష్టాలు తీరుతాయనే ఆశతో ఆ గబ్బిలపు మహారాణి ముందు తన బాధ వెళ్లబోసుకుంటాడు. శివుడి చెవిన తన బాధ చేర వేయమని కోరతాడు. దుఃఖంతో నిండిన హృదయంతో తన విషయాలన్నీ గబ్బిలంతో పంచుకుంటాడు. " గర్వంతో నిండిన ప్రపంచంలో పేద వాళ్లకు పురుగూ, పుట్రా కాకుండా ఆప్తులు, చుట్టపక్కాలూ ఉంటారా..? (మొదటి భాగం 14వ పద్యం). గబ్బిలంతో ఆ అభాగ్యుడు ఇంకా ఇలా చెబుతాడు.. " కులమే లేని నేను కొడుకులను కని ఈ అగాధంలోకి వాళ్లను కూడా తోసి వేయడం ఎందుకు ? పుట్టుకతోనే బానిసగా చూడబడే నాకు భార్య ఎందుకు ? అందుకే బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నానని చెబుతాడు (మొదటి భాగం 9వ పద్యం). సాయంకాలం పడమరగా, ఉదయం తూర్పుగా నడిచేటటువంటి సనాతన ధర్మం అనే గోవుల నుండి పితికిన పాలు పేదవాళ్లకు దొరకవు కదా (మొదటి భాగం 18వ పద్యం) అంటూ ఆవేదన వ్యక్తపరుస్తాడు. " కర్మ సిద్ధాంతం పేరుతో నా నోరు కట్టేసి, నా తిండిని స్వార్థపరులైన వారు అనుభవిస్తున్నారు. కర్మ అంటే ఏమిటో దానికి ఎందుకు ఇంత కక్షో ఆ శివుడుతో నిరూపణ చేయించు తల్లి " (మొదటి భాగం 25 వ పద్యం) అంటూ గబ్బిలాన్ని వేడుకుంటాడు. ఈ విషయాలన్నీ ఆ శివయ్యతో చెప్పి తనకు, తన జాతికి విముక్తి ప్రసాదించమని ఆ నిరుపేద కోరతాడు. తన సందేశాన్ని ఆ శివుడితో చెప్పి తీపి కబురు తీసుకొస్తే " ఓ కరుణామయీ..! నువ్వు చేసిన రాయబారానికి నా కన్నీళ్ళతో నిత్యం నిన్ను అభిషేకిస్తాను స్వీకరించు. ఇంతకు మించి ఇప్పుడు నా నుండి ఇంకేమీ ఆశ పడవద్దు. స్వతంత్రమనే మేడలో నాకు నివాసం దొరికినట్లైతే నీ బాకీ తీరుస్తానని "(రెండో భాగం 35వ పద్యం) ఆ గబ్బిలానికి హామీ ఇస్తాడు. అతని బాధ మొత్తం ఆలకించిన గబ్బిలం టపటపమని రెక్కలు కొట్టుకుంటూ ఎగిరిపోతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి