జీవిత పాఠం చెప్పే నవల

చిత్రం
సరిగ్గా పదేళ్ల క్రితం ' కాలుతున్న పూలతోట ' నవలను వదలకుండా ఒక్క పుటలోనే చదివేశాను. ఆ తరువాత కొంతకాలానికి రెండోసారీ చదివాను. చదివిన పుస్తకాన్నే మళ్లీ కొన్ని రోజులకు చదివితే కొత్తగా అర్థమవడం సహజం. ఆ నాటికి ఈ నవల కొత్తగానే అర్థమైంది. ఇదిగో, మళ్ళీ ఈ డిసెంబరు 1న 36వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ముచ్చటగా మూడోసారీ చదివేశాను. ఓ పుస్తకాన్ని చివరి వరకూ చదివే అలవాటు లేని నాకు ఓ నవలను మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం. ఈ నవలలో ఇంతగా నన్ను ఆకర్షించింది నాగమణి పాత్ర. ఆమె అరుదైన కథానాయకి. ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరిన ధీరవనిత. చావును జయించి గెలుపు జండా ఎగురవేసిన నిరక్షరాస్యురాలు. నాగమణి గురించి ఎంతచెప్పినా తక్కువే. అంతకన్నా ముందు ఈ నవల నేపథ్యాన్ని చెప్పుకోవడం అవసరం. ప్రపంచానికి ఎయిడ్స్ వ్యాధి పరిచయం అయిన నలభై నాలుగేళ్లలో 1995 - 2007 మధ్య కాలాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పుష్కరకాలంలో ఎయిడ్స్ మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని గడగడలాడించింది. 1995కు ముందు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో పెద్దగా భయం కనిపించలేదు. 2007 తర్వాత హెచ్ఐవి బారి...

మనసును కరిగించే 'మల్లెపువ్వు'

నలభైనాలుగేళ్ల క్రితం తెలుగులో విడుదలైన సినిమా మల్లెపువ్వు. 'వెల లేని మల్లెకు, వెలకు నలిగే మల్లెకు ఎంత తేడా ఉంటుందో ' మల్లెపువ్వు సినిమా చూస్తే తెలిసిపోతుంది. ఇంత గొప్ప సినిమా కథ నిజానికి హిందీలో పుట్టింది. 1957లో దర్శకుడిగా, నిర్మాతగా, గురుదత్ స్వయంగా హీరోగా నటించి " ప్యాసా " అనే పేరుతో ఈ సినిమాను హిందీ ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. విఫల ప్రేమికుడైన ఓ నిరుపేద వర్ధమాన కవి కథే ప్యాసా ఇతివృత్తం. ఈ సినిమా ఓ అద్భుత కళాఖండం. అయినప్పటికీ, హిందీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేక పోయింది. కానీ, తెలుగు ప్రేక్షకుల అదృష్టం కొద్దీ ఆ తరవాత ఇరవై ఒక్క ఏళ్ళకి 1978లో మల్లెపువ్వు పేరుతో ప్యాసా సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. శోభన్ బాబు కోసమే ఈ కథ పుట్టినట్టు తెలుగులో తప్పక చూడదగ్గ సినిమాల జాబితాలో మల్లెపువ్వు చేరిపోయింది.


మల్లెపువ్వు విడుదలై నలభైనాలుగేళ్లు దాటిపోయింది. ఇప్పుడెందుకు ఈ రివ్యూ అన్న ప్రశ్న రావచ్చు. అందరూ చూసిన చిత్రమే కదా అనిపించవచ్చు. కానీ, సాహిత్యాన్ని, సంగీతాన్ని, మంచి సినిమా కథనూ ఇష్టపడే ఏ ఒకరో, ఇద్దరో తెలుగు సినిమా ప్రేమికులు ఎక్కడో ఓ చోట ఈ సినిమా చూడకుండా మిగిలిపోయి ఉంటారనే భ్రమతో, ఈ సినిమాపై అమిత ఇష్టంతో ఇప్పుడు ఈ రివ్యూ రాయాల్సి వచ్చింది. నచ్చిన సినిమా గురించి ఎప్పుడైనా, ఎంత కాలనికైనా అభిప్రాయాన్ని పంచుకోవడం మంచిదే అని నా ఆలోచన. నా మటుకు నేను ఓ సినిమాని రెండుసార్లు చూడడం చాలా అరుదు. మల్లెపువ్వు సినిమా చూసిన రెండుసార్లూ, ఈ సినిమా పాటలు విన్న ప్రతిసారీ పరిపూర్ణమైన సాహిత్యాన్ని తాగిన మైకంతో నా మనసు కరిగిపోతుంది.

