అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ పరీక్షల కోసం అభ్యర్థులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక పరీక్ష తేదీలను ప్రకటిస్తూ వెబ్ నోట్ విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి జనువరి 5 వరకు వివిధ సబ్జెక్టుల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అయితే, ఈ షెడ్యుల్ ప్రకారం పరీక్షలు జరిగేనా అనే సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి.

నవంబర్ 27తో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. మూడు రోజుల తర్వాత నవంబర్ 30న పరీక్షకు అర్హులైన అభ్యర్థుల ప్రాథమిక జాబితా, అభ్యంతరాల స్వీకరణ తర్వాత డిసెంబర్ 8న తుది జాబితా విడుదల చేయాల్సి ఉంది. దీని ప్రకారం డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అయితే, నోటిఫికేషన్ లోని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ అభ్యర్థులు కొందరు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వివిధ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం వ్యవహారం మొత్తం ఉన్నత న్యాయస్థానం పరిధిలో ఉండడంతో అభ్యర్థులందరూ కోర్టు ఆదేశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేటి వరకు ప్రక్రియలో ఎలాంటి కదలిక లేకపోవడంతో యథాతథస్థితి కొనసాగుతూ ఉంది. దీంతో, డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు జరిగేనా అని అభ్యర్థుల్లో సందేహం వ్యక్తమవుతూ ఉంది. ఒకవేళ నేడు రేపట్లో కోర్టు ఆదేశాలు విడుదలయితే దరఖాస్తులు స్కూటీని ప్రక్రియ, పరీక్షకు అర్హులైన అభ్యర్థుల తుది జాబితా ప్రకటించడానికి కనీసం పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే సుమారు డిసెంబరు 16 వరకూ ఈ ప్రక్రియ కొనసాగవచ్చు. ఆ తరువాత హాల్ టికెట్ల విడుదలకు పరీక్షకు మధ్య రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో అనుకున్న షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరగడం ఎంతవరకు సాధ్యము అనే అంచనాలో అభ్యర్థులు వున్నారు. ఏపీపీఎస్సీ కూడా స్క్రీనింగ్ పరీక్షల తేదీలను తాత్కాలిక తేదీలుగానే వెబ్ నోట్ లో పేర్కొనడం, దరఖాస్తుల స్వీకరణ తరువాత ప్రక్రియ మొత్తం నిలిచిపోవడంతో 18 నుంచి జరగాల్సిన పరీక్షల నిర్వహణ ఎంతవరకు సాధ్యం అని అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. భర్తీ ప్రక్రియ పూర్తి చేసి విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం ధృఢసంకల్పంతో ఉంది. ఏది ఏమైనాప్పటికీ ఉన్నత న్యాయస్థానం నుంచి మార్గదర్శకాలు విడుదలైతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి