జీవిత పాఠం చెప్పే నవల
.jpg)
వాళై సినిమాలో అందమైన బాల్యం కనిపిస్తుంది. విరబూసిన ప్రకృతి కనిపిస్తుంది. కల్మషం లేని స్నేహం కనిపిస్తుంది. రాలిపడే మంచు బిందువులు, ఎగిరే సీతాకోకచిలుకుల ప్రేమ సందేశం కనిపిస్తుంది. బాల్యం తాలూకూ తీపి జ్ఞాపకాలు ప్రతి ఫ్రేములోనూ మనల్ని కట్టిపడేస్తాయి. కానీ, నాకెందుకో ఈ సినిమాలో అందం కన్నా ఆకలి కనిపించింది. పొయ్యి మీద పొగలుకక్కుతూ ఉడికే అన్నంకుండ నా గుండెను కదిలించింది. గుండెలు పగిలే వేదనలో కూడా ఓ ముద్దబువ్వ నోట్లో పెట్టుకునే సన్నివేశం నా కంట కన్నీరు తెప్పించింది. ఈ సినిమాలో అందరూ అందాన్ని చూస్తుంటే నాకెందుకో ఆకలి, బాధలు, పేదలు కనిపించారు. నాణానికి రెండు వైపులా ఉన్నట్టు, అందాన్ని - ఆకలిని సమంగా చూపించిన గొప్ప ప్రతిభాశాలి మారి సెల్వరాజ్. పేదల బ్రతుకుల్లో ప్రమాదాలు లేనిదెక్కడ, ఆకలి తీర్చుకోవడానికి వాళ్ళు పడే బాధలు కత్తిమీద సామే కదా. ఆకలితో కలిసి పెరిగిన వారికే ఆకలి అంటే ఓ వేదన అని తెలుస్తుంది. వేడివేడి అన్నాన్ని చూస్తే వారి మనసు ఉప్పొంగుతుంది. ఆకలితో ముడిపడిన ఈ విషాద సంతోషాలు కొందరికే కనిపిస్తాయి. వీటిని చూడాలంటే జీవితానుభవం కావాలి. బహుశా మారి సల్వరాజ్ కి ఇలాంటి జీవితానుభవాలు ఉండే ఉంటాయి. అందుకే నేర్పుగా ఆకలిని ఒడిసిపట్టాడు. ఉడికే అన్నం కుండని అందంగా చూపించాడు. కణకణ మండే కాలే కడుపులోకి అన్నం ముద్ద జారుతున్నప్పుడు కళ్ళలో తలుక్కున మెరిసే ఓ మెరుపు అందరికీ కనిపించదు. ఆ మెరుపును మారి సెల్వరాజ్ చూశాడు. ఆ మెరుపే వాళై సినిమాకు జీవం పోసింది.
ఆటో బోల్తా మిరప కూలీలు మృతి. అదుపు తప్పిన లారీ - వలస కూలీల దుర్మరణం. గాల్లో కలిసిపోయిన పత్తి కూలీల నిండు ప్రాణాలు.. తరచుగా ఇటువంటి వార్తలు చదువుతూనే ఉంటాం, వింటూనే ఉంటాం. ఈలాంటి సంఘటనలు విన్నా, చూసినా కొద్ది సేపటికే మర్చిపోతాం. మృతుల జీవితాలు గతంలో ఎలా ఉంటాయో తెలుసుకునే అవకాశం ఉండదు. కానీ ఇలాంటి కూలీల, పేదల జీవిత కథలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే, ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యధికంగా పేదలు ఉన్న మన దేశంలో అరుదుగా సినిమా తెరపై కనిపించే కొందరి పేదల, కూలీల జీవిత కథలను చూడటం అవసరం. వాళై సినిమా యదార్థ సంఘటన ఆధారంగా చిత్రీకరించిన సినిమా. 1999లో తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఆ కూలీల జీవిత కథను వాళై సినిమాగా మారి సెల్వరాజ్ తెరకెక్కించారు. సినిమాలో ప్రధాన పాత్ర పన్నెండేళ్ళ కుర్రవాడు శివనెంజా. తల్లి, అక్కతో కలిసి ఓ పల్లెటూర్లో నివసిస్తూ ఉంటాడు. ఆ ఊర్లో అందరూ కూలీలే. అరటి తోటల్లో గెలలు కోసి వాటిని లారీల్లో నింపడం వాళ్ళ పని. ఈ పని తప్ప ఆ ఊరి వారికి కడుపు నింపే ఆధారం మరొకటి ఉండదు. దీన్ని ఆసరాగా తీసుకొని ముందుగానే కూలీలకు కొంత డబ్బు చెల్లించి వాటికి వడ్డీలు చక్రవడ్డీలు అంటూ అరటి తోటల యజమానులు కూలీల రక్తాన్ని పిండుతూ ఉంటారు. ఎంత పని చేసినా కడుపు నిండటమే తప్ప రూపాయి కూడా మిగులుదల