మల్లెపువ్వు చిత్రంలో హీరో పేరు వేణు. తన కోసమే ఈ పాత్ర సృష్టించబడినట్టు ఎంతో సహజంగా శోభన్ బాబు హీరోగా  గొప్పగా నటించాడు. కాలేజీ చదివేప్పుడే వేణు భావకవి. క్లాస్మేట్ లలిత (జయసుధ)తో ప్రేమలో పడి చివరికి విఫల ప్రేమికుడవుతాడు. కాలేజీ తరువాత నిరుద్యోగం, పేదరికం, కుటుంబ సభ్యుల చిన్నచూపుతో రోడ్డున పడతాడు. వేణు రాసుకున్న కవితలన్నీ మల్లిక (లక్ష్మి) అనే వేశ్యకు దొరుకుతాయి. ఇంతలో మాజీ ప్రేమికురాలు పెళ్లి చేసుకుని కనిపిస్తుంది.... ఏమీ చేయలేని నిస్సహాయతతో నలిగి పోయే హీరో క్యారెక్టర్ లో శోభన్ బాబు అధ్భుతంగా నటించాడు. ఈ సినిమా మొత్తంలో శోభన్ బాబు నవ్వుతున్నట్టు మనకు ఎక్కడా కనిపించడు. ఆదర్శ భావాల మధ్య నిరాశ, నిస్పృహతో నలిగి పోయే హీరో క్యారెక్టర్. డెబ్భైల నాటి వేశ్యావాటికలు, అప్పటి పేదరికం, నిరుద్యోగం, నాటి నిరుపేద కవుల జీవితం ఈ సినిమాలో చూడవచ్చు. ఈ సినిమా మొత్తానికి సంగీత, సాహిత్య మాయజాలాలు మన మనసులను కరిగించి వేస్తాయి. ఈ సినిమా కోసం చక్రవర్తి అందించిన బాణీలు తెలుగు సంగీత సామ్రాజ్యంలో చిరస్థాయిగా నిలిచి పోయాయి. ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి సాహిత్యం తనివి తీరనిది. వీటన్నిటికీ ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు వి.మధుసూదనరావు మల్లెపువ్వు సినిమాని తెరకెక్కించాడు. మంచి సినిమాని ఇష్టపడేవారు, సాహిత్యాన్ని ప్రేమించేవారు మిస్ కాకూడని సినిమా మల్లెపువ్వు.

ఎవరికి తెలుసు...

చితికిన మనసు...

చితిగా రగులునని...

ఆ చితి మంటల చిటపటలే...

నాలో రగిలే కవితలని...

- శిఖా సునీల్

కామెంట్‌లు

  1. సునీల్...మల్లెపువ్వు నాకు బాగా ఇష్టమైన సినిమా.. నేను 9వ తరగతిలో ఉండగా వచ్చింది. నాకు తెగ నచ్చేసింది. అప్పట్లో అందులో పాటల్ని కంటస్తం చేశాను. వేణు క్యారెక్టర్ లో నన్ను నేను చూసుకున్నాను. ఎందుకంటే అప్పుడు నేను చిన్నా చితకా కవితలు కెలికేవాడిని. ఆ తర్వాత నేనూ ప్రేమలో పడటం నా ప్రియురాలు ఆ తర్వాత వేరే వారిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం,, నేను భగ్న ప్రేమికుడిగా మిగిలిపోవడం నా జీవితంలోనూ జరిగాయి కాబట్టి.
    ఎవరికి తెలుసు...
    చితికిన మనసు...
    చితిగా రగులునని...
    ఆ చితి మంటల చిటపటలే..
    నాలో రగిలే కవితలని...
    ఈ పాట నాకు బాగా ఇష్టం.

    రిప్లయితొలగించండి
  2. అవును సార్.. మల్లెపువ్వు పాటలు విన్న ప్రతిసారీ పరిపూర్ణమైన సాహిత్యాన్ని తాగిన మైకంతో నా మనసు కూడా తూలిపోతుంది.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్