ఉండదు. దీంతో చేసిన అప్పులు తీర్చేందుకు స్కూలుకు వెళ్లే పిల్లల్ని కూడా సెలవు రోజుల్లో అరటి తోటల్లో గెలలు మోయడానికి తీసుకెళ్తూ ఉంటారు. ఇలా శివనెంజా కూడా సెలవు రోజుల్లో తన తల్లి, అక్కతో కలిసి కూలి పనికి వెళ్తూ ఉంటాడు. అరటి తోటలో పనంటే శివనెంజాకు నరకంతో సమానం. మరోవైపు స్కూలంటే ఆ కుర్రాడికి స్వర్గంతో సమానం. ఇలా స్వర్గ నరకాల మధ్య శివనెంజా బాల్యం గడిచిపోతూ ఉంటుంది. సినిమా మొత్తం శివనెంజా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతని అందమైన బాల్యం ఓ వెైపు, అరటి తోటల్లో పేదల కష్టాలు, కడుపు నింపుకోవడానికి వాళ్ళు పడే బాధలు మరోవైపు. ఈ రెండిటిని సమంగా దర్శకుడు మారి సెల్వారాజ్ అత్యద్భుతంగా చిత్రీకరించారు. సినిమా చివరిలో జరిగే ఘోర రోడ్డు ప్రమాదం ఈ సినిమాకి మూలకథ. ఎన్నో ఆశలు కోరికలతో బతికీడుస్తున్న 19 మంది జీవితాలు అరటిలోడు లారీ క్రింద నలిగిపోతాయి. ఈ ప్రమాదంలో అనుకోకుండా శివనెంజా ఒక్కడే బతికి బయటపడతాడు. ప్రేమించి అండగా నిలిచే అక్క, ప్రాణస్నేహితుడు ఆ ప్రమాదంలో మరణిస్తారు. ఓవైపు గుండెలు పిండేసే దుఃఖం. మరోవైపు కాలేకడుపు. ఏమీ అర్థం కాని బాల్యం.. ఈ మూడు భావోద్వేగాలను పొన్వెల్ ( శివనెంజా) అత్యద్భుతంగా నటించాడు. ఉడికే అన్నం, తిరగబడిన లారీ చక్రం పేదల జీవితాలకు ప్రతీకలుగా కనిపిస్తాయి. అందమైన బాల్యం ఓ వైపు, ఆకలి బాధలు మరోవైపు రెండిటిని సమంగా చూపించడంలో దర్శకుడు మారి సెల్వరాజ్ నూరుపాళ్ళు విజయం సాధించారు. 2 గంటలు 14 నిమిషాల ఈ సినిమా కొందరికి అందంగా కనిపిస్తే మరికొందరికి సందేశాత్మకంగా కనిపిస్తుంది. రెండు రకాల కోణాలను ఏకకాలంలో చూపించడం దర్శకుడి ప్రతిభ.
దళిత బహుజన భావజాలం ఉన్న మారి సెల్వరాజ్ తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. నలభై ఏళ్ళ ఆ యువదర్శకుడు ఇప్పటికి నాలుగు సినిమాలు మాత్రమే తీశారు. ఈ నాలుగూ వేటికవే ప్రత్యేకం. ' కర్ణన్ ' సినీమా చూడని తెలుగు తమిళ ప్రేక్షకులు ఉండరు. దళితులు, అణగారిన వర్గాల జీవిత కథలను ఎంచుకొని సినిమాగా తెరకెక్కించడం మారి సెల్వరాజ్ ప్రత్యేకత. ఆయన సినిమాల్లో పేదలే హీరోలు. వారి జీవితమే అత్యద్భుత కథనం. అట్టడుగు వర్గాల జీవితాలను చూపించాలంటే అనుభవం చాలా ముఖ్యం. మారి సెల్వరాజ్ కు ఇటువంటి అనుభవాలకు కొదవలేదు. అందుకే ఆయన ప్రతి సినిమాలో అంబేద్కర్ కనిపిస్తాడు. సమాజాన్ని ప్రశ్నించే సంభాషణలు వినిపిస్తాయి. వాళై కూడా ఈ కోవకు చెందిన సినిమానే. పెట్టుబడిదారులు కూలీల మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమాలో కనిపిస్తుంది. చిన్నచిన్న కోరికలు, సంతోషాలు పేదరికంలో ఎలా నలిగిపోతాయో కనిపిస్తాయి. పేదరికంలో గడిచిపోయే బాల్యంలోని ఎత్తుపల్లాలని చూడవచ్చు. వాళై సినిమా తప్పకుండా చూడాల్సిన సినిమా. మనలాగే మనతోపాటే మనతోనే కలసి జీవిస్తున్నా మనం చూడలేని పేదల జీవితాలను ఇలాంటి సినిమాల ద్వారానైనా చూసి తెలుసుకోవచ్చు.
- శిఖా సునీల్ కుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి